ఆకట్టుకుంటున్న అక్షయ్ ‘పృథ్వీరాజ్’ టీజర్

‘సూర్యవంశీ’ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అక్షయ్ కుమార్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పురాణ చిత్రం ‘పృథ్వీరాజ్’ టీజర్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ లైఫ్ హిస్టరీగా తెరకెక్కిన ఈ చిత్రం 2022 జనవరిలో థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ గా అక్షయ్ టైటిల్ రోల్ పోషించాడు. అతని భార్య సంయోగితగా మానుషి చిల్లార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇతర పాత్రలో సంజయ్ దత్, సోనూసూద్, అసుతోష్ రాణా, సాక్షి తన్వర్, లలిత్ తివారి కనిపించనున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఒక నిమిషం 22 సెకన్ల ఈ టీజర్ గూస్‌బంప్‌ తెప్పిస్తోందంటూ పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ టీజర్ ను షేర్ చేస్తూ ‘అహంకారం, శౌర్యంతో కూడిన వీరోచిత కథ ఇది. సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ పాత్ర పోషించడం గర్వంగా ఉంది. 21 జనవరి 2022న బిగ్ స్క్రీన్ లో మీవద్దకు వస్తోంది’ అని ట్వీట్ చేశాడు. 2019లో ఆరంభమైన ఈ సినిమాపై అన్ని సినిమాల్లాగే కరోనా ఎఫెక్ట్ పడింది. 2020 దీపావళికి విడుదల కావలసిన ‘పృథ్వీరాజ్’ ఎట్టకేలకు 2022 జనవరి 21న విడుదల కానుంది. 2010లో ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినపుడు చంద్రప్రకాశ్ ద్వివేది సన్నిడియోల్, ఐశ్వర్యారాయ్ తో తీయాలనుకున్నాడు. అప్పట్లో సన్నిడియోల్ డేట్స్ దొరకక పోవడంతో పాటు ఏ నిర్మాణ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకు రాకపోవడంతో పక్కన పెట్టేశాడు. అయితే అనూహ్యంగా అక్షయ్, యశ్ రాజ్ ఫిలిమ్స్ కలయికలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాడు. మరి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో ఆక్షయ్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూద్దాం.

Related Articles

Latest Articles