నాలుగు పదుల ‘ముద్దమందారం’

(సెప్టెంబర్ 11తో ‘ముద్దమందారం’కు 40 ఏళ్ళు)

మాటల రచయితగా పలు పదవిన్యాసాలతో ఆకట్టుకున్నారు జంధ్యాల. “అడవిరాముడు, డ్రైవర్ రాముడు, వేటగాడు” వంటి కమర్షియల్ హిట్స్ కు సంభాషణలు పలికించి జనానికి సంతోషం పంచిన జంధ్యాల ‘సిరిసిరిమువ్వ, శంకరాభరణం’వంటి కళాత్మక చిత్రాలకూ పండితపామరుల ఆకట్టుకొనే రచన చేశారు. చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, నటించి, దర్శకత్వం వహించిన జంధ్యాల మనసు సినిమాకు దర్శకత్వం వహించాలని కోరుకుంది. తత్ఫలితంగానే ‘ముద్దమందారం’ చిత్రం రూపొందింది. తాను తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ద్వారానే ప్రదీప్, పూర్ణిమ జంటను చిత్రసీమకు పరిచయం చేశారు జంధ్యాల. 1981 సెప్టెంబర్ 11న ‘ముద్దమందారం’ విడుదలై విజయం సాధించింది.

‘ముద్దమందారం’ కథ విషయానికి వస్తే – ఓ పెద్దింటి అబ్బాయి, పేదింటి పిల్లను ప్రేమిస్తాడు. ఆ అబ్బాయి తండ్రేమో మరో ధనవంతురాలయిన అమ్మాయిని కొడుక్కిచ్చి పెళ్ళి చేస్తే కోట్లు వస్తాయని ఆశిస్తాడు. ఇది తెలిసిన ప్రేమజంట ఎగిరిపోతుంది. ఓ ఊరిలో చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అమ్మాయి గర్భవతి అవుతుంది. ఈ విషయాన్ని హీరో, హీరోయిన్ తాతకు ఉత్తరం ద్వారా తెలుపుతాడు. అది తెలుసుకున్న హీరోయిన్ని సవతి తమ్ముడు బలవంతంగా తీసుకుపోవాలని చూస్తాడు. హీరో వచ్చి అడ్గుకుంటాడు. ఆ అమ్మాయి ఓ బాబుకు జన్మనిస్తుంది. తరువాత హీరో తండ్రి, హీరోయిన్ సవతి తల్లి వస్తారు. వారిని చూసి, తమను వేరు చేయడానికే వస్తున్నారని భావిస్తారు ప్రేమికులు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. అయితే పెద్దవారు వారిని చేరదీసి, మళ్ళీ పెళ్ళి జరిపించడంతో కథ సుఖాంతమవుతుంది.

కోనేరు రవీంద్రనాథ్ సమర్పణలో నటనాలయ పతాకంపై ‘ముద్దామందారం’ తెరకెక్కింది. ఈ సినిమాకు రంజిత్ – ప్రశాంత్ పేర్లు నిర్మాతలుగా ప్రకటించారు. ఈ చిత్రంలో విన్నకోట రామన్న పంతులు, సుందరలక్ష్మి, అన్నపూర్ణ, నరసింగరావు, తులసి, సుత్తివేలు, పలువురు వైజాగ్ రంగస్థల ప్రముఖులు నటించారు. ఓ టీ కొట్టు ఓనర్ గా ఏవీయస్ తొలిసారి తెరపై కనిపించారు. ఈ చిత్రానికి కథ, మాటలు జంధ్యాల రాయగా, వేటూరి పాటలు రాశారు. రమేశ్ నాయుడు సంగీతం సమకూర్చారు. ఇందులోని తొమ్మిది పాటలూ అలరించాయి. “ముద్దుకే ముద్దొచ్చే ముద్ద మందారం…”, “అలివేణీ ఆణిముత్యమా…”, “జో లాలీ జో లాలీ…”, “జొన్నచేలోన జున్ను…”, “నా షోలాపూర్ చెప్పులు…”, “నీలాలు కారేనా కాలాలు…”, “శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు…”, “కలకంఠి కోలకళ్ళు…”, “ఆ రెండు దొండపండు పెదవుల్లో…” పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి ఎస్.గోపాల్ రెడ్డి కెమెరా పనితనం ప్రాణం పోసింది. జి.జి.కృష్ణారావు ఎడిటింగ్ అందం తెచ్చింది.

తొలి చిత్రమే అయినా జంధ్యాల ఎంతో అనుభవమున్న దర్శకునిలా ‘ముద్దమందారం’ను తెరకెక్కించారు. ఈ సినిమా పబ్లిసిటీలోనూ ఆయన తనదైన బాణీ పలికించారు. అంతకు ముందు బాపు,రమణ తాము తీసిన ఓ సినిమా పరాజయం పాలయితే, ఆ చిత్రం విడుదలైన వందరోజులకు పేపర్ లో నూరు రోజులు అని యాడ్ ఇచ్చారు. అందులోనే చిన్నగా ‘ఎక్కడైనా ఆడివుంటే…’ అనీ చమత్కిరించారు. అదే తీరున ‘ముద్దమందారం’ చిత్రం యాభై రోజుల పేపర్ ప్రకటనలో ‘ఐదు వందల రోజులు’ అని వేశారు. మా చిన్నచిత్రానికి ఇదే ఐదు వందల రోజులతో సమానం అంటూ జంధ్యాల కూడా తన ఛమక్కు చూపించారు. ఈ చిత్రం శతదినోత్సవం చూసింది. నిర్మాతలకు మంచి లాభాలే చూపింది.

Related Articles

Latest Articles

-Advertisement-