కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.
బద్వేల్ లో జరగబోయే ఉప ఎన్నిక స్థానిక పోలీసులతో నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తూ బీజేపీ నేతలను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్.ఐ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకూ అందరినీ ఉప ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరారు బీజేపీ నేతలు. వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పరిస్థితి పై వివరించామని, స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం 15 ఫ్లటూన్ల ప్యారామిలిటరీ బలగాలను పంపారన్నారు సోము వీర్రాజు. స్వేచ్ఛాయుత వాతావరణం లో ఎన్నికలు జరగాలంటే కేంద్ర బలగాలు అవసరం అన్నారు. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏజెంట్లుగా కూర్చోవడానికి లేకుండా బెదిరిస్తున్నారన్నారు. పారా మిలిటరీ బలగాలతో పేరేడ్ నిర్వహించి ఓటర్లలో నమ్మకం కలిగించాలన్నారు. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులను విధుల నుంచి తోలగించాలని కోరాం..
మంచి పనులు చేశామని వైసీపీ నేతలు ఓట్లు అడగటం లేదని, బెదిరింపులు అరాచకాలతో గెలవాలని చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు బద్వేల్ లో తిష్ట వేశారన్నారు. ఓటర్లకు విశ్వాసం కలిగించేలా ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ప్రజల్లోకి వస్తే నిలదీస్తారనే సీఎం ఎన్నికల ప్రచారంలో దూరంగా ఉన్నారన్నారు.