హుజురాబాద్ నుంచి ‘సైడ్’ అవుతున్న ప్రచారం.. ఎందుకంటే?

హుజూరాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలంతా హుజూరాబాద్ లో తిష్టవేసి తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకట్టుకుంటున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఆయా పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలన్నీ ప్రస్తుతం హుజూరాబాద్ నుంచి పక్కచూపులు చూస్తున్నాయి. నేతలంతా హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై ఫోకస్ పెడుతుండటంతో ఎన్నికల ప్రచారం ఆసక్తిని రేపుతోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ నడుస్తోంది. దీంతో ఆయా పార్టీల నేతలంతా ఖచ్చితంగా ఎన్నికల కోడ్ పాటించాల్సిందే. కోవిడ్ నిబంధనలు పాటించకపోతే సదరు పార్టీ నేతలపై ఎన్నికల నియామవళి ప్రకారంగా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలువురు నేతలపై కోవిడ్ నిబంధనలు పాటించలేదని కారణంతో కేసులు బుక్కయినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా హుజూరాబాద్ నియోజకవర్గంలో కంటే మరో ప్రాంతానికి ప్రజలను తరలించి అక్కడ ప్రచారం చేయాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రధాన పార్టీలన్నీ హుజూరాబాద్ సరిహద్దు మండలాలపై దృష్టి సారిస్తున్నాయి. అందరిచూపు ప్రధానంగా పెంచికల్ పేటనే ఉంది. ఈ మండలం హుజూరాబాద్ కు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మండలానికి ప్రజలను తరలించడానికి ఖర్చు కూడా తక్కువ అవుతుండటంతో అందరూ ఈ మండలంపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో నేతలంతా హుజూరాబాద్ ఓటర్లను పెంచికల్ పేటకు తరలిస్తూ అక్కడ ప్రచారం చేస్తున్నారు. వచ్చిపోయే వారితో ఈ మండలంలో సందడి వాతావరణం నెలకొంటోంది.

హుజూరాబాద్ కు పొరుగున ఉన్న మండలంలో ప్రచారం చేస్తే ఎన్నికల కోడ్ వర్తించే అవకాశాలు ఉండవని నేతలు భావిస్తున్నారు. అనుమతికి మంచి ప్రజలు సభకు వచ్చారనే కేసుల భయం కూడా వారికి ఉండదు. అదేవిధంగా ఇక్కడ ప్రచారానికి అయిన ఖర్చు కూడా అభ్యర్థుల ఖాతాలో పడే అవకాశం లేదని తెలుస్తోంది. ఇన్ని అవకాశాలు రాజకీయ నాయకులు లభిస్తుండంతో నేతలంతా దీనిని సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. ఈ కారణంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో కంటే సరిహద్దు మండలాల్లోనే ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నట్లు కన్పిస్తోంది.

-Advertisement-హుజురాబాద్ నుంచి ‘సైడ్’ అవుతున్న ప్రచారం.. ఎందుకంటే?

Related Articles

Latest Articles