వసూల్ రాజాకు చెక్ పెడతారా?

హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖులు ఉండే ఏరియాలో ఆయన పోలీస్‌ అధికారి. ఓ మంత్రి రికమండేషన్‌తో వచ్చారట. ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి ఓ రేంజ్‌లో వసూళ్లే వసూళ్లు. సమస్య ఏదైనా ఆయన లెక్క వేరని కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి ఉందట.

మంత్రి రికమండేషన్‌తో హైదరాబాద్‌లో ఏసీపీగా రాక..!
పోలీస్‌ శాఖలో హైదరాబాద్‌ పరిధిలో పోస్టింగ్‌ అంటే కానిస్టేబుల్ నుంచి అధికారుల వరకు ఒక క్రేజ్‌ ఉంటుంది. పైరవీలు చేసేవాళ్లూ ఎక్కువే. హోదాలను బట్టి ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి రికమండేషన్లు పనిచేస్తుంటాయి. ఆ విధంగా ఒక మంత్రి రికమండేషన్‌పై పదోన్నతిపై ACPగా సిటీకి వచ్చారు DSPస్థాయి అధికారి. నగరం నడిబొడ్డున ప్రముఖులు ఉండే ప్రాంతంలో పోస్టింగ్‌. హైదరాబాద్‌కు వచ్చే వరకూ ఆ అధికారి సిటీ బయటే పనిచేశారట. దాంతో హైదరాబాద్‌లోని సమస్యలు.. ప్రముఖులు ఉండే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దగా తెలియవన్నది డిపార్ట్‌మెంట్‌లో వినిపించే మాట.

చేతిలో పైకం పడితేనే పని చేస్తారట..!
ఏదో రికమాండేషన్‌పై ACPగా వచ్చారు. పని నేర్చుకుంటారు.. పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారని అనుకుంటే.. అంతా రివర్స్‌. ఛార్జ్‌ తీసుకున్నప్పటి నుంచి ఆయన ఆలోచన ఒక్కటే. వస్తున్న ఆరోపణలు ఒక్కటే. సామాన్యం జనం.. పోలీసులు అనే తేడా లేదట. పని ఏదైనా.. ఆ ACP సార్‌కు చేతిలో బరువైన తాంబూలం పెట్టాల్సిందే. పని అడిగితే ఆయన చేతిలో పైకం పడితేనే ఫైల్‌ అయినా.. కేసు డైరీ అయినా కదులుతుందట. జేబులో దండిగా డబ్బులు లేకుండా ACP ఛాంబర్‌లోకి అడుగుపెట్టడం వేస్ట్‌ అన్నది ఆయన పరిధిలో పోలీసుల టాక్‌.

కేసు క్లోజ్‌ చేయాలన్నా ‘లాభం’ చూసుకోవాల్సిందే..!
కొన్ని కేసుల్లో సాక్ష్యాలు లేకనో.. బాధ్యులు రాజీ పడో.. పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు. దర్యాప్తు అధికారి కేసు నమోదు చేసినా.. ఆ కేసును క్లోజ్‌ చేసే అధికారం DSP స్థాయి అధికారిదే. అలా కేసు క్లోజ్‌ చేయమని తన దగ్గరకు వచ్చే ఫైళ్లను చాలా నిశితంగా పరిశీలిస్తారట. సార్‌.. కేసు క్లోజ్‌ చేయాలని చెప్పగానే.. అయితే నాకేంటి అని మొహమాటం లేకుండా అడగడం ఆయన స్టయిల్. లాభం లేకుండా సంతకం ఎలా పెడతానని చెప్పేస్తారట. ఈ వైఖరి ఆ ACP పరిధిలో పనిచేసే ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు ఇబ్బందిగా మారినట్టు సమాచారం. ఎవరైనా పైఆఫీసర్లు.. ఆ ACP పరిధిలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది గురించి ఆరా తీస్తే.. ఆయనకు పండగే. తనను సంతృప్తిపర్చని వాళ్ల గురించి తప్పుడుగా రిపోర్టులు పంపుతారట. ఇప్పటికే అలా కొందరి గురించి రాంగ్‌ రిపోర్ట్స్‌ పంపినట్టు సమాచారం.

ఉన్నతాధికారులు ఆ ఏసీపీని దూరం పెట్టారా?
ఈ ACP గురించి తెలుసుకున్న సిటీలోని కొందరు ఉన్నతాధికారులు ఆయన్ని చాలా వరకు దూరం పెట్టారని సమాచారం. పని తెలియదు.. జిల్లాల నుంచి నేరుగా సిటీకి వచ్చి సొంత దుకాణం తెరిచారని గుర్రుగా ఉన్నారట. మంత్రిగారి రికమండేషన్‌ అనో ఏమో.. పోలీస్‌ బాస్‌లు టచ్‌మీ నాట్‌గా ఉండటం చర్చగా మారుతోంది. సమస్య ముదిరి.. రచ్చకాకముందే వసూల్‌ రాజాకు చెక్‌ పెడతారో లేదోనని పోలీస్‌ వర్గాల్లో ఒక్కటే చర్చ.

Related Articles

Latest Articles