రోడ్లు బాగుచేయడంపై దృష్టి పెట్టండి.. సీఎం ఆదేశాలు

వర్షాలతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. వాహనదారులకు రోడ్లు నరకపాయంగా మారిపోయాయి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యవహారంలో విమర్శలు కూడా వెల్లువిత్తాయి.. ఈ నేపథ్యంలో రోడ్లు బాగు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఏపీ సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి, శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి.. సంబంధిత అధికారులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అక్టోబర్‌ మాసానికల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయి.. తర్వాత పనుల కాలం మొదలవుతుందన్నారు.. ముందుగా రోడ్లను బాగుచేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించిన ఆయన.. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగుచేయాలన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం.. గత ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా విడిచిపెట్టారని మండిపడ్డారు.

ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు మంచిగా పడుతున్నాయన్నారు సీఎం వైఎస్‌ జగన్.. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడ్డం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్న ఆయన.. వర్షాలతో మరోవైపు రోడ్లు కూడా దెబ్బతిన్నాయని.. రోడ్లను బాగుచేయడనికి ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు.. వనరుల సమీకరణలో అనేక చర్యలు తీసుకుంటున్నాం.. ఒక నిధిని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్‌. మరోవైపు.. మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేశారు సీఎం జగన్.. దురుద్దేశంతో ప్రచారం చేసినా మనం చేయాల్సిన పనులు చేద్దామని.. ఈ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దాం అన్నారు.. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే… నెగెటివ్‌ ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. మనం బాగుచేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే దీనికి సాక్ష్యాలుగా నిలబడతాయన్న సీఎం.. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచారు.. మిగిలిన చోట్ల కూడా ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబర్‌లో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని.. క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు.

Related Articles

Latest Articles

-Advertisement-