‘ఆచార్య’కు శానా కష్టం!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ చిత్రంలోని మరోపాట జనం ముందు నిలచింది. మణిశర్మ బాణీలకు అనువుగా భాస్కరభట్ల పలికించిన పాటకు, ప్రేమ్ రక్షిత్ నృత్యభంగిమలు సమకూర్చారు. ఈ పాటలో చిరంజీవి, రెజీనా నటించగా, పలువురు డ్యాన్సర్స్ బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తారు.

చిరంజీవి గతంలో తనదైన డాన్సులతో జనాన్ని కిర్రెక్కించారు. నిజానికి, ఆయనతో ఏ డాన్స్ చేయించినా, పాతగానే కనిపిస్తుంది. అది డాన్స్ మాస్టర్స్ కు నిజంగా ఓ సవాల్ అనే చెప్పాలి. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోలోనూ కొన్ని స్టెప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అవేమీ చిరంజీవికి కొత్తకాదు. మరి పాటలో చూపించక, దాచుకున్న ఫీడ్ లో ఏమైనా చిరంజీవితో కొత్తగా ప్రేమ్ రక్షిత్ స్టెప్స్ వేయించారేమో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. చిరంజీవి లుక్ మాత్రం కొత్తగా అనిపించింది. ఎందుకంటే, గతంలో ఆయన ఇదే తరహా కాస్ట్యూమ్స్ లో కనిపించినా, ఈ సారి నాజూగ్గా కనిపిస్తున్నారు.

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో గతంలో చిందేసిన రెజీనా, ఇప్పుడు ఆయనతో ‘ఆచార్య’లో చిందులతో కనువిందు చేయడం విశేషమే! ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో సాయిధరమ్ తో కలసి రెజీనా, “గువ్వా గోరింకతో…” అనే చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ రీమిక్స్ లో నటించింది. ఇప్పుడు ఒరిజినల్ చిరంజీవితోనే ‘ఆచార్య’లో కలసి రెజీనా చిందేయడం నిజంగా ఆమెకు ఓ థ్రిల్ కలిగించి ఉంటుందనే చెప్పొచ్చు.

‘ఆచార్య’లోని ఈ “శానా కష్టం వచ్చిందే మందాకినీ…” పాట చిత్రీకరణలో దర్శకుడు కొరటాల శివ పర్యవేక్షణ చూస్తోంటే, ఆయన ఈ సినిమాను ఓ ఛాలెంజ్ గా తీసుకొని తెరకెక్కిస్తున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే చిరంజీవితో తొలిసారి కొరటాల శివ పనిచేస్తున్న సినిమా కాబట్టి, ఈ చిత్రంతో ఓ భారీ బంపర్ హిట్ కొట్టాలన్న తపన ఆయనలో కనిపిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డితో కలసి రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణ సమయంలో సెట్స్ లో రామ్ చరణ్ కూడా కనిపిస్తున్నారు.

కుర్రకారును కిర్రెక్కించే పాటలు రాయడంలో సిద్ధహస్తులు భాస్కరభట్ల. ఆయన తన బాణీ పలికిస్తూ ఈ పాటను, “కల్లోలం కల్లోలం ఊరూవాడా కల్లోలం… నేనొస్తే అల్లకల్లోలం…” అంటూ ఆరంభించారు. “నడుం మడతలోన జనం నలిగే పోనీ…”, “ఇల్లు దాటితే ఇబ్బందే ఒంపుసొంపుల్తో…” వంటి పదబంధాలతో రసికులకు శ్రీగంధాలు పూసే ప్రయత్నం చేశారు. ఇక మణిశర్మ బాణీల్లోని చమక్ ఈ పాటలోనూ కనిపిస్తోంది. అయితే ఆరంభంలో వినిపించే “కల్లోలం కల్లోలం… ఊరువాడా కల్లోలం…” అనే వరసలు చూస్తే ‘రంగీలా’లోని రహమాన్ “యాయిరే…యాయిరే…” గుర్తుకు వస్తుంది. ఏది ఏమైనా, ‘ఆచార్య’లోని ఈ పాట అభిమానులను ఇట్టే పట్టేసేసిందని చెప్పవచ్చు.

Related Articles

Latest Articles