40 ఏళ్ళ యన్టీఆర్ ‘విశ్వరూపం’

(జూలై 25న యన్టీఆర్ ‘విశ్వరూపం’కు 40 ఏళ్ళు)

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న యన్.టి.రామారావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు కాంబినేషన్ లో రూపొందిన ఐదు చిత్రాలు అలరించాయి. వాటిలో నాల్గవ చిత్రం ‘విశ్వరూపం’. అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి తెరకెక్కించిన “మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు” అన్నిటా నందమూరి ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ‘విశ్వరూపం’లో కూడా యన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రఖ్యాత గీత రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి నిర్మించడం విశేషం. కొసరాజుకు ‘జానపద కవి బ్రహ్మ , కవిరత్న’ వంటి బిరుదులు ఉన్నాయి. దాంతో తన బేనర్ కు ‘కవి రత్నామూవీస్’ అని పేరు పెట్టుకొని ‘విశ్వరూపం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కొసరాజు తనయుడు భానుప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు. 1981 జూలై 25న విడుదలైన ‘విశ్వరూపం’ చిత్రం మంచి ఓపెనింగ్స్ చూసింది. కానీ, తరువాత అంతగా అలరించలేకపోయింది.

కథ విషయానికి వస్తే – రాజకీయ నాయకులు, స్టూడెంట్స్ పాలిటిక్స్ వీటి మధ్య కొందరు విద్యార్థుల జీవితాలు బుగ్గి అవుతున్నాయని లెక్చరర్ విశ్వం భావిస్తాడు. తన విద్యార్థుల మనసులు మార్చి, అందరూ ఒక్కటే అనే భావం కలిగిస్తాడు. అలాంటి వాడివల్ల సమాజానికి మేలు జరుగుతుందే కానీ, రాజకీయనాయకులకు కీడేనని ఇద్దరు దుర్మార్గులు భావిస్తారు. విశ్వంను అంతమొందిస్తారు. విశ్వం కారణంగా మారుమనసు పొందిన యువ నాయకులకు విశ్వం ఆత్మ దిశానిర్దేశం చేస్తుంది. అచ్చు విశ్వం పోలికలతో ఉన్న ఓ లోకల్ గూండా చిట్టయ్యను పట్టుకు వస్తారు. అతణ్ణి విశ్వం స్థానంలో నిలబెడతారు. విశ్వం ఆత్మశక్తితో చిట్టయ్య దుర్మార్గుల భరతం పడతాడు. ఆయన తలపెట్టిన మంచి పనులు పూర్తి చేస్తాడు. తుదకు విశ్వం చావుకు కారకులైన వారిని అంతమొందించి, జైలుకు వెళతాడు చిట్టయ్య. విశ్వం ఆత్మశాంతించడంతో కథ ముగుస్తుంది.

అంతకు ముందు కొన్ని చిత్రాలలో శాంతించని ఆత్మ మరోశరీరంలో ప్రవేశించడం, భరతం పట్టడం వంటివి సాగుతూ ఉండేవి. ఇందులో అలా కాకుండా విశ్వం ఆత్మ తనను అభిమానించే విద్యార్థులకు దారి చూపిస్తూ ఉండడం విశేషం. ఈ చిత్రంలో విశ్వం పాత్రలో యన్టీఆర్ అభినయం ఆకట్టుకుంది. ఇక చిట్టయ్య పాత్రలో ఆయన తనదైన బాణీతో నటించేసి అలరించారు. రెండు పాత్రల మధ్య వైవిధ్యం ప్రదర్శించడంలో నటరత్న తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ చిత్రం ద్వారా అంబిక తెలుగు తెరకు పరిచయం అయింది. జయసుధ, రావు గోపాలరావు, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, ప్రసాద్ బాబు, ఈశ్వరరావు, ఆర్ .నారాయణ మూర్తి, సుకుమారి, సుభాషిణి తదితరులు నటించారు. ఎవరికి వారు తమ పాత్రల్లో అలరించారు.

ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన చేశారు. దాసరి నారాయణరావు రాసిన “నూటికో కోటికో ఒక్కరూ… ఎప్పుడో ఎక్కడో పుడతారు… అది మీరే మీరే మాస్టారూ…” పాట అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పటికీ గురుపూజ్యోత్సవం సందర్భంగా వినిపిస్తూనే ఉంటుంది. ఇక దాసరి పలికించిన మరో పాట “యువకుల్లారా లేవండి… యువతను నిద్దుర లేపండి…” కూడా ఎంతగానో ఆకట్టుకుంది… వేటూరి రాసిన “నారంగా సారంగా…”, రాజశ్రీ రచించిన “కనులు చాలవు…” అనే పాట కూడా మురిపించాయి. కొసరాజు కలం పలికించిన “కీచు కీచు పిట్ట…”, “ఎవడికంటే తక్కువరా నేను…” పాటలు మాస్ ను ఆకట్టుకున్నాయి. అంతకు ముందు యన్టీఆర్, దాసరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు మంచి విజయం సాధించగా, ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఆడియో మురిపించినా, సినిమా పరాజయం పాలు కావడానికి, విశ్వం మాస్టర్ పాత్రను చంపడమే కారణమని అభిమానులు భావించారు. పైగా అప్పట్లో దాసరి, ఏయన్నార్ కాంబోలో వచ్చిన ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్టయింది. అందువల్లనే దాసరి ‘విశ్వరూపం’ను చెత్తగా తీశారని, అభిమానులు భావించి, చాలా ఊళ్ళలో తొలి ఆట కాగానే, దాసరిని తూలనాడారు. అయితే వారి ఆగ్రహానికి ఆనకట్ట వేస్తూ యన్టీఆర్ తోనే దాసరి తరువాత చరిత్రలో నిలచిపోయేలా ‘బొబ్బిలి పులి’ తెరకెక్కించడం విశేషం.

మరో విశేషమేమంటే, తరువాతి రోజుల్లో కమల్ హాసన్ కూడా తన చిత్రానికి ‘విశ్వరూపం’ అనే టైటిల్ ను పెట్టుకున్నారు. ఆ సినిమా కొన్ని వివాదాల కారణంగా తమిళనాట ముందు విడుదలకు నోచుకోలేదు. దాంతో తెలుగులో కమల్ తన ‘విశ్వరూపం’ను ముందుగా 2013లో విడుదల చేశారు. కమల్ ‘విశ్వరూపం’ తెలుగునాట విడుదల కావడానికి ఆ నాటి ‘విశ్వరూపం’ సృష్టికర్త దాసరి నారాయణరావు పూనుకోవడం అందరినీ ఆకర్షించింది. కమల్ ‘విశ్వరూపం’ కూడా ఆరంభంలో సందడి చేసిందే కానీ, తరువాత అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఆ సినిమాకు రెండో భాగం కూడా రూపొంది 2018లో విడుదలయింది. ఈ రెండు చిత్రాలకు కమల్ హాసన్ డైరెక్టర్. ఏది ఏమైనా ‘విశ్వరూపం’ టైటిల్ ఎందుకనో విజయభేరీ మోగించలేకపోయిందనే చెప్పాలి!

Related Articles

Latest Articles

-Advertisement-