50 ఏళ్ళ ‘బంగారుతల్లి’

(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు)

కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు అబ్బాయిలతో ఉన్న ఓ ఒంటరి మహిళ రాధ తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎలా ఎదుర్కొంది అన్నదే ప్రధానాంశం.

ఓ వైపు ఒంటరి మహిళగా రాధ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా, సాటి మగువ అపాయంలో ఉండగా రక్షించేందుకు కన్నకొడుకునే కడతేర్చిన ఆదర్శమూర్తిగానూ కనిపిస్తుంది. ‘ఔరత్’లో రాధ పాత్రను నాటి మేటి నటి సర్దార్ అక్థర్ పోషించారు. అదే పాత్రను 1957లో రూపొందిన ‘మదర్ ఇండియా’లో నర్గిస్ ధరించారు. మన దేశం నుండి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ సంపాదించిన తొలి చిత్రంగానూ ‘మదర్ ఇండియా’ చరిత్రలో నిలచిపోయింది. ‘మదర్ ఇండియా’ 1957 బ్లాక్ బస్టర్ గా నిలచి పోయింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం కూడా లభించింది. పలు ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ గెలుచుకుంది. మరో విశేషమేమంటే, ఇందులో నర్గీస్ కు చిన్నకొడుకుగా నటించిన సునీల్ దత్ తరువాతి కాలంలో ఆమెనే పెళ్ళిచేసుకున్నారు. ఇలా పలు అంశాలకు వేదికగా నిలచిన ‘మదర్ ఇండియా’ దాదాపు 14 ఏళ్ళ తరువాత తెలుగులో ‘బంగారు తల్లి’గా జనం ముందు నిలచింది. ఇందులో ప్రధాన పాత్ర పేరును అన్నపూర్ణగా మార్చారు.

ఇందులో అన్నపూర్ణగా జమున నటించగా, ఆమె భర్తగా జగ్గయ్య, పెద్దకొడుకుగా శోభన్ బాబు, చిన్నకొడుకుగా కృష్ణంరాజు అభినయించారు. మిగిలిన పాత్రల్లో నాగభూషణం, అల్లు రామలింగయ్య, వెన్నీరాడై నిర్మల, రమాప్రభ, బాలసరస్వతి, నిర్మల, బేబీ శ్రీదేవి, సాక్షి రంగారావు కనిపించారు. ఈ చిత్రానికి దేవులపల్లి, శ్రీశ్రీ, కొసరాజు, ఆత్రేయ, దాశరథి, సి.నారాయణరెడ్డి పాటలు రాశారు. ఎస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. “తరలింది బంగారు బొమ్మ…”, “పల్లెసీమ మన పంట సీమ…” , “ప్రేమనిచ్చి ప్రాణమిచ్చి పెంచేదే తల్లి…”, “బంగరు తల్లి పండిదోయ్… పంటల పండుగ వచ్చిందోయ్…”, “ముత్యాల ముక్కుపోగు…”, “చల్ చల్ బండీ…చలాకీ బండి…” వంటి పాటలు ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయి.

ప్రముఖ రాజకీయనాయకులు చేగొండి హరిరామజోగయ్య, తన మిత్రుడు నాచు శేషగిరిరావుతో కలసి ‘బాబూ పిక్చర్స్’ పతాకంపై ‘బంగారు తల్లి’ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో హరిరామజోగయ్య పేరు హరిబాబుగా ప్రకటించుకొనేవారు. ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. పినిశెట్టి శ్రీరామమూర్తి రచన చేశారు. ఈ సినిమాను చూసిన వారు రంగుల చిత్రం ‘మదర్ ఇండియా’తో పోల్చి చూశారు. చాణక్య సైతం ‘బంగారుతల్లి’ని ఎక్కడా చెడిపోకుండా తెరకెక్కించారు. అప్పటికే రంగుల సినిమాలపై జనాల్లో మోజు పెరగడం వల్ల ఈ ‘బంగారుతల్లి’ని ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అయినప్పటికీ నటిగా జమునకు, నటుడిగా కృష్ణంరాజుకు ‘బంగారుతల్లి’ మంచిపేరు సంపాదించి పెట్టింది.

Related Articles

Latest Articles

-Advertisement-