మరో రూ.2,500 కోట్ల అప్పు తీసుకున్న ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది. మరో రూ.500 కోట్లను 16 ఏళ్ల కాలపరిమితితో 7.24 శాతం వడ్డీ చెల్లించేలా తీసుకుంది. కాగా గడిచిన 8 రోజుల్లో ఏపీ ప్రభుత్వం రూ.4,500 కోట్ల మేర రుణం తీసుకుంది.

Read Also: మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?… పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్

మరోవైపు బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు చివరి మూడు నెలలకు సంబంధించి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన రుణాల విషయంలో రాష్ట్ర ఆర్థిక అధికారులకు, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడిన నేపథ్యంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి రుణ మొత్తం పరిమితి ఖరారు కాలేదని సమాచారం. ఈ లోపు రూ.2,500 కోట్ల రుణాన్ని సెక్యూరిటీల వేలంలో పాల్గొని సమీకరించుకోవచ్చని కేంద్రం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే చివరి త్రైమాసికానికి సంంధించి రుణ పరిమితి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

Latest Articles