షాకింగ్ : బిగ్ బాస్ విన్నర్ కన్నుమూత

ప్రముఖ టెలివిజన్ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ టాలెంటెడ్ నటుడు గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆయనకు 40 సంవత్సరాలు. ఆయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఈరోజు ఉదయమే గుండెపోటు రావడంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం.

సుదీర్ఘకాలం పాటు టెలివిజన్ లో ప్రసారమైన టీవీ సీరియల్ “బాలికా వధూ”లో సిద్ధార్థ్ ప్రధాన పాత్ర పోషించారు. శుక్లా తన కెరీర్‌ని మోడల్‌గా షోబిజ్‌లో ప్రారంభించాడు. టెలివిజన్ షో “బాబుల్ కా ఆంగన్ చూటే నా” లో ప్రధాన పాత్ర చేశాడు. తరువాత ఆయన “జానే పేచానే సే … యే అజ్ఞబ్బి”, “లవ్ యు జిందగీ” వంటి కార్యక్రమాలలో కనిపించాడు. కానీ “బాలికా వధూ”తోనే ఆయనకు గుర్తింపు లభించింది. 2014 లో కరణ్ జోహార్ నిర్మించిన “హంప్టీ శర్మ కి దుల్హనియా” తో శుక్లా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అందులో సిద్ధార్థ్ సహాయక పాత్రలో నటించాడు.

డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండే సిద్ధార్థ్ ఇంకా “జలక్ దిఖ్లా జా 6”, “ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాది 7”, “బిగ్ బాస్ 13” వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నాడు. ఎన్నో వివాదాల అనంతరం “బిగ్ బాస్ 13” విన్నర్ గా నిలిచాడు. ఆ తరువాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను ఎదుర్కొంటున్న ఈ యంగ్ యాక్టర్ అప్పుడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరికీ షాక్ ఇస్తోంది. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-