నవ్వుల రామలింగయ్య శత జయంతి ఆరంభం!

(అక్టోబర్ 1న అల్లు రామలింగయ్య జయంతి)

తెలుగునాట వెండితెరపై వేయి చిత్రాలలో వెలిగిన తొలి నటుడుగా అల్లు రామలింగయ్య చరిత్ర సృష్టించారు. సదరు చిత్రాలలో వేళ్ళ మీద లెక్కపెట్ట దగ్గవాటిని పక్కకు నెడితే, అన్నిటా అల్లువారి నవ్వులే విరబూశాయి. జనం మదిలో ఇల్లు కట్టుకొని మరీ గిల్లుతూ అల్లువారు నవ్వుల పంటలు పండించారు. గిల్లిన ప్రతీసారి మళ్ళీ మొలిచే పంటలవి. అజరామరమైనవి. తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య హాస్యం ఏ తీరున ప్రత్యేకమైనదో, అదే విధంగా ఆయన సాగిన వైనం కూడా వైవిధ్యాన్ని సంతరించుకుంది. అల్లు వారి నటన నీడన ఓ వటవృక్షమే వెలసింది. తెలుగు చిత్రసీమలో ఆ నీడనే విశాలంగా విస్తరిస్తోంది. పలువురికి అవకాశాలూ కల్పిస్తోంది.

అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచీ తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచుతూ సాగారు. చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ దంచారు. యవ్వనంలో కులమతవిభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు అల్లు రామలింగయ్య. తన ముందు ఓ నిమ్నకులస్థుడిని అగ్రవర్ణాల వారు అవమానిస్తే ఉరకలు వేసే ఉడుకు నెత్తురుతో వారికి దేహశుధ్ధి చేశారు. దాంతో అరెస్ట్ అయ్యారు. తరువాత స్వరాజ్య పోరాటంలోనూ జైలు శిక్ష అనుభవించారు. ఈ నేపథ్యంలోనే అల్లువారు చిత్రసీమవైపు సాగడంలో ఆలస్యం అయిందనిపిస్తుంది. ఆ రోజుల్లోనే హోమియోపతి వైద్యాన్ని అభ్యసించి, చుట్టూ ఉన్నవారికి తగిన వైద్యం చేసేవారు. అలా వైద్యం చేస్తూ, ఇష్టమైన నాటకాలు వేస్తూ సాగుతున్న అల్లు రామలింగయ్యను గరికపాటి రాజారావు తన ‘పుట్టిల్లు’ చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ తరువాత యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన అనేక చిత్రాలలో హాస్యాన్ని సైతం వైవిధ్యంగా పలికిస్తూ సాగారు రామలింగయ్య. విజయవారి ‘మిస్సమ్మ’ చిత్రంలో పాత పంతులుగా అల్లువారు తనదైన అభినయాన్ని ప్రదర్శించారు. ‘మంచిమనసుకు మంచిరోజులు’లో విలనీని పండించారు. ‘నాదీ ఆడజన్మే’లో ఇద్దరు చెల్లెళ్ళ అన్నయ్యగా సెంటిమెంటూ కురిపించారు. వరైటీ రోల్స్ లో సాగుతున్నా, తన దరికి చేరిన ప్రతీ పాత్రనూ అంగీకరించారు. అది చిన్నదో పెద్దదో అని ఆలోచించకుండా వాటిలో తనదైన మార్కు ప్రదర్శించారు.

ఇక 1970లలో రూపొందిన వందలాది చిత్రాలలో అల్లు రామలింగయ్య నవ్వులు పూయిస్తూ సాగారు. ఒకే రోజున నాలుగు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి నవ్వులు పండించేవారు అల్లు. అంత బిజీగా సాగుతున్న అల్లువారి కాల్ షీట్స్ కోసం నిర్మాతలు, దర్శకులు పడికాపులు కాచేవారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలలో అల్లు పండించిన నవ్వులు భావితరాల వారికి సైతం గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ పురస్కారం అందుకున్న హాస్యనటులుగా చరిత్రలో నిలిచారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో పలు అవార్డులూ, రివార్డులూ చోటు చేసుకున్నాయి. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు.

వయసు మీద పడ్డా కుర్రాళ్ళలాగా హుషారుగా సాగిన అల్లు రామలింగయ్య, చివరి దాకా తన వద్దకు వచ్చిన పాత్రల్లో నటించి అలరించారు. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘జై’ చిత్రంలో అల్లు రామలింగయ్య చివరి సారి తెరపై కనిపించారు. ఆయన తనయుడు అల్లు అరవింద్ నేడు చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు. అల్లు ఉన్న సమయంలోనే నెలకొల్పిన గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ఈ నాటికీ ఎంతోమందికి అవకాశాలు కల్పిస్తోంది. అల్లు రామలింగయ్య చిన్నల్లుడు చిరంజీవి మెగాస్టార్ గా జయకేతనం ఎగురవేశారు. రామలింగయ్య మనవలు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ తరం టాప్ స్టార్స్ గా తమ బాణీ పలికిస్తున్నారు. ఇలా తెలుగునాట ఏ హాస్యనటుని వారసత్వమూ ఇంతలా కొనసాగలేదు. అది అల్లువారి నవ్వుల బొమ్మరిల్లుకే సాధ్యమయిందని చెప్పవచ్చు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు. ఆయన పండించిన నవ్వులు ఈ నాటికీ తెలుగువారికి కితకితలు పెడుతూనే ఉన్నాయి.

-Advertisement-నవ్వుల రామలింగయ్య శత జయంతి ఆరంభం!

Related Articles

Latest Articles