45 సంవత్సరాల ‘జ్యోతి’

(జూన్ 4తో ‘జ్యోతి’ చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి)
కొన్ని సినిమాలు చూసినప్పటి కంటే తరువాత తలపుల్లో మెదలుతూ ఉంటాయి. మరికొన్ని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ఈ రెండు కోవలకు చెందిన చిత్రం ‘జ్యోతి’. ఈ సినిమాలోని ఇతివృత్తం తలచుకుంటే అయ్యో అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేది అనీ అనుకుంటాం. ‘జ్యోతి’ కథ అలా మనలను వెంటాడుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఈ సినిమాకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకులు. తెలుగు సినిమాను తన కమర్షియల్ ఫార్ములాతో దశాబ్దాల పాటు నడిపించిన ఘనుడు రాఘవేంద్రరావు. ఈ నాటికీ ఆయన సూచించిన సూత్రాలనే పట్టుకొని పరుగులు తీసేవారు ఎందరో ఉన్నారు. అలాంటి రాఘవేంద్రరావు ఇంత సమస్యాత్మక కథని, అంత నీట్ గా, తక్కువ బడ్జెట్ లో ఎలా తీశారా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ‘జ్యోతి’ రాఘవేంద్రరావుకు రెండో సినిమాయే. ఈ చిత్రాన్ని టి.క్రాంతికుమార్ నిర్మించారు. చాలామంది కొన్ని సైట్స్ చూసి ‘జ్యోతి’ సినిమా జయబాధురి, అమితాబ్ బచ్చన్ నటించిన ‘మిలి’ సినిమా రీమేక్ అని భావిస్తారు. మరి అది ఎవరు ప్రవేశ పెట్టారో కానీ, ఈ చిత్రానికి ప్రముఖ రచయిత్రి సి.ఆనందరామం రాసిన ‘మమతల కోవెల’ ఆధారం. 1976 జూన్ 4న విడుదలైన ‘జ్యోతి’ విమర్శకుల ప్రశంసలతో పాటు, జనాదరణనూ చూరగొంది.

‘జ్యోతి’ కథలోనే ఎంతో వైవిధ్యం ఉంది. జ్యోతి, రవిని ప్రేమించి పెళ్ళాడాలనుకుంటుంది. హఠాత్తుగా తన తండ్రి వయసున్న రాజయ్యను పెళ్ళాడుతుంది. జ్యోతి అలా ఎందుకు చేసిందో ఎవరికీ అర్థం కాదు. జ్యోతి ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఎక్కువ రోజులు బతకనని తెలుసుకున్న జ్యోతి, అదే ఆసుపత్రిలో తనను చెల్లీ అంటూ అభిమానించిన విశాలి కోసం త్యాగం చేస్తుంది. విశాలి భర్త రాజయ్య, తన అక్క మాట విని భార్యను అనుమానించి ఉంటాడు. విశాలి కూతురు రాజయ్య దగ్గరే ఉంటుంది. విశాలి ఆస్తి తన కూతురుకు చెందాలి అంటే, అది ముందు రాజయ్యకు వస్తుంది. అందువల్లే రాజయ్యను వివాహం చేసుకొని, విశాలి కూతురుకు కనువిప్పు కలిగేలా చేస్తుంది జ్యోతి. తాను ప్రేమించిన రవితోనే విశాలి కూతురు పెళ్ళి జరిపించి జ్యోతి కన్నుమూయడంతో కథ ముగుస్తుంది. ఈ కథను ఈ తరం ప్రేక్షకులు చూస్తే, జ్యోతి అంత త్యాగం చేసే బదులు అసలు విషయాలు రాజయ్య, ఆయన కూతురుకు కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా అంటారు. అలాగే ప్రేమించిన రవికి అసలు విషయం తెలియజేయవచ్చు కదా అనీ అనవచ్చు. అసలైన ప్రేమికులు అర్థం చేసుకోగలరు కదా అనీ తేల్చవచ్చు. నిజమే ‘జ్యోతి’ కథ ఇప్పుడు చూసినా పలు ప్రశ్నలు లేవనెత్తుతుంది. అందుకే ఈ చిత్ర నిర్మాత టి.క్రాంతి కుమార్ తాను దర్శకుడైన తరువాత ‘స్రవంతి’ చిత్రాన్ని ఆ కోణంలోనే తెరకెక్కించారు. మారే కాలానికి అనుగుణంగా మనసులూ మారుతూ ఉంటాయి. అది సహజం. ప్రేమించినవారి జీవితం అన్యాయం కాకూడదని కొందరు భావించి, వారికి వేరే పెళ్ళి అయ్యేలా చూస్తూంటారు. దాసరి ఈ కోణంలోనే ‘ప్రేమాభిషేకం’ తెరకెక్కించారు. ఇలా ‘జ్యోతి’ని ఇప్పుడు చూసినా, పలు పరిష్కారాలు వెదికేలా చేస్తుంది.

ఈ సమస్యాత్మకమైన కథను కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నిర్మాత ఇచ్చిన బడ్జెట్ కు తగిన రీతిలో రిచ్ నెస్ కనిపించేలా రాఘవేంద్రరావు ఈ సినిమాను రూపొందించారు. ఓ బడ్జెట్ మూవీకి తగిన రీతిలో పాటలను తెరకెక్కించిన తీరునూ మరచిపోలేము. బ్లాక్ అండ్ వైట్ లో రూపొందిన ‘జ్యోతి’ జనాదరణ పొందింది. ఎ.విన్సెంట్ ఛాయాగ్రహణ దర్శకత్వంలో కె.ఎస్. ప్రకాశ్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తరువాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే క్రాంతి కుమార్ ‘కల్పన’ (ఇది హిందీ ‘అనామిక’ కు రీమేక్), ‘ఆమెకథ’, ‘మోసగాడు’ చిత్రాలను నిర్మించారు.

‘జ్యోతి’ చిత్రంలో జయసుధ, మురళీమోహన్, గుమ్మడి, ఛాయాదేవి, గిరిబాబు, ఫటాఫట్ జయలక్ష్మి, రావు గోపాలరావు, సత్యనారాయణ, కృష్ణకుమారి, శుభ, చిడతల అప్పారావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి సత్యానంద్ సంభాషణలు రాయగా, ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు.చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన “ఏడు కొండలపై ఏల వెలిశావు…”, “సిరిమల్లె పువ్వల్లె నవ్వు…”, “నీకూ నాకూ పెళ్ళంట…”, “ఫస్ట్ టైమ్ ఇది నీకూ బెస్ట్ టైమ్…” అనే పాటలు అలరించాయి. ఈ సినిమా నటిగా జయసుధకు, దర్శకునిగా కె.రాఘవేంద్రరావుకు, నిర్మాతగా టి.క్రాంతి కుమార్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-