నవ్వుల హరివిల్లు… శ్రీలక్ష్మి

(జూలై 20న శ్రీలక్ష్మి పుట్టినరోజు)

శ్రీలక్ష్మి తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలు ఇట్టే విచ్చుకుంటాయి. ఆమె నవ్వుల పువ్వులు ఏరుకోవడంలోనే తెలుగు ప్రేక్షకులకు చక్కిలిగింతలు పుడుతూఉంటాయి. ‘పుణ్యభూమి కళ్ళుతెరు’ చిత్రంలో నాయికగా పరిచయమైన శ్రీలక్ష్మి, తరువాత హాస్యనటిగానే పకపకలు పండించారు. జంధ్యాల చిత్రాల ద్వారా శ్రీలక్ష్మికి విశేషమైన గుర్తింపు లభించింది. ‘ఆనందభైరవి’లో ఆనందం వస్తే ఈల వేసే పాత్రలో శ్రీలక్ష్మి పూయించిన నవ్వులను ఎవరు మాత్రం మరచిపోగలరు? ఇక “శ్రీవారికి ప్రేమలేఖ, రెండు రెళ్ళు ఆరు, చంటబ్బాయ్, స్వర్ణకమలం, జయమ్ము నిశ్చయంబురా, ఆదిత్య 369, కొబ్బరి బొండాం, జంబలకిడిపంబ, రాజేంద్రుడు-గజేంద్రుడు, మాయలోడు, శుభసంకల్పం” వంటి చిత్రాలలో శ్రీలక్ష్మి అభినయం అందరికీ కితకితలు పెడుతూ ఆకట్టుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై తన వయసుకు తగ్గ పాత్రల్లో అలరిస్తున్నారు శ్రీలక్ష్మి.

యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రాజ్యమేలుతున్న రోజుల్లో వారి చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన నటుడు అమర్ నాథ్. ఆయన కూతురే శ్రీలక్ష్మి. ఆమె సోదరుడు రాజేశ్. ఈయన కూడా జంధ్యాల చిత్రాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. రాజేశ్ కూతురు ఐశ్వర్యా రాజేశ్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది. ‘కౌసల్యా కృష్ణమూర్తి’లో ప్రధాన భూమిక పోషించారు ఐశ్వర్యా రాజేశ్. ఇలా శ్రీలక్ష్మి కుటుంబం నటనారంగంలోనే సాగుతోంది. శ్రీలక్ష్మి, బ్రహ్మానందం కామెడీ ఒకప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక జంధ్యాల చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలలో హాస్యం పండించారు శ్రీలక్ష్మి. అప్పటి నుంచీ ఇప్పటి దాకా తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగుతున్నారు శ్రీలక్ష్మి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-