వినోదంలో విషాదాలు!

మెక్సికోలో జరుగుతున్న ‘రస్ట్’ షూటింగ్ లో నటుడు అలెక్ బాల్డ్ విన్ ప్రాప్ గన్ తో కాల్పులు జరిపారు. దాంతో అక్కడే ఉన్న సినిమాటోగ్రాఫర్ హాలీనా హట్ చిట్స్ మరణించగా, డైరెక్టర్ జోయెల్ సోజా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రాప్ గన్ లోకి అసలైన బుల్లెట్స్ ఎలా వచ్చాయన్న అంశంపై షరీఫ్, అపరాధ పరిశోధకులు వేట ప్రారంభించారు.

వినోదంలో విషాదాలు!

ఈ సంఘటనతో గతంలో జరిగిన ఇలాంటి షూటింగ్ ప్రమాదాలను గుర్తు చేసుకుంటున్నారు సినీజనం. మూకీ సినిమాల కాలంలోనే హీరోలకు డబుల్ గా నటించే డూప్స్ కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత కూడా షూటింగ్స్ లో ఫీట్స్ చేస్తూ, సరైన విధంగా లాండ్ కాకపోయి మృతిచెందిన వారున్నారు. 1984లో టీవీ సీరియల్ లో నటిస్తున్న నటుడు జోన్ ఎరిక్, కథానుగుణంగా గన్ తో ఆత్మహత్య చేసుకోవాలి. ఆయన తన తలకు గురిపెట్టుకొని పేల్చుకోవాలి. ఆ సీన్ లో నటిస్తూండగా ఆ ప్రాప్ గన్ లో ఒరిజినల్ బుల్లెట్స్ ఉన్న కారణంగా జోన్ ఎరిక్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఇలాంటి సంఘటనే 1993లో చోటు చేసుకుంది. ప్రఖ్యాత యాక్షన్ హీరో బ్రూస్ లీ తనయుడు బ్రాండన్ లీ విషయంలోనూ ప్రాప్ గన్ నిజంగానే పేలి, అతని ప్రాణాలు తీసింది. ‘ద క్రో’ చిత్రంలో నటిస్తోన్న బ్రాండన్ లీ డమ్మీ గన్ తో కాల్చుకొనే సీన్ లో నటిస్తూండగా, అందులోని బుల్లెట్ ఆయన కడుపులో దూసుకుపోయింది. చికిత్స పొందుతూ బ్రాండన్ లీ కన్నుమూశాడు. 2018లో ‘మదర్ లెస్ బ్రూక్లిన్’ సెట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకొని స్టంట్ మేన్ డేవిడ్ సన్ మృతి చెందాడు.

Read Also : షూటింగ్ లో కాల్పులు… సినిమాటోగ్రాఫర్ కన్నుమూత!

ఇలాంటి సంఘటనలు మన దేశంలోనూ కొన్ని చోటు చేసుకున్నాయి. ఓ సినిమాలో హెలికాప్టర్ నుండి బోట్ పైకి దూకే షూటింగ్ లో ధర్మేంద్ర డూప్ కన్నుమూశాడు. ‘కూలీ’ షూటింగ్ లో ఫైట్ చేస్తూ అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిని చూశారు. కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత ఆయన తిరిగి వచ్చారు. నటుడు, దర్శకుడు సంజయ్ ఖాన్ ‘టిప్పు సుల్తాన్’ షూటింగ్ సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో సంజయ్ ఖాన్ గాయపడి, ముఖం కాలిపోయింది. తెలుగునాట డూప్ లేకుండా పోరాటాల్లో పాల్గొన్న హీరోలు ప్రమాదాలకు గురయిన సంఘటనలు చాలా ఉన్నాయి. చిరంజీవి ‘కొండవీటి రాజా’ షూటింగ్ సమయంలో గద్వాల వద్ద నదిలో టెక్నీషియన్ పురుషోత్తమ్ కన్నుమూశారు. ఇక కన్నడ చిత్రసీమలో ‘గంధదగుడి’ షూటింగ్ లో కథానుగుణంగా రాజ్ కుమార్ ను విష్ణువర్ధన్ ప్రాప్ గన్ తో కాల్చాలి. అందులో రియల్ బుల్లెట్స్ ఉన్న కారణంగా రాజ్ కుమార్ కు గాయాలయ్యాయి. విష్ణువర్ధన్ కావాలనే కాల్చాడని చాలా రోజులు ప్రచారం సాగింది. అయితే రాజ్ కుమార్ అలాంటిదేమీ లేదని చెప్పడంతో అంతా సర్దుకుంది.
ఇలా జనానికి వినోదం పంచడం కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులు చేసే ప్రయత్నాల్లో ప్రమాదాలూ సంభవిస్తూ ఉండడం కొత్తేమీ కాదు. కానీ, వినోదం కోసం పనిచేసేవారి జీవితాలు విషాదాంతం కావడమే ఎవరినైనా కలచి వేస్తుంది.

Related Articles

Latest Articles