50 ఏళ్ళ ‘చిన్ననాటి స్నేహితులు’

(అక్టోబర్ 6న ‘చిన్ననాటి స్నేహితులు’కు 50 ఏళ్ళు)

రియల్ లైఫ్ కేరెక్టర్స్ రీల్ పైనా కనిపిస్తే ఆసక్తిగానే ఉంటుంది. గూంటూరు ఏ.సి. కాలేజ్ లో చదువుకొనే రోజుల్లో నటరత్న యన్.టి.రామారావు, కళావాచస్పతి జగ్గయ్య మిత్రులు. కాలేజ్ లోనే పలు నాటకాలు వేశారు. తరువాత ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ నాటక సమాజం నెలకొల్పి కూడా వారిద్దరూ పలు నాటకాలు ప్రదర్శించారు. అలాంటి చిన్ననాటి స్నేహితులతో కె.విశ్వనాథ్ అదే టైటిల్ పెట్టి సినిమా తీయడం నిజంగా విశేషమే! యన్టీఆర్, జగ్గయ్య ‘చిన్ననాటి స్నేహితులు’గా విశ్వనాథ్ దర్శకత్వంలో డి.వి.ఎస్.రాజు నిర్మించిన చిత్రం 1971 అక్టోబర్ 6న విడుదలయింది. ‘చిన్ననాటి స్నేహితులు’లో శోభన్ బాబు, వాణిశ్రీ జంట కూడా ముఖ్యపాత్రధారులు.

కథ విషయానికి వస్తే – శ్రీనివాసరావు, శ్రీధరరావు చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ నడివయస్కులు. శ్రీధరరావుకు అరుణ అనే పెళ్ళీడుకొచ్చిన కూతురు ఉంటుంది. శ్రీనివాసరావుకు పెళ్ళయినా పిల్లలు ఉండరు. అరుణనే తన కూతురులా చూసుకుంటూ ఉంటాడు శ్రీనివాసరావు. అరుణ ప్రేమించిన రవితో కాలు జారుతుంది. ఉద్యోగరీత్యా ట్రైనింగ్ కు వెళ్ళిన రవి ప్రమాదంలో మరణించాడని తెలుస్తుంది. అదే సమయంలో అరుణ గర్భవతి అని తేలుతుంది. ఆమెను కాపాడడం కోసం శ్రీనివాసరావు, అతని భార్య లలిత, అరుణకు పుట్టబోయే బిడ్డను తమ సంతానంగా చెప్పుకోవాలని భావిస్తారు. అయితే అదే సమయంలో లేటు వయసులో లలిత కూడా గర్భవతి అవుతుంది. తొలి నుంచీ శ్రీధరరావు ఆస్తిపై కన్నువేసిన అతని బావమరిది నాగభూషణంకు ఈ విషయాలు తెలుస్తాయి. శ్రీనివాసరావు కొడుకును కిడ్నాప్ చేసి, తన కొడుకు రాంబాబును పెళ్ళాడమని అరుణను బెదిరిస్తాడు. బాబు కోసం అరుణ అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసిన శ్రీనివాసరావు మారువేషం వేసుకొని, నాగభూషణం పన్నిన పన్నాగాన్ని వమ్ము చేస్తాడు. అదే సమయంలో రవి బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. చివరకు అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

స్నేహితుని కుటుంబగౌరవం కోసం శ్రీనివాసరావు తపన ఈ చిత్రంలోని అసలు అంశం. అప్పటికే యాభై ఏళ్ళకు దగ్గర పడ్డ యన్టీఆర్, జగ్గయ్య వయసుకు తగ్గ పాత్రలతో విశ్వనాథ్ ఈ చిత్రం రూపొందించారు. ఇందులో శ్రీనివాసరావుగా యన్టీఆర్, శ్రీధర్ రావుగా జగ్గయ్య నటించగా, అరుణ పాత్రలో వాణిశ్రీ, రవిగా శోభన్ బాబు కనిపించారు. మిగిలిన పాత్రల్లో దేవిక, రాజనాల, రాజబాబు, శాంతకుమారి, అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు, రమాప్రభ, పుష్పకుమారి అభినయించారు.

ఈ చిత్రానికి కె.విశ్వనాథ్ కథ సమకూర్చగా జూనియర్ సముద్రాల రచన చేశారు. టి.వి.రాజు సంగీతానికి సి.నారాయణ రెడ్డి పాటలు తోడై అలరించాయి. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. వాటిలో “ఇక్కడే ఈ గదిలోనే…”, “ఏమని తెలుపనురా…”, “అడగాలనివుంది ఒకటడగాలనివుంది…”, “అందాల శ్రీమతికి…”, “సీతమ్మతల్లికి సీమంతమూ…”, “ఎందుకయ్యా నవ్వుతావు…” వంటి పాటలు ఆదరణ పొందాయి. “నోములు పండగా… నూరేళ్ళు నిండగా…” అనే పాటలో పసిపాపను ఉయ్యాలలో వేసి ఆడవాళ్లు పాడతారు. అందులో “నూరేళ్ళు నిండగా…” అంటూ వచ్చిన పదాలను పండితులు తప్పు పట్టారు. నిజానికి ‘నూరేళ్ళు నిండగా…’ అన్నది జాలితో అసువులు బాసిన వారికి ఉపయోగిస్తారు. అలాంటి మాటను ఈ పాటలో చోటు చేయడంపై విమర్శలు వినిపించాయి. పైగా తెలుగుకు ప్రాణం ఇచ్చే నటులు యన్టీఆర్, జగ్గయ్య నటించిన చిత్రమిది. వారిలాగే తెలుగంటే ప్రాణం పెట్టే నిర్మాత డి.వి.ఎస్.రాజు, దర్శకుడు కె.విశ్వనాథ్ కలయికలో రూపొందిన సినిమా. ఇక తెలుగు నుడికారంలా ఎప్పుడూ తలెత్తుకు తిరిగే సినారె కలం నుండి ఇలాంటి అపభ్రంశపు పదాలు దొర్లడం నిజంగా విచారకరమే. ఈ సినిమాలో కథనం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అయితే యన్టీఆర్ ఇమేజ్ కారణంగా రిపీట్ రన్స్ లో ‘చిన్ననాటి స్నేహితులు’ బాగానే వసూళ్ళు చూసింది.

-Advertisement-50 ఏళ్ళ 'చిన్ననాటి స్నేహితులు'

Related Articles

Latest Articles