తాలిబన్లతో అమెరికా ఫ్రెండ్ షిప్.. చైనాకు చెక్ కోసమేనా?

ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా ప్రపంచానికి పెనుసవాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

అప్ఘన్ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసుకున్నారు. కొన్ని ప్రాంతాలు మినహా దాదాపు దేశం మొత్తం తాలిబన్ల కబంధహస్తాల్లో ఇరుక్కుపోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తాలిబన్లు ఏర్పాటు చేయబోతున్న కొత్త ప్రభుత్వాన్ని అంగీకరించాల్సి వస్తోంది. ఈనెల 11న తాలిబన్లు అప్ఘన్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ దేశ ప్రధానితోపాటు క్యాబినెట్ కూర్పును రెడీ చేశారు.

అప్ఘనిస్తాన్ ప్రధానిగా ముల్లా మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ నియామకం అయ్యారు. ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ ఉప ప్రధానిగా, సిరాజుద్దీన్ హక్కానీ హోంమంత్రిగా.. హక్కాని నెట్‌వర్క్‌ చెందిన అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌ మరో ఉప ప్రధానిగా నామినేట్ అయ్యారు. మరో 30 మందితో కూడిన కేబినెట్‌ మంత్రులు, సహాయ మంత్రులు, ఇంటెలిజెన్స్, సెంట్రల్‌ బ్యాంక్ చీఫ్‌ల జాబితాను తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ వెల్లడించారు. ఆయనకు కొత్త ప్రభుత్వంలో సమాచార శాఖ పదవి దక్కడం గమనార్హం.

ఆఫ్ఘన్లో పదవుల పంపకాలు పూర్తయిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తాలిబన్లు తమ మిత్రదేశంగా చైనాను ప్రకటించిన నేపథ్యంలో జోబైడెన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నారు. తాలిబన్లతోనే చైనాకు అసలు సమస్య పొంచి ఉందన్నారు. తాలిబన్లు ఎప్పటికైనా చైనాకు పక్కలో బల్లెంలా మారుతారని హెచ్చరించారు. ఈ కారణంతోనే తాలిబన్లతో చైనా కొన్ని లోపాయకారి ఒప్పందాలను కుదర్చుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. పాకిస్తాన్, రష్యా, ఇరాన్‌ తరహాలోనే చైనా కూడా తాలిబన్ల విషయంలో కొన్ని అరెంజ్‌మెంట్స్ చేసుకుంటుందన్నారు.

అప్ఘన్ కొత్త అధ్యక్షుడి ముల్లా మహమ్మద్ హసన్ నియామకమైన నేపథ్యంలో చాలాదేశాలు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు జోబైడెన్ చెప్పారు. పాకిస్తాన్, రష్యా, ఇరాన్ వంటి కొన్ని ఇతర దేశాలు కూడా తాలిబన్లతో సత్సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని జో బైడెన్ స్పష్టం చేశారు. దీంతో అమెరికా సైతం తాలిబన్ల విషయంలో సానుకూలంగానే ఉందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు అమెరికాకు చెందిన ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ ఓ ఆన్‌లైన్ పిటీషన్‌ను ప్రారంభించారు. తాలిబన్ల ప్రభుత్వాన్ని అమెరికా గుర్తించకూడదనే సారాంశంతో కూడిన ఆన్‌లైన్ పిటీషన్ అది. దీని ద్వారా పెద్ద ఎత్తున సంతకాలను సేకరిస్తున్నారు. అమెరికా దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్ల సారథ్యాన్ని గుర్తించకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ఘన్ కొత్త హోంమంత్రి హక్కాని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్నాడని ఆమె గుర్తు చేస్తున్నారు. మొత్తానికి అమెరికా సైతం తాలిబన్లకే కొమ్ము కాస్తుండటం వెనుక చైనాకు చెక్ పెట్టేందుకే అనే వాదనలు సైతం విన్పిస్తున్నాయి. చూడాలి మరీ మున్ముందు పరిస్థితులు ఎలా మారుతాయో..!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-