అమెరికాలో 6 కోట్లకు చేరిన కరోనా కేసులు

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణుకు పుట్టిస్తోంది. ప్రపంచంలో 30 కోట్ల కేసులు నమోదైతే.. అందులో ఆరు కోట్ల కేసులు అమెరికాలోనే బయటపడ్డాయి. ఇక థర్డ్‌వేవ్‌లో ప్రతి రోజు లక్షల మందికి కరోనా సోకడం అమెరికాను కలవరపెడుతోంది. అమెరికాలో 14 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. డెల్టా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల సగటును పరీక్షిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా చైనాలో పుట్టినా.. ప్రపంచంలో అత్యధికంగా వైరస్‌తో అతలాకుతలమైంది మాత్రం అమెరికానే. ఫస్ట్‌వేవ్‌లో ప్రతి రోజు వేల సంఖ్యలో కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రోజు లక్షల్లో కేసులు నమోదయ్యాయి. అదే వైరస్‌ దూకుడు.. ఇప్పుడు థర్డ్‌వేవ్‌లోనూ కంటిన్యూ అవుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో నమోదైన కేసులు.. 60 మిలియన్లకు చేరాయి. అంటే ఆరు కోట్ల మంది అమెరికా వాసులకు కొవిడ్‌ సోకింది. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు నమోదైన దేశం కూడా అమెరికానే. ఆ తరువాత మూడు కోట్ల 57 లక్షల పాజిటివ్స్‌తో భారత్‌ రెండో స్థానంలో ఉంది.

అమెరికాలో 6 కోట్లకు చేరిన కరోనా కేసులు

జనవరి 1, 2021 కల్లా కరోనా పాజిటివ్స్‌ 20 మిలియన్లు దాటగా.. ఆ సంఖ్య గతేడాది డిసెంబర్‌ 13 చివరి కల్లా 50 మిలియన్లకు చేరింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో 2021 డిసెంబర్‌ 1న ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. కొత్త వేరియంట్‌ కేసులు కూడా ఆ దేశంలో ప్రస్తుతం ప్రతి రోజు వేల సంఖ్యలో బయటపడుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌ మరణాలు తక్కువగానే ఉన్నా.. డెల్టా వైరస్‌తో చనిపోయేవారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఇక డెత్‌ రేట్‌ కూడా దారుణంగా ఉంది. కరోనాతో అగ్రరాజ్యంలో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 లక్షల మంది కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 15 శాతానికి పైగా అత్యధిక మరణాలు యూఎస్‌లోనే సంభవించడం.. ఆదేశ ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

Related Articles

Latest Articles