55 ఏళ్ళ ‘గోపాలుడు-భూపాలుడు’

తెలుగు చిత్రసీమలో ద్విపాత్రాభినయాలతో విశేషంగా అలరించిన ఘనత నందమూరి తారక రామారావు సొంతం. ఆయన తరువాత ఇతరులు ఎన్ని సినిమాల్లో డ్యుయల్ రోల్స్ లో కనిపించినా, ఆ స్థాయిలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించవు. యన్టీఆర్ పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాల్లోనూ ద్విపాత్రలతో మురిపించారు. రామారావు ద్విపాత్రాభినయంతో రూపొందిన జానపద చిత్రాల్లో ‘గోపాలుడు-భూపాలుడు’ 55 ఏళ్ళ క్రితం సంక్రాంతి సంబరాల్లో భలేగా అలరించింది. 1967 జనవరి 13న విడుదలైన ‘గోపాలుడు-భూపాలుడు’ చిత్రం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రానికి జి.విశ్వనాథం దర్శకత్వం వహించారు. గౌరీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను ఎస్.భావనారాయణ నిర్మించారు.

కథ విషయానికి వస్తే- రాజ్యం కోసం ఒకరినొకరు చంపుకున్న అన్నదమ్ములను చూసి, భయకంపితురాలయి పోతుంది మహారాణి. ఆమెకు పుట్టిన కవలలు కూడా అలాగే పోట్లాడతారేమో అనే భయంతో వారిని విడదీస్తుంది. కోటలో పెరిగిన భూపాలుడు రాజా. కోనలో ఓ గొల్లభామ పెంపకంలో గోపి పెరుగుతారు. అచ్చు ఒకేలా ఉంటారు. రాజా, రజనీ అనే పల్లెపడచును ప్రేమించి ఉంటాడు. ఆమె దగ్గరకు వెళ్ళి వస్తూ ఉండగా, అతణ్ణి చంపే ప్రయత్నం చేస్తారు అతని దాయాది వీరబాహు మనుషులు. అప్పుడు గొల్ల గోపన్న వచ్చి రక్షిస్తాడు. అచ్చు తనలాగే ఉండే గోపిని, తన స్థానంలో ఉంచి, రజనీని కలుసుకుంటూ ఉంటాడు. ఈ విషయం తెలియని రాజా మరదలు పద్మావతి, గోపిని అనుమానిస్తుంది. రాజాను ఓ సారి దెబ్బకొట్టి బంధిస్తాడు వీరబాహు. ఆ యేడాది జరిగే పోటీల్లో తానే మొనగాడిగా నిలుస్తానని భావిస్తాడు. కానీ, గొల్ల గోపన్న అతణ్ణి చిత్తు చేస్తాడు. మరి తాము బంధించిన వాడు ఏమయ్యాడా అనుకుంటారు. అప్పుడు అసలు విషయం తెలుస్తుంది. చివరకు చెరలో ఉన్న రాజాను రక్షించి, వీరబాహును మట్టు పెడతాడు గోపి. తల్లి ఎందుకని తమను విడదీసిందో తెలియని గోపి, తన పెంచిన తల్లిదగ్గరకే వెళ్ళాలనుకుంటాడు. తన తమ్మునితోనే తానూ ఉంటానని రాజా అంటాడు. తల్లి తనను క్షమించమని, ఇద్దరు అన్నదమ్ములు ఒకేచోట ఉండాలని కోరుతుంది. అలా రాజా తన ప్రేయసి రజనీని, గోపి తాను వలచిన పద్మను పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.

యన్టీఆర్ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో జయలలిత, రాజశ్రీ, రాజనాల, సత్యనారాయణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య, వాణిశ్రీ, మిక్కిలినేని, ప్రభాకర్ రెడ్డి, హేమలత, ఎస్.వరలక్ష్మి, జగ్గారావు నటించారు. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీతం సమకూర్చారు. ఇందులోని “ఒకసారి కలలోకి రావయ్యా…” పాటను ఆరుద్ర రాయగా, మిగిలిన అన్ని పాటలనూ సి. నారాయణ రెడ్డి పలికించారు. “కోటలోని చినదానా…”, “చూడకు చూడకు…”, “ఎంత బాగున్నది.. ఎంత బాగున్నది…”, “మరదలా చిట్టి మరదలా…”, “ఇదేనా… ఇదేనా…”, “ఉయ్యాలో…ఉయ్యాలో…”, “జిమ్ జిమ్ జంతడీ…” పాటలు భలేగా అలరించాయి. ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు ఈ సినిమాకు మాటలు రాశారు. 1967 సంక్రాంతి చిత్రాలలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రంగా ‘గోపాలుడు-భూపాలుడు’ నిలచింది. “ఒకసారి కలలోకి రావయ్యా…” పాటలో యన్టీఆర్ శ్రీకృష్ణుని గెటప్ లో కనిపిస్తారు. తెలుగునాట యన్టీఆర్ హిట్ పెయిర్ గా నిలచిన జయలలితకు, ఆయనతో ఇదే మొదటి సినిమా కావడం విశేషం!

Related Articles

Latest Articles