అరవై ఏళ్ళ ‘శాంత’

(జూలై 14తో యన్టీఆర్ ‘శాంత’కు 60 ఏళ్ళు)
నటరత్న యన్.టి.రామారావు, అంజలీదేవి అనేక చిత్రాలలో నటించి జనాన్ని విశేషంగా అలరించారు. వారిద్దరూ నటించిన ‘శాంత’ చిత్రం జూలై 14తో 60 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రాన్ని మానాపురం అప్పారావు దర్శకత్వంలో ఎమ్.ఆర్.జయరామ్ నిర్మించారు. ఇదే మానాపురం అప్పారావు దర్శకత్వంలో తరువాత మరో రెండేళ్ళకు యన్టీఆర్, అంజలీదేవి జంటగానే ‘పరువు-ప్రతిష్ఠ’ అనే చిత్రం రూపొందింది. ఈ రెండు చిత్రాల కథ దాదాపు ఒకేలా ఉండడం గమనార్హం. అంతేకాదు, ఈ సినిమాలో యన్టీఆర్, అంజలి తనయునిగా నటించిన చలం, ‘పరువు-ప్రతిష్ఠ’లోనూ వారి కొడుకుగానే నటించారు. పైగా రెండు చిత్రాలలోనూ చలం పేరు వేణు కావడం గమనార్హం! మరో విశేషమేమంటే, యన్టీఆర్, అంజలీ జంటగా నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’లో ఆమె పేరు శాంత. అందువల్లే ఈ చిత్రానికి ‘శాంత’ అన్న టైటిల్ ను నిర్ణయించినట్టు అప్పట్లో నిర్మాతదర్శకులు చెప్పారు.

‘శాంత’ కథ విషయానికి వస్తే, అందమైన శాంతపై దయానిధి అనే కామాంధుడు కన్నేస్తాడు. పలు పాట్లు పడి అతని నుండి, మరికొందరు దుర్మార్గుల నుండి తప్పించుకొని లాయర్ శ్రీనివాస్ చెంత చేరుతుంది. అతని భార్య చనిపోయి, ఓ కొడుకు ఉంటాడు. ఆ అబ్బాయి పేరు కుమార్. అతణ్ణి శాంత కన్నకొడుకులా చూస్తుంది. దాంతో శ్రీనివాస్, శాంతను పెళ్ళాడతాడు. మళ్ళీ దయానిధి, శ్రీనివాస్ మిత్రునిగా ఇంట ప్రవేశించి, అతణ్నే చంపాలని చూస్తాడు. విషం కలిపిన పాలు త్రాగి కుమార్ మరణించడంతో, శాంతను శ్రీనివాస్ అనుమానించి, ఇంట్లోంచి గెంటేస్తాడు. ఆత్మహత్యకు పాల్పడబోతున్న శాంతకు ఓ పసిపాప కనిపిస్తుంది. దయానిధి చేతిలో మోసపోయిన ఓ అభాగ్యురాలి కూతురు ఆ పాప. ఆ పసిపాపను పెంచి పెద్ద చేస్తుంది. సరోజ అనే పేరు పెడుతుంది. శ్రీనివాస్ కొడుకు వేణు, సరోజ ఒకే చోట చదువుకోవడంతో ప్రేమలో పడతారు. చివరకు విషయం తెలుసుకున్న శ్రీనివాస్, వేణు కలసి దయానిధికి బుద్ధి చెప్పడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో కాంతారావు, రేలంగి, గుమ్మడి, కేవీఎస్ శర్మ, కృష్ణకుమారి, సూర్యకాంతం, ఛాయాదేవి, గిరిజ, బాలసరస్వతి నటించారు. ఆరుద్ర, కొసరాజు, సముద్రాల జూనియర్ పాటలు రాశారు. సముద్రాల జూనియర్ సంభాషణలు కూడా పలికించారు. ఈ చిత్రానికి రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. యన్టీఆర్ కు రమేశ్ నాయుడు స్వరకల్పన చేసిన తొలి చిత్రం ఇదే. దీని తరువాత 1973లో యన్టీఆర్ ‘దేవుడు చేసిన మనుషులు’కు మళ్ళీ రమేశ్ నాయుడు సంగీతం అందించారు. శాంతికళ ఫిలిమ్స్ పతాకంపై ‘శాంత’ రూపొందింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-