వరద బాధితుల కోసం జోలె పట్టాలని ఏపీ బీజేపీ పిలుపు

ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం జోలె పట్టి విరాళాలను సేకరించాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు పిలుపునిచ్చారు. వరద ప్రభావిత జిల్లాలలో బాధితులను ఆదుకునేందుకు ఈనెల 25, 26 తేదీల్లో విరాళాల సేకరణకు కార్యాచరణ రూపొందించినట్లు సోము వీర్రాజు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విరాళాలను సేకరిస్తామని, ప్రజలు నగదు, వస్తు రూపంలో విరాళాలను అందజేయవచ్చని సూచించారు. ఇలా వసూలు చేసిన విరాళాలను వరద బాధితులకు అందిస్తామన్నారు. కాగా విరాళాల సేకరణ కార్యక్రమం కారణంగా ఈ నెల 26న జరగాల్సిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీని వాయిదా వేసినట్లు సోము వీర్రాజు తెలిపారు.

Read Also: పన్ను వాటాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

కాగా ఏపీలో భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలపై ఏపీ బీజేపీ నేతలే కాకుండా తెలంగాణ బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఎడతెగని వర్షాలతో కన్నీటి కడలిలా మారిన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల అగచాట్లు చూస్తుంటే తన గుండె బరువెక్కుతోందన్నారు. పిల్లాపాపల బేల చూపుల మధ్య… ఏం చెయ్యాలో దిక్కుతోచక స్తంభించిపోయిన ఆ జీవితాలు ఎప్పటికి తేరుకుంటాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles