45 ఏళ్ళ నేరం నాదికాదు ఆక‌లిది

న‌ట‌ర‌త్న నంద‌మూరి తార‌క రామారావు స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, రీమేక్స్ తోనూ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. హిందీ రీమేక్స్ లోనూ విజ‌యాల శాతం య‌న్టీఆర్ కే ఎక్కువ‌. రామారావు క‌థానాయ‌కునిగా య‌స్.డి.లాల్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌విచిత్ర ఫిలిమ్స్ ప‌తాకంపై వై.వి.రావ్ నిర్మించిన నేరం నాది కాదు ఆక‌లిది చిత్రానికి హిందీలో రాజేశ్ ఖన్నా హీరోగా రూపొందిన రోటీ మాతృక‌. ఈ చిత్రానికి ముందు రామారావుతో య‌స్.డి.లాల్ ద‌ర్శ‌క‌త్వంలోనే వై.వి.రావ్ నిర్మించిన నిప్పులాంటి మ‌నిషి కూడా హిందీ జంజీర్ ఆధారంగా తెర‌కెక్కి ర‌జ‌తోత్స‌వం చూసింది. అందువ‌ల్ల య‌న్టీఆర్ తో నేరం నాదికాదు ఆక‌లిది చిత్రం ప్రారంభం నుంచీ అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొల్పింది. ఈ చిత్రానికి ముందు య‌న్టీఆర్ తో య‌స్.డి.లాల్ నిండు మ‌న‌సులు, భ‌లే మాస్ట‌ర్, నిప్పులాంటి మ‌నిషి, అన్న‌ద‌మ్ముల అనుబంధం వంటి రీమేక్స్ తో విజ‌యం సాధించారు. య‌న్టీఆర్ హీరోగా య‌స్.డి.లాల్ సొంత చిత్రం నేనే మొన‌గాణ్ణి ఒక్క‌టే అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌లేదు. రిపీట్ ర‌న్స్ లో ఆ చిత్రం కూడా జ‌నాన్ని ఆక‌ట్టుకుంది. అందువ‌ల్ల య‌న్టీఆర్, య‌స్.డి.లాల్ కాంబో అనగానే నేరం నాదికాదు ఆక‌లిది చిత్రంపై కూడా అంద‌రి చూపు మ‌ళ్ళింది. అభిమానుల‌కు ఆనందం పంచుతూ ఈ చిత్రం కూడా మంచి విజ‌యం సాధించింది.

క‌థ విష‌యానికి వ‌స్తే- చిన్న‌త‌నం నుంచీ ఆక‌లికి అల‌మ‌టించే విక్ర‌మ్ దొంగ‌గా మార‌తాడు. ఓ పేద‌రాలి కొడుకు ఆక‌లి తీర్చ‌డానికి ఓ గూండాతో పోరాడే క్ర‌మంలో అత‌ని ప్రాణం తీస్తాడు. జైలుకు పోతాడు. అత‌నిచేత అంత‌కు ముందు దొంగ‌త‌నాలు చేయించిన రంజిత్, విక్ర‌మ్ ను వెంటాడుతాడు. పోలీస్ ఆఫీస‌ర్ ప్రాణాలు కాపాడే స‌మ‌యంలో వారి వాహ‌నం పేలిపోతుంది. అంద‌రూ విక్ర‌మ్
చనిపోయాడు అనుకుంటారు. త‌ప్పించుకున్న విక్ర‌మ్ కు రైలులో శ్ర‌వ‌ణ్ క‌నిపిస్తాడు. విక్ర‌మ్ చేతుల‌కు బేడీలు ఉన్నందున అత‌ణ్ణి పోలీసుల‌కు ప‌ట్టించాల‌నుకుంటాడు శ్ర‌వ‌ణ్. అత‌ణ్ణి వారించే ప్ర‌య‌త్నంలో శ్ర‌వ‌ణ్ బ్రిడ్జిపై నుండి న‌దిలో ప‌డ‌తాడు. అనుకోకుండా శ్ర‌వ‌ణ్ క‌న్న‌వారిని చేరుకుంటాడు. వారు ఇద్ద‌రూ అంధులు. అక్క‌డ అక్ర‌మాలు చేసే వారి భ‌ర‌తం ప‌డ‌తాడు. గౌరీ అనే అమ్మాయికి విక్ర‌మ్ మీద ప్రేమ క‌లుగుతుంది. ఓ సంద‌ర్భంలో విక్ర‌మ్ కాపాడిన ఓ వేశ్య ఓ సమ‌యాన అత‌నికి సాయం చేస్తుంది. ప్ర‌మాదం కార‌ణంగా కాలు పోగొట్టుకున్న శ్ర‌వ‌ణ్ తిరిగి వ‌స్తాడు. విక్ర‌మ్ చేసిన మంచి ప‌నులు చూసి అత‌ను కూడా ఆనందిస్తాడు. విక్ర‌మ్ త‌న తండ్రిని చంపింది రంజిత్ అని తెలుసుకుంటాడు. రంజిత్ గౌరిని కిడ్నాప్ చేస్తాడు. గౌరీని రక్షించ‌డం కోసం రంజిత్ ను అంతం చేస్తాడు. కోర్టులో నేరం త‌న‌ది కాద‌ని ఆక‌లిద‌ని వాదిస్తాడు విక్ర‌మ్. అత‌ని స‌త్ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా కొన్నాళ్ళ‌కే విడుద‌ల చేస్తారు. విక్ర‌మ్, గౌరి పెళ్ళితో క‌థ సుఖాంత‌మ‌వుతుంది.

