40 ఏళ్ళ ‘బంగారుభూమి’

హీరో కృష్ణ, డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి కాంబినేషన్ లో పలు జనరంజకమైన చిత్రాలు తెరకెక్కాయి. వారిద్దరి కలయికలో రూపొందిన పల్లెసీమల నేపథ్యం ఉన్న సినిమాలు విజయాలు సాధించాయి. కృష్ణను సంక్రాంతి హీరోగా నిలిపిన ఘనత కూడా చంద్రశేఖర్ రెడ్డిదే! కృష్ణ హీరోగా పి.సి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘పాడిపంటలు’ చిత్రం విజయం సాధించింది. అప్పటి నుంచీ ప్రతి సంక్రాంతికి కృష్ణ ఓ సినిమాను విడుదల చేస్తూ వచ్చారు. అలా కృష్ణ, పి.సి.రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘బంగారుభూమి’ కూడా సంక్రాంతి కానుకగా 1982 జనవరి 14న జనం ముందు నిలచింది. శ్రీదేవి నాయికగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని మహేశ్వరి మూవీస్ పతాకంపై ఎస్.పి.వెంకన్న బాబు నిర్మించారు.

‘బంగారుభూమి’ కథ విషయానికి వస్తే – రవి తన సవతితల్లి, చెల్లి, తమ్ముడుతో కలసి జీవిస్తూ ఉంటాడు. భూమే తల్లిగా భావిస్తూంటాడు. అతని ఎదుగుదల చూసి ఊరిలో పెద్దమనుషులకు కన్నుకుడుతుంది. రవికి, సవతి తమ్మునికి మధ్య పుల్లలు పెడతారు. వారు విడిపోతారు. ఆ ఊరిలో అందరివాడుగా ఉన్న షావుకారు ఊరి జనానికి అప్పులు ఇచ్చి, ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఉంటాడు. అతని కూతురు పద్మ ధనగర్వంతో ఉంటుంది. ఆమెకు రవి కనువిప్పు కలిగిస్తాడు. షావుకారు కోరికపై పద్మను రవి పెళ్ళాడుతాడు. తన వాటాకు వచ్చిన భూమిలోనే బంగారు పండిస్తాడు రవి. చివరకు రవి తమ్ముడు సుధాకర్ కు అసలు విషయం తెలుస్తుంది. అతణ్ణి హింసించే సమయంలో రవి వెళ్ళి కాపాడి, అసలు దోషులను పోలీసులకు పట్టిస్తాడు. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.

‘బంగారుభూమి’ చిత్రంలో కృష్ణ, రావు గోపాలరావు, శ్రీదేవి, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, కృష్ణకుమారి, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్, సూర్యకాంతం, రాజబాబు, కవిత, సుభాషిణి, సంగీత, గీత, మిక్కిలినేని, నిర్మలమ్మ, హరనాథ్ నటించారు. ఈ చిత్రానికి మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య మాటలు రాశారు. ఆత్రేయ, వేటూరి పాటలు పలికించగా, జె.వి.రాఘవులు స్వరకల్పన చేశారు. “దొంగ చిక్కంది…”, “ఆరిపేయ్ ఆరిపేయ్ చలిమంట…”, “పొంగింది పొంగింది బంగారుభూమి…” పాటలు అలరించాయి. 1982 సంక్రాంతి సంబరాల్లో విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా ‘బంగారుభూమి’ నిలచింది.

Related Articles

Latest Articles