బీజేపీ గూటికి కెప్టెన్..? నేడు మోడీతో అమరీందర్‌సింగ్‌ భేటీ..!

పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి నవజోత్‌ సింగ్‌ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. దాదాపు గంటకుపైగా చర్చలు జరిపారు. కానీ, బీజేపీలో చేరికపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళనపై అమిత్‌షాతో చర్చించానని చెప్పుకొచ్చారు కెప్టెన్‌ అమరీందర్‌. ప్రధాని మోడీని కూడా అమరీందర్‌ కలుస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌లో అధ్యక్ష లేమి అంశాన్ని మరోసారి తెరమీదకి తెచ్చారు సీనియర్ నేత కపిల్ సిబల్. పార్టీలో ప్రస్తుతం ఎన్నుకున్న అధ్యక్షుడు ఎవరూ లేరని.. పార్టీకి సంబంధించిన నిర్ణయాలు ఎవరూ తీసుకుంటున్నారో తమకు తెలియదన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోనియా గాంధీకి లేఖ రాశారు. సిద్ధూ వ్యవహారంపై అధిష్టానం సీరియస్‌ అయింది. రాజీనామాను వెనక్కి తీసుకోవాలని సూచించింది. స్థానిక నాయకత్వమే సమస్యను పరిష్కరించుకోవలని ఆదేశించింది. దీంతో సిద్ధూను చర్చలకు ఆహ్వానించారు పంజాబ్‌ సీఎం చన్నీ . మొత్తానికి సిద్ధూ రాజీనామాతో మళ్లీ మొదలైన సంక్షోభం ఎన్ని మలుపులకు దారితీస్తోందో అనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-బీజేపీ గూటికి కెప్టెన్..? నేడు మోడీతో అమరీందర్‌సింగ్‌ భేటీ..!

Related Articles

Latest Articles