ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అంశాలను వదిలేసి.. ఇతర విషయాలను ఏపీ టీడీపీ ఎంచుకుంటోందా? డ్రగ్స్ విషయంలో టీడీపీ ఆరోపణలపై జరుగుతున్న చర్చ ఏంటి? చేతిలో ఉన్న అస్త్రాలను విడిచిపెట్టి.. పసలేని వాదన చేస్తున్నట్టు పార్టీలోనే చెవులు కొరుక్కుంటున్నారా?
డ్రగ్స్ కేసులో టీడీపీ విమర్శలపై పార్టీలోనే భిన్నమైన చర్చ!
ఏపీలో డ్రగ్స్ రాజకీయం రచ్చ రేపుతోంది. ఒక్క గ్రాము మత్తుపదార్ధం దొరకలేదు. ఒక్క వ్యక్తీ ఇక్కడ అరెస్ట్ కాలేదు. కానీ.. 21 వేల కోట్ల డ్రగ్స్ సరఫరాకు ఏపీనే వేదిక అన్నంతగా రాజకీయ చర్చ.. రచ్చ మొదలైంది. బురదే కదా వేసేద్దాం అన్నట్టు రాజకీయ పక్షాలు ఈ సంచలన విషయాన్ని అధికార పక్షానికి అంట కడుతున్నాయి. అసలు అంశాలను పక్కన పెట్టి టీడీపీ సైతం డ్రగ్స్ కేసును ఎత్తుకోవడంపై పార్టీలోనే భిన్నమైన చర్చ జరుగుతుంది. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో పది రోజుల క్రితం పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసులో విజయవాడ పేరు రావడంతో అందరి దృష్టీ ఏపీపై పడింది. రాష్ట్రానికి చెందిన దంపతులకు ఈ కేసులో భాగస్వాములుగా తేలారు. ఒకవైపు దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే విపక్ష పార్టీలు ఈ కేసుకు పొలిటికల్ కలర్ ఇచ్చేశాయి.
డ్రగ్స్ కేసులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని చంద్రబాబు విమర్శలు..!
ప్రైవేటు పోర్టుల వల్లే ఇలా జరుగుతోందన్నది వామపక్షాల ఆరోపణ. సమగ్ర దర్యాప్తునకు సీపీఎం డిమాండ్ చేస్తోంది. ఇక్కడితో ఆగితే బాగోదని అనుకుందో ఏమో.. టీడీపీ మరో అడుగు ముందుకేసింది. డ్రగ్స్ అంశాన్ని వైసీపీకి.. రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతూ విమర్శలు చేసింది.
తాలిబన్లకు, తాడేపల్లికి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు టీడీపీ నేతలు. ఆ తర్వాత చంద్రబాబు సైతం ఇది ప్రభుత్వ వైఫల్యంగా విమర్శించి.. ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఉందని రంగు పులిమే ప్రయత్నం చేశారు. సీఎం ఇంటి సమీపంలోని సంస్థకే గుజరాత్ నుంచి డ్రగ్స్ అంటూ విమర్శల ఘాటు పెంచారు చంద్రబాబు.
జనాల్లోకి వెళ్లే అంశాలను వదిలేశారని టీడీపీలోనే అసంతృప్తి..!
వాస్తవానికి ఈ వారంలో ఏపీలో జరిగిన మూడు ఘటనలపై చర్చ సాగింది. ఒకటి సమాచారశాఖ ఉద్యోగుల ఫోన్లను బిల్లులు చెల్లించలేదని సర్వీస్ ప్రొవైడర్లు నిలిపేశాయి. ఈ విషయంలో ప్రభుత్వ వర్గాలు కొంత ఇబ్బంది పడ్డాయన్నది పొలిటికల్ సర్కిళ్లలో వినిపించే మాట. గుంటూరు జిల్లాలో హోంమంత్రి నియోజకవర్గంలో జరిగిన ఘటనల్లో వైఫల్యం చెందిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాగే చంద్రబాబు ఇంటి ఘటనలపై ముగ్గురు ఐపీఎస్‌లు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. పార్టీ పరంగా వీటిని టేకప్ చేయకుండా.. డ్రగ్స్ అంశాన్ని టీడీపీ భుజానకెత్తుకోవడం చర్చగా మారింది. జనాల్లోకి వెళ్లే అవకాశం ఉన్న అంశాలను చేపట్టకుండా.. ఇదేం వ్యూహమని టీడీపీలోనే అసంతృప్తి వ్యక్తమైందట.
టీడీపీ తీరుపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం..!
రాష్ట్రానికి సంబంధంలేని డ్రగ్స్ కేసులో ప్రభుత్వానికి, వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడంపై పొలిటికల్ సర్కిళ్లలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా బురద జల్లుడు కార్యక్రమమే తప్పితే.. ప్రయోజనం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలుగా భావించిన అంశాలను విస్మరించి.. డ్రగ్స్‌ను పట్టుకోవడమే తెలుగుదేశం శ్రేణులను ఆశ్చర్యపరిచిందట. మరి.. పార్టీ పెద్దలు ఈ విషయాన్ని గుర్తించారో లేదో.