‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్

(సెప్టెంబర్ 9న అక్షయ్ కుమార్ బర్త్ డే)
ఇంతింతై వటుడింతై అన్న చందాన అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో పాతకు పోయారు. ఓ నాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా అల్లుడు అక్షయ్ కుమార్ అని ఇప్పుడు పేరు సంపాదించారు. కానీ, ఏ అండా లేకుండానే రంగుల ప్రపంచంలో అక్షయ్ కుమార్ నిలదొక్కుకోవడం విశేషమనే చెప్పాలి. పైగా కొందరు ప్రముఖుల వారసుల ఆధిపత్యం ముందు అక్షయ్ నిలవడని కొందరు భావించారు. అలాంటి వారు నేడు నోళ్లు వెళ్ళ బెట్టుకొనేలా చేశారు అక్షయ్. ఆరంభంలో తన ప్రతిభనే నమ్ముకొని బాలీవుడ్ లో అడుగు పెట్టిన అక్షయ్ కుమార్, యాక్షన్ హీరోగా అలరించారు. తరువాత నటనతోనూ మురిపించారు. ట్వింకిల్ ఖన్నా మనసు గెలిచారు. అప్పుడే మాజీ సూపర్ స్టార్ అల్లుడు అనిపించుకున్నారు. ఆ పై జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగానూ నిలిచారు. ఒకానొక సమయంలో భారతదేశంలో అత్యధికంగా ఇన్ కమ్ టాక్స్ కట్టిన వారిలో చోటు దక్కించుకున్నారు అక్షయ్. సినిమాల్లో కన్నా మిన్నగా యాడ్స్ లో నటించి సంపాదించారు అక్షయ్.

బాలీవుడ్ లో ముగ్గురు ఖాన్లు – ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్- హవా వీస్తున్న రోజులలో అక్షయ్ కుమార్ ను చాలామంది థర్డ్ రేట్ ఆర్టిస్ట్ గా భావించారు. వారి ముందు అక్షయ్ వి కుప్పిగంతులు అనీ చాటింపేశారు. అయితే తనకున్న యాక్షన్ ఎస్సెట్ గా చేసుకొని అక్షయ్ కుమార్ అనేక చిత్రాలను విజయపథంలో పయనించేలా చూశారు. ‘ఖిలాడీ’గా జనం మదిని గెలిచి, ‘ఖిలాడీ’ సీరీస్ తోనూ విజయవిహారం చేశారు. ఆయన సరసన నటించిన తారలకూ మంచి గుర్తింపు లభించేది. సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా చిత్రసీమలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్ కు హిట్ పెయిర్ గా నిలిచారు అక్షయ్. వారిద్దరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. దాదాపు 113 చిత్రాలలో నటించిన అక్షయ్ కుమార్ కు 50 శాతం పైగా విజయాలున్నాయి. వాటిలో అనేక చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ప్రస్తుతం దాదాపు నాలుగు వేల కోట్ల ఆస్తిపరునిగా నిలిచారు అక్షయ్. మునుముందు అక్షయ్ ఎసెట్స్ విలువ మరింతగా పెరుగవచ్చుననీ చెబుతున్నారు. ‘రుస్తుం’ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రదర్శించిన అభినయానికి జాతీయ స్థాయిలో ఉత్తమనటుని అవార్డు లభించింది. ఎప్పటి కప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్న అక్షయ్ కుమార్ మది నిండా భారతీయతను నింపుకున్నారు. ఆయన సినిమాల్లోనూ అది కనిపిస్తూ ఉంటుంది.

సెప్టెంబర్ 9తో అక్షయ్ కుమార్ 54 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఓ రోజు ముందు ఆయన తల్లి అరుణా భాటియా కన్నుమూశారు. తాను ఇంతవాడిని కావడానికి కారణమైన అమ్మ లేకపోవడం భరించలేని బాధగా ఉందని అక్షయ్ అన్నారు. సినిమాల్లో నటిస్తూ, సామాజిక సేవలో పాల్గొంటూ ఉండే అక్షయ్ కు సహనటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్షయ్ మరిన్ని చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటారని అభిమానులు అభిలషిస్తున్నారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-