55 వసంతాల ‘సంగీత లక్ష్మి’

సంగీత, నృత్యాలు ఇరుసులుగా కథారధం నడిచిన చిత్రం ‘సంగీత లక్ష్మి’. ఎన్టీఆర్, జమున జంటగా నటించిన ఈ సినిమా జూలై 7, 1966లో విడుదలైంది. అంటే నేటితో యాభై ఐదేళ్ళు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ తన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్లుగా పనిచేసిన పలువురిని నిర్మాతలుగా మార్చారు. ఈ సినిమాకూ అలానే అమరా రామ సుబ్బారావు అనే ప్రొడక్షన్ మేనేజర్ ను నిర్మాతను చేశారు. పి. నరసింగరావుతో కలిసి అమరా రామ సుబ్బారావు ‘సంగీత లక్ష్మి’ చిత్రం నిర్మించారు. ఈ మూవీతో గిడుతూరి సూర్యం దర్శకుడిగా పరిచయం అయ్యారు. అభ్యుదయ మానవతా వాదిగా పేరున్న గిడుతూరి సూర్యం ఆకాశవాణిలో అనౌన్సర్ గా పనిచేస్తూనే నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రాశారు. ‘సంగీత లక్ష్మి’ చిత్రం తర్వాత ఆయన ‘రణభేరి, ఆస్తికోసం, కథానాయకురాలు, విక్రమార్క విజయం, పేదరాశి పెద్దమ్మ కథ, నేను – నా దేశం’ వంటి పలు చిత్రాలు తెరకెక్కించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.

ఈ సినిమా కథ విషయానికి వస్తే… విజయవాడలో కాపురం ఉంటున్న కల్నల్ కొండలరావు (ఎస్వీ రంగారావు) ఏకైక కూతురు రాధ (జమున). శాస్త్రీయ సంగీత ప్రియురాలు. అదే ఊరిలో ఉంటున్న వేణు (ఎన్టీ రామారావు) సంగీతారాధకుడు. ఇద్దరికీ మద్రాసులో జరిగిన సంగీత పోటీలలో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుంది. చివరికి వివాహమూ చేసుకుంటారు. అయితే మేనల్లుడు ఆనంద్ (నాగభూషణం)కు రాధను ఇచ్చి పెళ్ళి చేయాలని కొండలరావు అనుకుంటాడు. తన ఆలోచనలకు విరుద్ధంగా కూతురు వివాహం చేసుకుందని దూరం పెడతాడు. అలానే తమ ప్రమేయం లేకుండా కొడుకు పెళ్ళి చేసుకున్నాడని వేణు కుటుంబం కూడా అతన్ని దూరం పెట్టేస్తుంది. స్వాభిమానంతో తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఈ కొత్త దంపతులు ప్రయత్నిస్తుంటారు. నిజానికి వీరి పెళ్ళికి ప్రధాన కారకుడు ఆనందే. అతను నళిని (విజయలక్ష్మీ) అనే నర్తకిని ప్రేమిస్తాడు. ఆమెనే పెళ్ళి చేసుకుంటాడు. సంసార సాగరాన్ని అతికష్టం మీద వేణు ఈదుతున్న సమయంలోని వారికి పాప పుడుతుంది. ఆమెకు లక్ష్మీ అని పేరు పెడతారు. ఆనంద్ తన వంతుగా వేణు, రాధలకు సాయం చేయాలని చూస్తాడు కానీ ఆ ప్రయత్నాలు వీరి మధ్య పొరపొచ్చలకు కారణం అవుతాయి. పర్యవసానంగా వేణు, రాధ దూరమౌతారు. ఈ నిజమైన ప్రేమికులు, సంగీతాభిమానులు చివరకు ఎలా ఒకటి అయ్యారు? వారి కూతురు లక్ష్మీ… ‘సంగీత లక్ష్మీ’గా ఎలా గుర్తింపు తెచ్చుకుంది అన్నదే మిగతా కథ.

కథలోని బలమైన సంఘటనల కారణంగానూ, నటీనటులు ప్రతిభావంతులు కావడం చేతను అన్ని సన్నివేశాలు చక్కగా పండాయి. ఎన్టీఆర్, జమున, ఎస్వీ రంగారావు, నాగభూషణం, విజయలక్ష్మితో పాటుగా రమణారెడ్డి, రాజబాబు, పెరుమాళ్లు, సూర్యకాంతం, నిర్మల, ఏడిద నాగేశ్వరరావు, మోదుకూరి సత్యం తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోని ఓ స్టేజ్ ప్లేలో ఎన్టీఆర్ అర్జునుడిగా నటించగా, కృష్ణ పాత్రను జమున చేయడం విశేషం. దర్శకత్వం గిడుతూరి సూర్యమే కథ, కథనాలను సమకూర్చుకున్నాడు. ఆత్రేయ మాటలు రాయడంతో పాటు నాలుగైదు పాటలూ రాశారు. శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఏడ్చూరి సుబ్రహ్మణ్యం మిగిలిన పాటలు రాశారు. సంగీత ప్రధాన చిత్రం కావడంతో సంగీత దర్శకులు ఎస్. రాజేశ్వరరావు తన ప్రతిభను చాటుకోవడానికి దోహదపడింది. చిత్రం ఏమంటే… ఎన్టీయార్ వానపాట… అందులోనూ డ్యూయెట్ అనగానే ఈ తరానికి ‘వేటగాడు’లోని ‘ఆకుచాటు పిందతడిసే’ పాటే గుర్తొస్తుంది. నిజానికి ఆ రోజుల్లోనే ‘కలో నిజమో కమ్మని ఈ క్షణము’ అంటూ సాగే వానపాటలో ఎన్టీఆర్, జమున నర్తించి మెప్పించారు.

సంసారిక జీవితంలో మాటపట్టింపులు వంటివి కాలగమనంలో కరిగిపోతాయనే అంశంతో సంగీత, నృత్య ప్రధానంగా రూపుదిద్దుకున్న ‘సంగీత లక్ష్మి’ చిత్రం మొదటిసారి విడుదలయినప్పుడు ఘన విజయం సాధించకపోయినా, రిపీట్ రన్ లో ప్రేక్షకుల మనసులు చూరగొంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-