అమరావతి రైతులకు న్యాయం చేయాల్సిందే: అశోక్‌బాబు

మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకోవడంతోనే అంతా అయినట్లు కాదని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు అన్నారు. సీఆర్డీఏ యాక్ట్ 2014 ప్రకారం ప్రభుత్వం రైతులకు చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. అమరావతి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, కౌలుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టు పరిధిలో ఉన్నాయని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అశోక్‌ బాబు అన్నారు.

రాజధానికి రూ.లక్షకోట్లు అవసరమవుతాయన్నది పచ్చి అబద్దమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నిజంగా రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టినా, రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల ఆస్తి సమకూరుతుందని ఆయన అన్నారు. అమరావతి ఉద్యమం ఒక కులానికి, ఒక ప్రాంతాని కి పరిమితమైందని దుష్ప్రచారం చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మూడు రాజధానుల బిల్లుని రద్దు చేసిందో చెప్పాల ని ఆయన డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల శిబిరంలోని వారు, ప్రభుత్వనిర్ణయంపై ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వం చేసిన రూ.5 లక్షల కోట్ల అప్పుఎవరు తీర్చాలి?
ఎవరు తీరుస్తారని ఇష్టమొచ్చినట్లు అప్పులు చేస్తున్నారో సీఎం జగన్‌ రాష్ర్ట ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మూడు రాజధానుల బిల్లులోని పొరపాట్లను గమనించి ప్రభుత్వం వెనక్కుతీసుకున్నా, దానిలోని అంశాలను తాము వదిలి పెట్టబోమన్నారు. ప్రజలకు, మరీ ముఖ్యంగా రాజధాని రైతులు పోరాటంలో తొలిమెట్టు మాత్రమే ఎక్కా రు. చట్ట సభల్లో సాధించలేని విజయాన్ని ప్రజా పోరాటంతో సాధించామని ఈ సందర్భంగా అశోక్‌బాబు తెలిపారు.


అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
నేటి సభలో ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మాటలు వింటే, రాష్ట్రాన్ని మరింత నాశనం చేయడానికి సిద్ధమవుతున్నారా అనిపించిందని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మీ నిర్ణయాలు అశాస్త్రీయంగా, చట్టవిరుద్ధంగా ఉన్నాయనే వెనక్కు తగ్గారు. స్వయం ప్రతిపత్తితో కూడిన రాజధాని అమరావతికి ఎవరి దయాదాక్షిణ్యాలు, ఎలాంటి పెట్టుబడి అక్కర్లేదు. గత ప్రభుత్వంలో అన్ని జిల్లాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపించింది. ఇది ఇంటర్వెల్ మాత్రమే అంటున్నారు.. క్లైమాక్స్ లో నష్టపోయేది మీరేనని ఆయన అన్నారు. మహిళల్ని అవమానించేలా, సభ్య సమాజం సిగ్గుపడేలా అసెంబ్లీలో వ్యవహ రించారు. మీ మాటలు, వాటి తాలూకా మరకలు మీరు రాష్ట్రం వదిలి పోతేనే మాసిపోతాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఏదో ఒక తప్పు చేయడం, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరో తప్పు చేయడం ఈప్రభుత్వానికి అలవాటుగా మారిందని వైసీపీని ఏకీ పారేశారు.

Related Articles

Latest Articles