ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ వాయిస్ లేదు. మాట్లాడే నాయకుడే కనిపించడం లేదట. చివరకు వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఉందట. మరి… ఇంఛార్జ్‌ను అయినా తేలుస్తారా?
కేడర్‌కు అందుబాటులో లేని మాజీ ఎమ్మెల్యే
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి. ఫ్యూడలిజంతోపాటు విప్లవ భావాలు ఈ నియోజకవర్గంలో ఎక్కువే. గతంలో ఇక్కడ చాలమంది నక్సల్ ఉద్యమంలో పనిచేశారు. అనంతపురం జిల్లాకు సరిహద్దులో ఉంటుంది. దేశమంతా కాంగ్రెస్ హవా ఉన్నప్పుడే తంబళ్లపల్లిలో స్వతంత్ర అభ్యర్థులు గెలిచేవారు. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారిపోయింది. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా మారింది. కానీ.. ప్రస్తుతం తంబళ్లపల్లిలో టీడీపీకి నాయకుడే లేని పరిస్థితి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ యాదవ్ 2019లో ఓడిపోయారు. తర్వాత కార్యకర్తలకు.. పార్టీకి అందుబాటులో లేకుండా పోయారని కేడర్ ఆరోపిస్తోంది.
2019లో శంకర్ యాదవ్‌కు కేడర్ సహాయ నిరాకరణ
2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శంకర్ యాదవ్ బెంగళూరులో ఎక్కువగా ఉండేవారని పార్టీ శ్రేణులు కుతకుతలాడేవి. అయినప్పటికీ 2019లో మళ్లీ శంకర్‌యాదవ్‌కే టికెట్ ఇచ్చింది పార్టీ. చంద్రబాబు నిర్ణయం రుచించని పార్టీ కార్యకర్తలు ఆ ఎన్నికల్లో సరిగా పనిచేయలేదట. దీంతో 2019లో వైసీపీ నుంచి బరిలో దిగిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి కుటుంబానిదే హవా.
అంగళ్ల ఘటన తర్వాత తంబళ్లపల్లికి వచ్చిన నేతలే లేరు
2019లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. జిల్లా సీనియర్లు దృష్టి పెట్టడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో నాయకులు లేకున్నా కార్యకర్తలు పోటీ ఇచ్చారు. బలవంతంగా నామినేషన్లు విత్‌డ్రా చేయిస్తున్నప్పటికీ అజ్ఞాతంలోకి వెళ్లిన 16 మంది టీడీపీ సర్పంచ్‌లుగా గెలిచారు. ఇదే సమయంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తంబళ్లపల్లి వస్తుండగా అంగళ్లు సమీపంలో కార్లపై దాడులు జరిగాయి. ఆ సమయంలో పార్టీ నేతలు కొంత హడావిడి చేసినా.. తర్వాత నియోజకవర్గంవైపు చూసినవాళ్లు లేరు.
నల్లారి, లక్ష్మీదేవి కుటుంబాలపై చర్చ
తాజాగా తంబళ్లపల్లి టీడీపీ ఇంఛార్జ్ కోసం కసరత్తు చేస్తున్నారు. శంకర్‌యాదవ్ ప్రయోగం వికటించిందనే భావనలో ఉన్న పార్టీ శ్రేణులు.. ప్రత్యామ్నాయం కోరుతున్నారట. దీంతో నల్లారి కుటుంబం లేదా మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి కుటుంబానికి పగ్గాలు అప్పగించొచ్చని చర్చ జరుగుతోంది. లక్ష్మీదేవి కుటుంబాన్ని తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయట. ఒకవేళ సరైన అభ్యర్థి దొరక్కపోతే తన కుమారుడిని బరిలో దింపుతానని నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి చెప్పినట్టు సమాచారం. దీంతో తంబళ్లపల్లి టీడీపీ కొత్త సారథి ఎవరనే చర్చ ఆసక్తిగా మారింది. కొత్త ఇంఛార్జ్ వస్తే కానీ.. డిశ్చార్జ్ అయిన కేడర్‌లో నూతనోత్సాహం రాదని అంటున్నారట. మరి.. చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.