నిజానికి హిందీ రోటీలో చివ‌ర‌కు హీరో రాజేశ్ ఖన్నా, నాయిక ముంతాజ్ క్ల‌యిమాక్స్ లో చ‌నిపోతారు. య‌న్టీఆర్, మంజుల జోడీ చ‌నిపోతే జ‌నం అంగీక‌రించ‌ర‌ని క‌థ‌ను సుఖాంతంగా మ‌లిచారు. తెలుగువారిని ఆ మార్పు బాగా ఆక‌ట్టుకుంది. జీవ‌న్ ప్ర‌భ దేశాయ్ రాసిన క‌థ‌కు తెలుగులో గొల్ల‌పూడి మాట‌లు రాశారు. సి.నారాయ‌ణ‌రెడ్డి, ఆరుద్ర పాట‌లు ప‌లికించారు. స‌త్యం స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు. ఇందులోని పాట‌ల‌న్నీ జ‌నాన్ని ఆక‌ట్టుకున్నాయి. మంచిని స‌మాధి చేస్తారా… ఇది మ‌నుషులు చేసే పనియేనా… పాట అప్ప‌ట్లో విశేషాద‌ర‌ణ చూర‌గొంది. ప‌బ్లిక్కురా ఇది అన్నీ తెలిసిన ప‌బ్లిక్కురా…, హైద‌ర‌బాదు బుల్ బుల్…, చెకుముకి ర‌వ్వా చిన‌బోయింది ఓ య‌మ్మా…, డైమండ్ రాణీ గులాబీ బుగ్గ‌నీది… పాట‌లు ప‌ర‌వ‌శింప‌చేశాయి. ఈ చిత్రంలో ముర‌ళీమోహ‌న్, గుమ్మ‌డి, త్యాగ‌రాజు, ప్ర‌భాక‌ర్ రెడ్డి, గిరిబాబు, రాజ‌బాబు, ప్ర‌భ‌, పండ‌రిబాయి, జ‌య‌మాలిని, ముక్కామ‌ల‌, రాజ‌నాల త‌దిత‌రులు న‌టించారు. ప‌బ్లిక్కురా… పాట‌లో మంజుల కాసేపు డ్యుయ‌ల్ రోల్ లో క‌నిపించ‌డం విశేషం. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించి, శ‌త‌దినోత్స‌వాలు చూసింది. హిందీ రీమేక్స్ లో వ‌రుస‌గా య‌న్టీఆర్ కు 1974లో నిప్పులాంటి మ‌నిషి, 1975లో అన్న‌ద‌మ్ముల అనుబంధం, 1976లో నేరం నాది కాదు ఆక‌లిది వంటి విజ‌యాల‌ను అందించి, హ్యాట్రిక్ సాధించారు య‌స్.డి.లాల్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-