బాలయ్యను ‘అల్లు’కుంటున్న బంధం!

నందమూరి బాలకృష్ణ వంటి టాప్ హీరో సినిమా వేడుకకు అల్లు అర్జున్ లాంటి యంగ్ హీరో ముఖ్యఅతిథిగా రావడంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ తరం మేటి హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఫంక్షన్ కు టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన బాలకృష్ణ ఛీఫ్ గెస్ట్ అంటే అర్థముంది కానీ, బాలయ్య సినిమాకు అల్లు అర్జున్ ముఖ్యఅతిథి ఏంటి అనీ కొందరి ఆవేదన! గతంలో బాలయ్య ఆడియో వేడుకలను పరిశీలిస్తే, ఆయన ఇలాంటి వాటికి ప్రాధాన్యమివ్వరని ఇట్టే తేలిపోతుంది. బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’కు, ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘కథానాయకుడు’కు జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవలేదా? తన సరసన నాయికగా నటించి ఆపై స్టార్ హీరోయిన్ గా మారిన విజయశాంతి, బాలయ్య ‘ఆదిత్య 369’కు ముఖ్య అతిథి కాదా? ఒకప్పుడు దాసరి నారాయణరావునే చిత్రసీమ దూరం పెట్టిన సందర్భంలో తన ‘పవిత్రప్రేమ’కు ఆయననే ఛీఫ్ గెస్ట్ గా పిలిచి అబ్బుర పరచలేదా? అలాగే అంతకు ముందు దాసరి హుకుమ్ కారణంగా ‘ఈనాడు గ్రూప్’కు తెలుగు చిత్రసీమ సహాయనిరాకరణ విధించగా, దానిని బాలయ్యనే ఉల్లంఘించి, వారిని కవరేజ్ ఆహ్వానించలేదా? ఇలాంటివన్నీ ఆలోచిస్తే బాలయ్యకు అసలు ఏలాంటి పట్టింపులూ లేవని అనిపిస్తుంది. అదలా ఉంచితే ఈ మధ్య ‘ఆహా’లో బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో నిర్వహిస్తున్న దగ్గర నుంచీ ఆయనతో ‘అల్లు’ కుటుంబం అల్లుకు పోతోందని తెలిసిపోతోంది.

అప్పట్లో అలా…
నిజానికి ఎన్టీఆర్ కుటుంబానికి, అల్లు ఫ్యామిలీకి మొదటి నుంచీ సత్సంబంధాలు ఉన్నాయి. రామారావు పిల్లలు, రామలింగయ్య పిల్లలు బాల్యంలో కలసి మద్రాసులో ఆడుకున్న సందర్భాలూ ఉన్నాయని అందరికీ తెలుసు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అనేక చిత్రాలలో అల్లు రామలింగయ్య తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. ఇక ఎన్టీఆర్ సొంత చిత్రాలలోనూ, ఆయన దర్శకత్వంలోనూ అల్లు రామలింగయ్య నటించి అలరించారు. ఆ మాటకొస్తే ఎన్టీఆర్ సొంత చిత్రాలలో నటించినప్పుడు అల్లు రామలింగయ్య వెంటనే పారితోషికం పుచ్చుకొనేవారు కాదుట! రామారావు వద్దే ఆ మొత్తం ఉంచి, తనకు అవసరం అయినప్పుడు తీసుకొనేవారట! ఇక చిరంజీవికి తన చిన్నకూతురు సురేఖను ఇచ్చి పెళ్ళి జరిపించే సమయంలోనూ అల్లువారు ఎన్టీఆర్ సమక్షంలోనే నిశ్చయ తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారట! ఇంతటి అనుబంధంతో సాగిన నందమూరి, అల్లు కుటుంబాల బంధం తరువాత చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ కారణంగా దూరమయిందని చెబుతారు.

