నేటికీ ఉర‌క‌లు వేసే ఉత్సాహంతో… ఉత్తేజ్ !

న‌టుడు ఉత్తేజ్ పేరు వింటే ఇప్ప‌టికీ ఆయ‌న తొలి చిత్రం శివ‌లోని యాద‌గిరి పాత్ర‌నే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలా మొద‌టి సినిమాలోనే క‌నిపించింది కొన్ని నిమిషాలే అయినా, త‌న ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్నారు ఉత్తేజ్. రామ్ గోపాల్ వ‌ర్మ అప్ప‌టి నుంచీ తాను రూపొందించిన ప‌లు చిత్రాల‌లో ఉత్తేజ్ కు అవ‌కాశాలు క‌ల్పించారు. గాయం, అన‌గ‌న‌గా ఒక‌రోజు చిత్రాల‌లోనూ ఉత్తేజ్ యాద‌గిరిగానే క‌నిపించి ఆక‌ట్టుకోవ‌డం విశేషం. ఇలా ఒకే పాత్రలో వేర్వేరు చిత్రాల‌లో న‌టించ‌డం అన్న‌ది ఉత్తేజ్ కు ల‌భించిన మంచి అవ‌కాశం. దానిని ఆయ‌న స‌ద్వినియోగ ప‌ర‌చుకున్నారు కూడా. అప్ప‌ట్లో ఎంతోమంది హీరోల‌కు ఉత్తేజ్ ఫ్రెండ్ గా న‌టించి మెప్పించారు. శ్రీ‌కాంత్, జేడీ చ‌క్ర‌వ‌ర్తితో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు కూడా ప‌లు చిత్రాల‌లో స్నేహితునిగా న‌టించి అల‌రించారు. ఇక టాప్ హీరోల చిత్రాల్లోనూ ఉత్తేజ్ కు త‌గిన పాత్ర‌లే ల‌భించాయి. త‌న ద‌రికి చేరిన పాత్ర‌ల్లోకి ఇట్టే ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేయ‌గ‌ల స‌త్తా ఉత్తేజ్ సొంతం. ప్ర‌స్తుతం కేరెక్ట‌ర్ యాక్ట‌ర్ గా రాణిస్తున్న ఉత్తేజ్, ఆ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ టాక్సీవాలాలో విల‌న్ గానూ మెప్పించారు.

ప‌ల్లెటూరి పిల్ల‌గాడా…. ప‌శుల‌గాసే మొన‌గాడా… అన్న పాట ఆ రోజుల్లో వెట్టిచాకిరిని నిర‌సిస్తూ తెలుగునేల అంత‌టా ఓ వెలుగు వెలిగింది. ఆ పాట రాసిన సుద్దాల దేవ‌య్య పేరు జాన‌ప‌ద సాహిత్యంలో చిర‌స్థాయిగా నిల‌చింది. సుద్దాల దేవ‌య్య కూతురు కుమారుడే ఉత్తేజ్. బాల్యం నుంచీ క‌ళ‌ల ప‌ట్ల ఆక‌ర్షితుడైన ఉత్తేజ్ కు సాహిత్యంలోనూ మంచి ప్ర‌వేశ‌ముంది. ఎంత‌యినా ఆ తాత మ‌న‌వ‌డు క‌దా! అందువ‌ల్ల రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన కొన్ని చిత్రాల‌కు స్క్రిప్ట్ వ‌ర్క్ లోనూ పాలు పంచుకున్నారు ఉత్తేజ్. ఇప్ప‌టికీ త‌న ద‌రికి చేరిన ర‌చ‌నా అవ‌కాశాల‌ను ఆయ‌న వినియోగించుకుంటూనే ఉన్నారు. త‌న మేన‌మామ సుద్దాల అశోక్ తేజ‌ను సినిమా రంగానికి ప‌రిచ‌యం చేశాడు ఉత్తేజ్. ఎక్క‌డైనా మేన‌ల్లుడి మేలు కోరి మేన‌మామ‌లు త‌మ‌కు తెలిసిన వారివ‌ద్ద ఉద్యోగాల్లో పెడుతూ ఉంటారు. ఇక్క‌డ సీన్ రివ‌ర్స్! త‌న మేన‌మావ సుద్దాల అశోక్ తేజను ద‌ర్శ‌కుడు కృష్ణవంశీకి ప‌రిచ‌యం చేశాడు. ఇంకేముంది సుద్దాల అశోక్ తేజ త‌న క‌లం బ‌లంతో అన‌తికాలంలోనే అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్నారు. చిరంజీవి ఠాగూర్ చిత్రానికి సుద్దాల అశోక్ తేజ రాసిన నేను సైతం… పాట ఆయ‌న‌కు జాతీయ స్థాయిలో ఉత్త‌మ గేయ‌ర‌చ‌యిత‌గా అవార్డు కూడా సంపాదించి పెట్టింది. దీనిని బ‌ట్టి ఇక్క‌డ మేన‌మామ మేలు కోరాడు ఈ మేన‌ల్లుడు అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఉత్తేజ్ కు ఇద్ద‌రు కూతుళ్ళు. పెద్ద పాప తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రంలో నాకు కుక్క కావాలి… అంటూ మారాం చేస్తూ గారాలు పో్యి న‌టించింది. త‌రువాత పెద్ద‌కూతురు, చిన్న కూతురు ఇద్ద‌రూ సంగీత‌సాధ‌న చేశారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడు వారి గాత్రం వినిపిస్తూ ఉంటారు. ఉత్తేజ్ ఆధ్వ‌ర్యంలో మ‌యూఖ‌ అనే న‌ట‌నాశిక్ష‌ణాల‌యం కొన‌సాగుతోంది. శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌న‌గ‌ర్ లో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా ప‌లువురు సినిమా రంగంలో త‌మ క‌ల‌లు నెర‌వేర్చుకున్నారు. న‌ట‌నలో కొన‌సాగుతూనే భావి న‌టీన‌టుల‌కు శిక్ష‌ణ ఇస్తున్న ఉత్తేజ్ మ‌రింత మందిని చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం చేస్తారేమో చూద్దాం.

(జూన్ 2న ఉత్తేజ్ పుట్టిన‌రోజు)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-