45 ఏళ్ళ ‘కురుక్షేత్రము’

ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు. కానీ, ఆయన స్టార్ గా మారడానికి ‘అల్లూరి సీతారామరాజు’ కారణమయింది. ఇక శోభన్ హీరోగా నిలదొక్కుకోవడానికి పుష్కరకాలం పట్టింది. అలాగే కృష్ణంరాజు సైతం హీరోగా సెటిల్ కావడానికి విలన్ గానూ నటించాకనే, కోరుకున్న స్థానం లభించింది. 1975లో శోభన్ బాబు స్టార్ గా జేజేలు అందుకున్నారు. అలాగే ‘భక్త కన్నప్ప’ ఘనవిజయంతో కృష్ణంరాజు సైతం స్టార్ స్టేటస్ సంపాదించారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ముగ్గురూ స్టార్స్ అనిపించుకున్నాక కలసి నటించిన చిత్రం ‘కురుక్షేత్రము’. దాంతో ఈ సినిమాను మల్టీస్టారర్ అన్నారు. అందునా అది పౌరాణికం కావడం, భారీగా చిత్రనిర్మాణానికి పూనుకోవడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

యన్టీఆర్ తో ‘పాండవవనవాసము’ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ఏ.ఎస్.ఆర్.ఆంజనేయులు భాగస్వామ్యంతో కృష్ణ సమర్పకునిగా ఈ ‘కురుక్షేత్రము’ తెరకెక్కింది. ఈ చిత్రానికి ‘పాండవవనవాసము’ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు దర్శకులు. యన్టీఆర్ కు కామేశ్వరరావు అంత్యంత సన్నిహితులు. కానీ, ఈ సినిమాను అంగీకరించడం వల్ల వారి మధ్య దూరం పెరిగింది. ఒకే రోజున ఒకే ఇతివృత్తంతో సినిమాలు విడుదల కావడం అన్నది కొత్తేమీకాదు. తెలుగు సినిమా పలుకు నేర్చిన రోజుల్లోనే కొన్ని చిత్రాలు అలా జనం ముందు నిలిచాయి. తెలుగు చిత్రసీమలో రంగుల సినిమాల హంగు మొదలయిన తరువాత భారతగాథ ఆధారంగా ఓ వైపు ‘దానవీరశూర కర్ణ’, మరోవైపు ‘కురుక్షేత్రము’ రూపొందడం విశేషం. పౌరాణిక పాత్రల్లో మేటి అనిపించుకున్న యన్టీఆర్ ఓ వైపు స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ పాత్రలు పోషిస్తూ ‘దానవీరశూర కర్ణ’ రూపొందించారు. మరోవైపు పౌరాణిక బ్రహ్మగా పేరొందిన కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కలసి ‘కురుక్షేత్రము’లో నటించారు. ఇందులో అర్జునునిగా కృష్ణ, కృష్ణునిగా శోభన్ బాబు, కర్ణునిగా కృష్ణంరాజు కనిపించారు. యన్టీఆర్ ‘దానవీరశూర కర్ణ’ నాలుగు గంటల సినిమా కాగా, ‘కురుక్షేత్రము’ మూడు గంటలపాటు సాగే చిత్రం. అందులో భీమునిగా నటించిన సత్యనారాయణ, ‘కురుక్షేత్రము’లో దుర్యోధనునిగా నటించారు. అలాగే అందులో కీలక పాత్రలు పోషించిన గుమ్మడి, ధూళిపాల, ముక్కామల కూడా ‘కురుక్షేత్రము’లో నటించారు.

‘కురుక్షేత్రము’లోనూ పాంచాలీ పరాభవంతోనే కథ సాగి, చివరకు కురుక్షేత్రయుద్ధం జరుగుతుంది. నిజం చెప్పాలంటే నిర్మాణ వ్యయం పరంగా ‘కురుక్షేత్రము’ చాలా ఖర్చు చేసింది. యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజస్థాన్ వెళ్ళారు. అడుగడుగునా భారీతనం కనిపించినా, ఏ సన్నివేశం కూడా పట్టుగా సాగలేకపోయింది. ఇందులో అర్జునునిగా నటించిన కృష్ణ, అందులో అర్జునునిగా కనిపించిన హరికృష్ణ మీద పరవాలేదనే పేరు సంపాదించారు. అంతే తప్ప, మిగిలిన వారందరూ ఎంత మేటి నటులైనా, ‘దానవీరశూర కర్ణ’లోని పాత్రల చిత్రీకరణ ముందు తేలిపోయారు.

‘దానవీరశూర కర్ణ’ చిత్రానికి తొలుత సంగీతం సమకూర్చడానికి నిశ్చయించిన ఎస్.రాజేశ్వరరావు, కొన్ని కారణాలవల్ల ఆ సినిమా నుండి తప్పుకున్నారు. ఈ చిత్రానికి ఆయన స్వరకల్పన చేశారు. ‘కురుక్షేత్రము’లో శ్రీశ్రీ రాసిన “ధర్మక్షేత్రం… ఇది కురుక్షేత్రం…”, సినారె అందించిన “మ్రోగింది కళ్యాణ వీణ…”, దాశరథి పలికించిన “హరివిల్లు దివి నుండి దిగివచ్చెనేమో…”, “వేటూరి రాసిన “అలుకల కులుకుల…”, జూనియర్ సముద్రాల కూర్చిన “ఇదే మయసభా మందిరం…” పాటలు అలరించాయి. వీటూరి, ఆరుద్ర సైతం ఈ చిత్ర గీత రచనలో పాలు పంచుకున్నారు. తిరుపతి వేంకటకవులు, కరుణశ్రీ, సముద్రాల జూనియర్, జాషువా రాసిన పద్యాలను అనువుగా ఉపయోగించుకున్నారు. ఘంటసాల ‘భగవద్గీత’ను కూడా వినియోగించుకున్నారు. గాన ప్రపంచంలో మేరు సమానులైన పలువురు గాయనీగాయకులు ఇందులో తమ గాత్రం వినిపించారు. యన్టీఆర్ కు సన్నిహితులైన జూనియర్ సముద్రాల ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాశారు. త్రిపురనేని మహారథి సంభాషణలు పలికించారు. ఇలా ఎందరో మహామహులు పనిచేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. కొంతలో కొంత బెంగళూరులో ఆదరణ పొందింది. ఏది ఏమైనా యన్టీఆర్ వంటి సూపర్ స్టార్ సినిమా ముందు ‘కురుక్షేత్రము’లో నటించి, పోటీకి దిగిన కృష్ణ, శోభన్, కృష్ణంరాజును జనం స్టార్స్ గా గుర్తించారు. తరువాతి రోజుల్లో వారి సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించారు.

Related Articles

Latest Articles