హమ్మయ్య.. 2 వేల కోట్లు వచ్చేశాయ్.. రిలాక్స్..!

సంక్షేమ పథకాల అమలుకు పెరుగుతున్న భారం.. వీటికి తోడు జీతాలు, పెన్షన్లు ఇతర కార్యక్రమాలకు భారీ స్థాయిలో వెచ్చించాల్సి రావడం.. వీటితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాస్త ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ పరిస్థితిని తట్టుకునేందుకు.. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గనతో పాటు.. ఆ శాఖ ఉన్నతాధికారులు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలను సైతం బుగ్గన కలిశారు.

సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రాధాన్యం.. జనం తిరిగి డబ్బులు ఖర్చు చేస్తారు కాబట్టి.. వాటితో ప్రభుత్వానికి ఆదాయం పెరిగే మార్గాలు ఉండడం.. తిరిగి అప్పులు సులభంగా తీర్చే అవకాశం ఉండడం లాంటి పరిణామాలను.. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే అవకాశం ఉన్నప్పుడల్లా.. కేంద్రానికి, బ్యాంకులకు వివరిస్తూ వస్తోంది. చివరికి.. ఈ ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చినట్టే కనిపిస్తోంది. తాజాగా.. రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయలు రుణంగా వచ్చాయి.

రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వం.. 2 వేల కోట్ల రుణాన్ని దక్కించుకుంది. వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలానికి 7 శాతం చొప్పున.. మరో వెయ్యి కోట్లను 20 ఏళ్ల కాలానికి 7.02 శాతం చొప్పున వడ్డీ చెల్లించి.. పూర్తి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. దీంతో కలిపి.. బహిరంగ మార్కెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 22 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించినట్టుగా.. అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నిధులతో… ప్రభుత్వం సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అలాగే.. జీతాలు సైతం సకాలంలో అందించి.. ప్రభుత్వ సిబ్బందిని పరిపాలన క్రమంలో కార్యోన్ముఖులను చేయనున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈ 2 వేల కోట్ల రుణం అన్నది.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో కాస్త పెద్ద ఊరటే అన్న విషయమైతే వాస్తవమని.. రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇంకా బహిరంగ మార్కెట్ లో.. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ.. ప్రభుత్వం కచ్చితంగా నిధులు సేకరించే అవకాశం ఉందని తెలుస్తోంది

Related Articles

Latest Articles

-Advertisement-