అసలేం జరిగింది?
చిరంజీవి, బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పోటీ ఉన్నా, వారిద్దరి మధ్య ఏ లాంటి పొరపొచ్చాలు లేవు. వారి స్నేహబంధం గట్టిగా ఉండడానికీ అల్లు అరవింద్ కారణమని చెబుతారు. ఒకప్పుడు చిరంజీవితో వరుసగా చిత్రాలు నిర్మించిన కె.దేవీవరప్రసాద్, అప్పట్లో బాలకృష్ణ డేట్స్ చూసేవారు. దీనిని బట్టే వారిద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. అది అలా ఉంచితే, మెగా కాంపౌండ్ కు మూల పురుషుడు అల్లు రామలింగయ్య అన్నది నిర్వివాదాంశం. ఆ విషయంపైనే కొన్నాళ్ళ నుంచీ అభిమానుల నడుమ చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇక మెగా కాంపౌండ్ బలంగా వేళ్ళూనుకోవడానికి చిరంజీవి, అల్లు అరవింద్ మూలస్తంభాలుగా ఉండడమే కారణమనీ అందరికీ తెలుసు. అయినా ఎందుకీ చర్చలు తలెత్తాయో ఎవరికీ తెలియదు. ఈ విషయంలోనే గత కొంతకాలంగా కొణిదెల, అల్లు వారసుల మధ్య తెలియకుండానే దూరం పెరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ‘అల్లు’ కుటుంబం ఆధ్వర్యంలో ఓ స్టూడియో ప్రత్యేకంగా వెలసిందని. అందులో చిరంజీవికి ఏమీ సంబంధం లేదని వినిపిస్తోంది. పైగా, ఒకప్పుడు అల్లు అర్జున్ ను ఓ వేడుకలో ‘పవన్ కళ్యాణ్’ గురించి చెప్పమంటే ఏమీ చెప్పననీ కరాఖండిగా సెలవిచ్చారు. ఇలాంటి వన్నీ కొణిదెల, అల్లు కుటుంబాల నడుమ దూరాన్ని ఎత్తి చూపుతున్నాయి.

అంతేనా…!
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణతో బంధం పెంచుకోవడానికి అల్లు కుటుంబం ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఎటూ యన్టీఆర్ కాలం నుంచీ అల్లువారితో ఉన్న అనుబంధం కారణంగా బాలయ్య సైతం అల్లు అరవింద్ అడగ్గానే మరో మాట లేకుండా ‘అన్ స్టాపబుల్’ టాక్ షో లో హోస్ట్ గా చేస్తున్నారు. బాలయ్య సినిమాలతో టాప్ డైరెక్టర్ అనిపించుకున్న బోయపాటి శ్రీను కూడా అల్లు అర్జున్ కు ‘సరైనోడు’ వంటి హిట్ ను అందించారు. అదీగాక, బాలయ్య ‘అఖండ’ తరువాత బోయపాటి మళ్ళీ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాలయ్య ‘అఖండ’కు అల్లు అర్జున్ ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నారని తెలుస్తోంది.

పైకి ఇదే కారణం కనిపిస్తున్నా, బాలయ్యతో అల్లు వారి బంధం పెనవేసుకుంటే, అల్లు అర్జున్ ను బాలయ్య ఫ్యాన్స్ అందరూ లైక్ చేయడం ఆరంభిస్తారు. అదీగాక, కొణిదెల ఫ్యామిలీ మెంబర్ అయిన రామ్ చరణ్ తో, జూనియర్ ఎన్టీఆర్ పెనవేసుకుపోవడం ఎందుకనో మొదటి నుంచీ నందమూరి అభిమానులకు అంతగా రుచించడం లేదు. ఈ నేపథ్యంలో బాలయ్య డైహార్డ్ ఫ్యాన్స్ ను తమవైపు తిప్పుకోగలిగితే అల్లు అర్జున్ స్టార్ ఫోర్ట్ మరింత బలపడిపోతుందనీ విశ్లేషకులు అంటున్నారు. ఏ లెక్కలు ఎలా ఉన్నా, మొదటి నుంచీ నందమూరి, అల్లు కుటుంబాల మధ్య ఉన్న బంధం ఇప్పుడు మరింత పెనవేసుకోవడంలో ఆశ్చర్యమేముంది అనీ కొందరి అభిప్రాయం!

Related Articles

Latest Articles