ఆ పార్టీకి తలనొప్పిగా మారిన మహిళా వేధింపుల ఆరోపణలు..!

ఆ పార్టీకి ఇప్పుడో తలనొప్పి వచ్చిపడింది. అదేదో రాజకీయ సమస్య అయితే ఓకే…! కానీ మహిళలను వేధించారన్న ఆరోపణలు కావడంతో.. ఒక్కరు కూడా పెదవి విప్పడం లేదట. సున్నితమైన సమస్యగా భావించి అంతా పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌. ఇంతకీ ఏంటా పార్టీ? ఆరోపణలు ఉద్దేశ పూర్వకమా? ఇంకేదైనా రాజకీయం ఉందా? లెట్స్‌ వాచ్‌..!

పీసీసీలో పెద్దలకు దగ్గరగా ఉండేవారిపై వేధింపుల ఆరోపణలు?

తెలంగాణ కాంగ్రెస్‌లో గడిచిన వారం రోజులుగా నాయకులంతా ఒక్కటే చెవులు కొరుకుడు.. గుసగుసలు. హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో కొందరు మహిళా కాంగ్రెస్‌ నేతలను పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు కావడంతో పైకి ఎవరూ నోరు విప్పడం లేదు. పైగా ఆరోపణల ఎదుర్కొంటున్న వాళ్లంతా పీసీసీలో పెద్దలకు దగ్గరి మనుషులు. ఇప్పుడీ అంశం పార్టీలోని ముఖ్య నాయకులు అందరి దగ్గరకు ఫిర్యాదుల రూపంలో వెళ్లిందట. ముఖ్యంగా ప్రస్తుత పీసీసీని వ్యతిరేకిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి బాధితులుగా చెప్పుకొంటున్నవాళ్లు తమ బాధను ఏకరవు పెడుతున్నారట.

మహిళా కాంగ్రెస్‌లో ఆ ఇద్దరి జోక్యం ఎక్కువైందా?

హుజురాబాద్‌ ఎన్నికల కమిటీ ఏర్పాటు.. సభలు.. సమావేశాలు.. పాసులపై కాంగ్రెస్‌లో చాలా గొడవే జరిగింది. ఆ గొడవలు చినికి చినికి గాలి వానలా మారి వేధింపుల దగ్గర తేలింది. ఓ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్‌ నాయకురాలు గాంధీభవన్‌లో చేసిన రచ్చ.. అసలు గొడవకు కేంద్రమట. అలాగే మహిళా కాంగ్రెస్‌లో ఒక యంగ్‌ లీడర్‌.. మరో సీనియర్ నేత జోక్యం ఎక్కువైనట్టు ప్రచారంలో ఉంది. తమ వారికి మహిళా కాంగ్రెస్‌లో పదవులు ఇవ్వాలని వారు ఒత్తిడి చేస్తున్నారట.

ఆరోపణలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు?

అయితే మహిళా కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు సమాచారం. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించింది ఎవరు? నిజంగానే అలా జరిగిందా? దీని వెనక ఎవరున్నారు అనే అంశాలపై పార్టీ ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అప్పట్లో కొత్త పీసీసీని ప్రకటించాక కొందరు నాయకుల బాగా హడావిడి చేశారు. కొత్త సారథికి తాము ఎంత చెబితే అంత అని గొప్పలు పోయారు. దానిపై ఇంఛార్జ్‌ ఠాగూర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇప్పుడు ఆ ఓవర్‌ యాక్షన్‌ చేసిన వాళ్లపైనే ఆరోపణలు రావడంతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు పార్టీ నేతలు.

రాతపూర్వంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదా?

కాంగ్రెస్‌లో కలకలం రేపుతోన్న వేధింపుల ఆరోపణలపై రాతపూర్వకంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదట. కాకపోతే సభలు.. సమావేశాల్లో ఇచ్చే పాసుల కోసం కాంగ్రెస్‌లో మొదలైన గొడవ ఇంత దూరం తీసుకొచ్చిందని గాంధీభవన్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి.. ఈ సమస్యను పీసీసీ ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles