బాలయ్యతో అల్లు బిజినెస్ స్ట్రాటెజీ!

ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్ లోకి మెల్లగా టాప్ స్టార్స్ కూడా అడుగు పెడుతున్నారు. మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అడుగు పెట్టడం విశేషమనే చెప్పాలి. ఇక ఆ ఫ్లాట్ ఫామ్ బాలయ్య బాక్సాఫీస్ పోటీదారుడైన చిరంజీవి మెగా ఫ్యామిలీకి చెందిన వారిది కావడం మరింత విశేషం. బాలయ్య నిర్వహించే ‘అన్ స్టాపబుల్’ టాక్ షో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ భాగస్వామిగా ఉన్న ‘ఆహా’ ఓటీటీలో మొదలు కానుంది. దాంతో ‘ఆహా’కు బాలయ్య ఎలా టైమ్ కేటాయించారో అన్నది చర్చనీయాంశమయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నారు.

Read Also : పొట్టివాడు నిజంగానే గట్టివాడు!

అదీగాక ఇంతకు ముందు చిరంజీవి, నాగార్జున, జూనియర్ యన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ బుల్లితెరపై హోస్ట్స్ గా కనిపించినా, అవి ఓటీటీకి చెందినవి కావు. పైగా అవి టాక్ షోస్ కూడా కాదు. ఆ కోణంలో చూస్తే తెలుగునాట ఓటీటీలో టాక్ షో చేస్తున్న తొలి టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. అందువల్ల కూడా బాలకృష్ణ ఈ కార్యక్రమ నిర్వహణకు అంగీకరించి ఉంటారని వినిపిస్తోంది. అదీగాక, బిజినెస్ యాంగిల్ లో చూసినా బాలకృష్ణ వంటి మాస్ హీరో వచ్చి, ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమం నిర్వహిస్తే వచ్చే కిక్కే వేరనీ కొందరి మాట! ఇప్పటి దాకా బాలయ్య బుల్లితెరపై ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. దాంతో బాలయ్య తొలిసారి చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షోకు జనాల్లో ఓ స్పెషల్ క్రేజ్ నెలకొనడం సహజమే! ఇక నటరత్న యన్టీఆర్ కుటుంబానికి, అల్లు రామలింగయ్య ఫ్యామిలీకి ఏ నాటి నుంచో అనుబంధం ఉంది. అలా బాలయ్యకు అల్లు అరవింద్ చిన్ననాటి మిత్రుడు. ఆ కారణంగానే బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ షోకు అంగీకరించి ఉంటారని ఇంకొందరు చెబుతున్నారు. ఈ విషయంలో అల్లు అరవింద్ బిజినెస్ స్ట్రాటజీ పనిచేస్తుందని కొందరు అంటున్నారు. ఎందుకంటే వ్యూహాలు రచించడంలో అల్లు అరవింద్ కు ఆయనే సాటి అంటూ ఉంటారు సినీజనం.

అయితే ఇక్కడ మరో అంశం కూడా వినిపిస్తోంది. యన్టీఆర్ నెలకొల్పిన ‘తెలుగుదేశం’ పార్టీ ద్వారానే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఓ వెలుగు వెలిగారు. తరువాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే మంత్రిపదవినీ నిర్వహించారు. అలా కేసీఆర్ తోనూ మొదటి నుంచీ బాలయ్యకు సాన్నిహిత్యం ఉంది. ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన మైహోమ్ రామేశ్వరరావుకు చెందినది. ఈ కోణంలోనూ బాలయ్య ఈ ప్రోగ్రామ్ చేయడానికి అంగీకరించి ఉండవచ్చునని మరికొందరి మాట. ఏది ఏమైనా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి బాలయ్య అడుగు పెట్టడం అన్నది భవిష్యత్ లో ఆ వేదికకు మరింత క్రేజ్ సంపాదించి పెడుతుందని భావించవచ్చు. ఒక వేళ బాలయ్య అరవింద్ ను చూసి ఈ ప్రోగ్రామ్ అంగీకరించినా, లేక రామేశ్వరరావు వల్ల ఒప్పుకున్నా ఆయన స్నేహానికి ఇచ్చే విలువ ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.

-Advertisement-బాలయ్యతో అల్లు బిజినెస్ స్ట్రాటెజీ!

Related Articles

Latest Articles