రంజు భలే ‘రంభ’ చిలకా!

(జూన్ 5న రంభ పుట్టినరోజు)
“మన ‘వేటగాడు’ శ్రీదేవి లేదూ… ముక్కు ఆపరేషన్ చేయించుకున్నాక మరీ నాజూగ్గా మారిందా… ఆమె కాసింత ఒళ్లు చేస్తే ఎట్టా ఉంటాదో, అట్టా ఉందీ పిల్ల” అన్నాడో ఆసామి రంభ నటించిన తొలి సినిమా ‘ఆ ఒక్కటి అడక్కు’ చూసి. అతని మాటను ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ, తరువాతి రోజుల్లో శ్రీదేవి చెల్లి అన్నారు కొందరు. దివ్యభారతి లాంటి మరోబుల్లి అనుకున్నారు మరికొందరు. ఎవరు ఎలా అనుకున్నా, రంభ వచ్చీ రాగానే “రంజు భలే రంభచిలక”లా చెలరేగిపోయింది. దాంతో ఎందరో రసికాగ్రేసరులు రంభను తమ కలలరాణిగా చేసేసుకొని పట్టాభిషేకాలు జరిపించేసి ఊహల్లో తేలిపోయారు. ఆ రోజుల్లో మాతృభాష తెలుగులోనూ, తరువాత తమిళంలోనూ రంభ చెలరేగిపోయిందంటే నమ్మండి! తెలుగులో కన్నా మిన్నగా తమిళంలో సాగింది. దివ్యభారతి లేకపోవడంతో ఉత్తరాదికీ ఉరికింది. అక్కడా కాసింత వెలిగింది.

తెలుగులో టాప్ స్టార్స్ తో నటించి మురిపించిన రంభ తరువాత ఐటమ్స్ లోనూ వాటంగా నటించి హీటు పెంచింది. పవన్ కళ్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లో “చలిగాలి ఝుమ్మంది…” అంటూ కుర్రకారును కిర్రెక్కించింది రంభ. చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’లో “హేయ్ రుక్కు రుక్కు…” పాటలో కిక్కు ఇచ్చింది రంభ అందం. మరోమారు చిరంజీవితోనే ‘మృగరాజు’లో “రామయ్య పాదాలెట్టి…” పాటలో రంభ చిందేసి కనువిందు చేసింది. ‘నాగ’లో “నాయుడోరి పిల్లా…” సాంగ్ లో జూ.యన్టీఆర్ తో కలసి రంభ చేసిన సందడిని ఎవరు మరువగలరు? ‘దేశముదురు’ అల్లు అర్జున్ ను చూసి “అట్టాంటోడే ఇట్టాంటోడే…” అంటూ కవ్వించింది. ఆపై మరోమారు జూనియర్ తోనే “నాచోరే నాచోరే…” అని ‘యమదొంగ’లో రంభ అందాలతో బంధాలు వేసింది. నటనతోనూ, నర్తనంలోనూ మెరుపులు మెరిపించిన రంభ ఉత్తరాదిన బెంగాలీ, భోజ్ పురిలోనూ నటించింది. బుల్లితెరపైనా కొన్ని షోస్ లో తళుక్కుమంది. 2010లో ఇంద్రకుమార్ ను పెళ్ళాడేసి, ముగ్గురు పిల్లల తల్లి అయిన రంభ మళ్ళీ తగిన పాత్ర లభిస్తే కెమెరా ముందుకు వస్తానంటోంది. మరి అదెప్పుడు జరుగుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-