యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. లఖీంపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్‌ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేపట్టారు.

సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌.. రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు వాహనాలపై దాడి చేశారు. వాటికి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంమంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రే కారణంగా తెలుస్తోంది. లఖీమ్‌పూర్‌లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ ఖండించారు. దీనికి యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతుల రాళ్ల దాడితో కారు బోల్తా పడిందని.. కారు కింద పడి ఇద్దరు చనిపోయారని చెబుతున్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ముగ్గురు బీజేపీ కార్యకర్తలతో పాటు తన డ్రైవర్‌ను కొట్టి చంపారని.. ఘటనా స్థలంలో తన కుమారుడు లేడని అన్నారు. మరోవైపు దీనితో తనకు సబంధం లేదని వాదిస్తున్నారు ఆశిష్‌ మిశ్రా. మరోవైపు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌. రైతుల మృతి దురదృష్టకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు లఖీంపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని లక్నోలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.

-Advertisement-యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

Related Articles

Latest Articles