40 ఏళ్ళ అమితాబ్ బచ్చన్ ‘యారానా’

(అక్టోబర్ 23న ‘యారానా’కు 40 ఏళ్ళు)
అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్ – ఆ రోజుల్లో వీరిద్దరూ పోటాపోటీగా నటించేవారు. అమితాబ్ హీరోగా నటించిన అనేక చిత్రాలలో అంజాద్ ఖాన్ విలన్ గా అభినయించారు. కానీ, వారిద్దరూ మిత్రులుగా నటించిన చిత్రం ‘యారానా’ కూడా ఆకట్టుకుంది. అంజాద్ ఖాన్ తన కెరీర్ లో అతి తక్కువ చిత్రాలలో పాజిటివ్ రోల్స్ పోషించారు. వాటిలో ఈ ‘యారానా’ ఒకటి. 1981 అక్టోబర్ 23న విడుదలైన ‘యారానా’ స్నేహబంధంలోని మాధుర్యాన్ని చాటుతూ జనాన్ని ఆకట్టుకుంది.

కథ విషయానికి వస్తే- కిషన్, బిషన్ చిన్ననాటి మిత్రులు. కిషన్ సాధారణ కుటుంబానికి చెందినవాడు. కష్టపడి పైకి రావాలనే తత్వం కలవాడు. బిషన్ ధనవంతుల అబ్బాయి. కిషన్, బిషన్ స్నేహం చూసి, బిషన్ మేనమామకు ఈర్ష్య కలుగుతూ ఉంటుంది. తన సోదరి ఆస్తిపై కన్నువేసిన ఆ మేనమామ, పై చదువులకు బిషన్ ను విదేశాలకు పంపిస్తాడు. బిషన్ తిరిగి వచ్చే లోగా అతని ఆస్తిని మేనమామ, అతని కొడుకు జగదీశ్ హారతి కర్పూరం చేసేసి ఉంటారు. దాంతో బిషన్, తన కుటుంబం కోసం ఉన్న కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టి మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాడు. మిత్రుడు కిషన్ లో మంచి గాయకుడు ఉన్నాడని ప్రోత్సహిస్తాడు. కిషన్ ను చక్కగా తీర్చిదిద్దవలసిన బాధ్యతను కోమల్ అనే ఆమెకు అప్పగిస్తాడు బిషన్. కిషన్ గాయకునిగా తొలి ప్రోగ్రామ్ తోనే సక్సెస్ సాధిస్తాడు. తన మిత్రుని అప్పులు తీర్చి మళ్ళీ మునుపటిలా ఉండేలా చేస్తాడు. బిషన్ మేనమామ అతని ఆస్తి కాజేయడమే కాదు, చిన్నపిల్లలను బందీలుగా చేసుకొని వారితో తప్పుడు పనులు చేయించాలని చూస్తూంటాడు. బిషన్ ను పిచ్చివాడుగానూ మారుస్తాడు మేనమామ. అయితే మిత్రుడు కిషన్ తన సేవలతో బిషన్ ను మళ్ళీ మామూలు మనిషిని చేస్తాడు. చివరకు బిషన్ మేనమామ చెరనుండి బాలలను బంధవిముక్తులను చేస్తాడు కిషన్. మేనమామ మంటల్లో పడి చస్తాడు. జగదీశ్ జైలు పాలవుతాడు. అందరూ కలసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో కిషన్ గా అమితాబ్ బచ్చన్, బిషన్ గా అంజాద్ ఖాన్ నటించారు. నీతూ సింగ్, తనూజ, ఖాదర్ ఖాన్, లలితా పవర్, జీవన్, రంజిత్, రామ్ సేథీ, భరత్ భూషణ్, మోహన్ షెర్రీ, అరుణా ఇరానీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఈ నాటి మేటి హీరో హృతిక్ రోషన్ పెదనాన్న రాజేష్ రోషన్ సంగీతం సమకూర్చారు. అంజాన్ పాటలు రాశారు. ఇందులోని అన్ని పాటలూ జనాన్ని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా “తేరా జైసా యార్ కహా…”, “సారా జమానా హసీనోంకా దీవానా…”,”జూకర్ మేరే మన్ కో…” పాటలు అభిమానులను ఊపేశాయి.
“సారా జమానా హసీనోంకా దీవానా…” పాటలో అమితాబ్ ఎలక్ట్రికల్ బల్బులతో రూపొందించిన క్యాస్టూమ్స్ తో కనువిందు చేశారు. ఆ పాట తెరపై కనిపించగానే అభిమానుల ఆనందం మిన్నంటేది. “బిషన్ చాచా…”, “తూ రూఠా దిల్ టూటా…” “యారానా యారానా…టూటే… ” పాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని “సారా జమానా హసీనోంకా దీవానా…” పాటను హృతిక్ రోషన్ ‘కాబిల్’ చిత్రం కోసం రాజేశ్ రోషన్ మళ్ళీ రీక్రియేట్ చేశారు.

ఈ చిత్రానికి జ్ఞాన్ దేవ్ అగ్నిహోత్రి కథను సమకూర్చగా, విజయ్ కౌల్ స్క్రీన్ ప్లే రాశారు. నటుడు ఖాదర్ ఖాన్, ఇందులో ఓ పాత్ర పోషిస్తూనే సంభాషణలు అందించారు. ఈ సినిమా విడుదలైన ఆరేళ్ళకు 1987లో ‘ఖుద్ గర్జ్’ అనే చిత్రం స్నేహబంధం నేపథ్యంలోనే రూపొందింది. ఆ చిత్రానికి హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ కథ, దర్శకత్వం నిర్వహించారు. ఆ చిత్రానికి కూడా రాజేశ్ రోషన్ సంగీతం సమకూర్చడం విశేషం. ‘యారానా’ స్క్రీన్ ప్లే రైటర్ విజయ్ కౌల్ సమీపబంధువైన మోహన్ కౌల్ ‘ఖుద్ గర్జ్’కు స్క్రీన్ ప్లే రాయడం మరో విశేషం. ఈ సినిమాలో మిత్రులను విడదీయడానికి మేనమామ ప్లాన్ వేస్తే, ‘ఖుద్ గర్జ్’లో తన తనయుని స్నేహితుని ఆస్తిని తండ్రి మోసంతో రాయించుకోవడం, తద్వారా మిత్రుల మధ్య విభేదాలు రావడం కథ. ‘ఖుద్ గర్జ్’ తరువాత తెలుగులో ‘ప్రాణస్నేహితులు’గా రూపొందింది. అదే కథతో రజనీకాంత్ ‘అన్నామలై’ తెరకెక్కగా, దానిని తెలుగులో ‘కొండపల్లి రాజా’గా రీమేక్ చేశారు. ‘యారానా’ విడుదలయ్యాక దక్షిణాది హీరోలు సైతం కొందరు ఎలక్ట్రిక్ బల్బ్స్ డ్రెస్ తో నర్తించారు. ‘యారానా’ అభిమానులకు ఆనందం పంచింది.

Related Articles

Latest Articles