మరోసారి ‘బిగ్‌బాస్’ షో హోస్ట్‌గా రమ్యకృష్ణ

రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుండగా.. మంచి టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. తెలుగు బిగ్‌బాస్‌ షోను హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తమిళంలో ఈ షోకు ప్రముఖ హీరో కమల్‌ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బిగ్‌బాస్‌కు ఎవరు యాంకర్‌గా వ్యవహరిస్తారన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Read Also: టిక్కెటింగ్ సిస్టంపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు

కమల్ అనారోగ్యం బారిన పడటంతో ఆయన తిరిగివచ్చేదాకా కమల్ కుమార్తె శ్రుతిహాసన్ బిగ్‌బాస్‌కు హోస్టుగా చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే శ్రుతిహాసన్ సినిమాల్లో బిజిబిజీగా గడుపుతోంది. ఆమెకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఆమె బిగ్‌బాస్‌ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో నిజనిజాలు ఎలా ఉన్నా ప్రత్యామ్నాయం కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ఆలోచిస్తుండగా వారికి మంచి ఆప్షన్ కనిపించింది. దీంతో వీకెండ్ హోస్టుగా ప్రముఖ నటి రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణకు గతంలో బిగ్‌బాస్‌ షోను నడిపించిన అనుభవం ఉంది. అయితే ఆమె తమిళంలో కాకుండా తెలుగు బిగ్‌బాస్‌కు గతంలో హోస్టుగా వచ్చింది. తెలుగులో మూడో సీజన్‌ నడుస్తున్న సమయంలో నాగార్జున త‌న పుట్టినరోజు సందర్భంగా విహారయాత్రకు వెళ్లడంతో ఆ సమయంలో రమ్యకృష్ణ హోస్టు అవతారం ఎత్తి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తోంది.

Related Articles

Latest Articles