నట దర్శకుడి కన్నుమూత!

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్.ఎన్.ఆర్. మనోహర్ (61) బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. గత ఇరవై రోజులుగా ఆయన అదే హాస్పిటల్ లో వైద్య సేవలు పొందుతున్నారు. ఇరవై రోజుల క్రితం కొవిడ్ 19 కారణంగా ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పిటల్ లో చేర్చినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆర్.ఎన్.ఆర్. మనోహర్ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.

పలు తమిళ చిత్రాలలో మనోహర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ‘కొళంగల్, దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య’ తదితర చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఆర్య ‘టెడ్డీ’ సినిమాలో హీరోయిన్ సాయేషా సైగల్ తండ్రిగా ఆయన నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశాల్ ‘సామాన్యుడు’ సినిమాలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. నకుల్, సునైనా నటించిన ‘మాసిలమణి’ సినిమాను ఆర్.ఎన్.ఆర్. మనోహర్ డైరెక్ట్ చేశారు. నంద, పూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ డ్రామా ‘వెల్లూర్ మావట్టమ్’కు కూడా ఆయనే దర్శకుడు. ఆర్.ఎన్.ఆర్. మనోహర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

Related Articles

Latest Articles