ఆఫ్గన్‌ మహిళ మెడకు షరియా చట్టం..

పిల్లికి చెలగాటం ..ఎలుకకు ప్రాణ సంకటం. ఆఫ్గన్‌ మహిళల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు. తాలిబాన్లు చంపుతారన్న భయంతో టీమ్‌ టీమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాబుల్‌లో తాలిబాన్లు ఇప్పటికే మహిళా క్రికెటర్ల కోసం వేట మొదలుపెట్టారు. క్రికిటర్లే కాదు ఇప్పుడు దేశంలో ఏ క్రీడాకారిణికి రక్షణ లేదు.

కాబూల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. క్రికెట్‌ జట్టు సభ్యులంతా నిస్సహాయస్థితిలో ఉన్నారు. గత నెల మధ్యలో తాలిబాన్లు కాబూల్‌ని అక్రమించుకున్నప్పటి నుంచి వారికి క్రీడాకారిణిలు టార్గెట్‌ అయ్యారు. అప్పటికే తమకు తెలిసిన ఆటగాళ్ల ఇంటికి వెళ్లి చంపుతామని బెధిరించారు. కొందరు నేషనల్‌ ప్లేయర్స్‌ తాలిబాన్ల భయానికి ఇప్పటికే దేశం విడిచి వెళ్లారు. అలా పారిపోయేందుకు వారు తమ ప్రాణాలనే రిస్క్‌లో పెట్టారు. మిగతా వారు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుంటుందన్న ఒక్క ఆశ మాత్రమే వారిలో మిగిలివుంది. ఆగస్టులో ఆస్ట్రేలియా ప్రభుత్వం 50 మంది అఫ్గాన్ మహిళా అథ్లెట్లను తమ దేశానికి తీసుకెళ్లింది. అలానే తాము కూడా తాలిబాన్ పాలన నుంచి బయటపడతామని మహిళా క్రికెటర్లు భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్ నుంచి ఫుట్‌బాల్, ఇతర అథ్లెట్ల తరలింపుపై చర్చలు జరుపుతున్నామని ఫిఫా తెలిపింది.

1996 నుంచి 2001 మధ్య తాలిబాన్లు ఆడవాళ్లను చదువులకు దూరం చేశారు. అయితే ఈ సారి వారు కాస్త మెతక వైకరి అనుసరిస్తారని అంతా బావించారు. కానీ పరిస్థితి చూస్తుంటే అమ్మాయిలను ఆటలకు అనుమతించే ప్రసక్తే లేదనిపిస్తోంది. షరియా చట్టం ఎలా చెబితే అలా ..రెండో మాటే లేదంటున్నారు తాలిబాన్‌ పాలకులు.

షరియా చట్టాలకు అనుగుణంగానే పాలన సాగిస్తామని చెప్పిన తాలిబన్లు.. అందుకు తగినట్లుగా మహిళలపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా అఫ్గాన్‌ మహిళలు క్రికెట్‌ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. వారు ఆటలు ఆడేందుకు అనుమతించట్లేదని స్పష్టం చేశారు. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదని, వాటి వల్ల దేహం కనిపిస్తుందంటున్నారు తాలిబాన్లు.

క్రీడాకారిణిలే కాదు చదువుకునే అమ్మాయిలపైనా తాలిబన్లు పలు ఆంక్షలు పెట్టారు. అమ్మాయిలకు మగవారు బోధించ కూడదు.. యూనివర్సిటీ మహిళలు తప్పనిసరిగా బుర్ఖా, నికాబ్‌ ధరించాలి. క్లాసుల్లో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పరదా ఏర్పాటు చేయాలి. అబ్బాయిలు క్యాంపస్‌ నుంచి పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే అమ్మాయిలను పంపించాలి. ఇలా ఎన్నో కొత్త గైడ్‌లైన్స్‌ వెళ్లాయి.

మరోవైపు, నేటి ఆఫ్గన్‌ మహిళలు తాము బానిసలం కాదని గళమెత్తుతున్నారు. తమ హక్కుల కోసం రొడ్డెక్కి నినదిస్తున్నారు. ఒకప్పుడు తాలిబన్లు కనిపిస్తే చాలు భయంతో వణకిపోయేవారు. కానీ గత 20 ఏళ్లలో ఆఫ్గన్‌ మహిళల్లో చైతన్యం పెరిగింది. తమ హక్కులు హరించే హక్కు మీకెవరిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. తాలిబాన్‌ ఆరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇది నిజంగా గొప్ప మార్పు. ఐతే, తాలిబాన్లు దీనిని తుపాకులతో బెధిరించి అణచి వేయాలని చూస్తున్నారు. వారిపై దమనకాండ సాగిస్తున్నారు.

కొత్త తాలిబాన్‌ ప్రభుత్వం మహిళా స్వేచ్చను హరించే ఎన్నో చర్యలు చేపట్టింది. వాటిని నిరసిస్త మహిళలు తిరుగుబాట పట్టారు.మొదట హెరాత్‌ నగరంలో మొదలైంది హక్కుల ఉదమ్యమం. దాని స్పూర్తితో కాబూల్‌ మహిళలు మరింత తీవ్రంగా పోరాడుతున్నారు. విద్య, ఉద్యోగం తదితర రంగాల్లో హక్కుల సాధనతోపాటు ప్రభుత్వంలో తమకూ భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే తాలిబన్లు వారిని ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు. అయినా వెనుకడుగు వేయడం లేదు. అలాగే దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ జోక్యంపై మహిళలు మండిపడుతున్నారు. పాక్‌ వ్యతిరేక నినాదాలతో కాబుల్‌ నగరం మార్మోగి పోయింది.
కాబూల్‌లో కనిపిస్తున్న కొన్ని దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. తాలిబన్‌ ఎక్కుపెట్టిన తుపాకీకి ఎదురొడ్డి నిలిచింది ఓ మహిళ. ఏం చేస్తావ్‌? చంపుతావా? ఏదీ చంపు.. అన్నట్టుగా ఉంది ఆమె ధైర్యం చూస్తుంటే.

ఆఫ్గనిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తాలిబాన్ల మైండ్‌ సెంట్‌ ఏ మాత్రం మారలేదని అర్థమవుతోంది. ఓ వైపు ప్రపంచానికి నమ్మ బలుకుతూనే ఇంకోవైపు ఆటవిక చర్యలు సాగిస్తూనే ఉన్నట్టు సమాచారం.

షరియా చట్టాన్ని అమలు చేస్తామని తాలిబన్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో గత అనుభవాలు పునరావృతం అయ్యే అవకాశాలే ఎక్కువ. దీన్ని ఆఫ్ఘన్‌ మహిళలు, ప్రజలు ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ప్రశ్న. దీనిపై ఐక్యరాజ్యసమితి ఎలా స్పందిస్తుందో చూడాల్సి వుంది. అలాగే ప్రపంచ దేశాలు ఎలా రియాక్టవుతాయన్నది కూడా ముఖ్యమే.

Related Articles

Latest Articles

-Advertisement-