ఆసక్తిగా మారిన జీఎస్టీ కౌన్సిల్.. అదే జరిగితే పెట్రోల్ రూ.60 దిగవకు..!

భారత్‌ దృష్టి మొత్తం ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంపైనే ఉంది… లక్నో వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ 45వ సమావేశం ప్రారంభం అయ్యింది.. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సహా.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్థికమంత్రులు పాల్గొంటున్నారు.. అయితే, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. 11 రకాల కోవిడ్‌ ఔషదాలపై పన్ను రాయితీలను పొడిగించే అవకాశం ఉంది.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనపై కూడా చర్చ సాగనుంది.. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది..

అయితే, పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు భారత్‌లో సెంచరీ కొట్టేశాయి.. ప్రత్యక్ష, పరోక్షంగా చాలా వస్తువులపై వీటి ప్రభావం పడుతోంది.. దీంతో.. ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది.. మరోవైపు.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.. అయితే, ఆదాయం తగ్గిపోతుందన్న ఉద్దేశంతో.. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు దీనికి అడ్డుపుల్ల వేస్తూ వస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది.. కానీ, ఇవాళ భేటీలో దీనిపై కచ్చితంగా చర్చ సాగే అవకాశం ఉందంటున్నారు.. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే మాత్రం.. లీటర్‌ పెట్రోల్ ధర 60 రూపాయల దిగువకు పడిపోయే అవకాశం ఉందంటున్నారు.. ఎందుకుంటే.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ బేస్ ధర రూ. 40.78గా ఉంది.. రవాణా ఛార్జీలతో కలిపి డీలర్ వద్దకు చేరే సరికి రూ. 41.10 అవుతుంది. ఇక, దీనికి రూ.32.90 ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ప్రభుత్వ పన్ను కాగా.. డీలర్ కమీషన్ రూ.3.84, వ్యాట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ పన్ను రూ.23.35 కలపడంతో.. హస్తినలో పెట్రోల్ రిటైల్ అమ్మకం ధర రూ. 101.19కు చేరుతుంది.. కానీ, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రద్దు అవుతాయి. ఇక, పెట్రో ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ అమలు చేసే అవకాశం ఉంటుంది.. దీంతో.. పెట్రోల్ మూలధర, జీఎస్టీ, డీలర్ కమీషన్ ఇలా మొత్తం కలుపుకుంటే.. లీటర్‌ పెట్రోల్ ధర రూ.56.44కి తగ్గిపోనుంది.. దీంతో.. జీఎస్టీ కౌన్సిల్‌లో ఏం చర్చ సాగుతోంది.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

-Advertisement-ఆసక్తిగా మారిన జీఎస్టీ కౌన్సిల్.. అదే జరిగితే పెట్రోల్ రూ.60 దిగవకు..!

Related Articles

Latest Articles