40 ఏళ్ళ ’47 రోజులు’

(సెప్టెంబర్ 3న ’47 రోజులు’కు 40 ఏళ్ళు పూర్తి)

చిరంజీవి, జయప్రద జంటగా నటించిన ’47 రోజులు’ చిత్రం సెప్టెంబర్ 3తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించారు. అంతకు ముందు బాలచందర్ తెరకెక్కించిన ‘ఇది కథ కాదు’లోనూ భార్యను హింసించే భర్త పాత్రలో చిరంజీవి నటించారు. అందులో జయసుధ నాయిక. ఇందులో జయప్రద భర్తగా ఆమె 47 రోజులు కాపురం చేసి, మానసికంగా శారీరకంగా ఆమెను హింసించే పాత్రలో చిరు కనిపించారు. ఈ చిత్రం తమిళంలో ’47 నాట్కల్’ పేరుతో రూపొందింది. రెండు భాషల్లోనూ చిరంజీవి, జయప్రద జంటగా నటించారు. తమిళ చిత్రం ’47 నాట్కల్’ జూలై 17న విడుదల కాగా, తెలుగులో ’47 రోజులు’ సెప్టెంబర్ 3న వెలుగు చూసింది. చిరంజీవి, జయప్రద తొలిసారి ‘కొత్త అల్లుడు’లో కలసి నటించారు. అందులో చిరంజీవి విలన్ గా కనిపించారు. ఆ తరువాత వారిద్దరూ ‘చండీప్రియ’లోనూ నటించారు. ఆ సినిమాలో చిరంజీవి హీరో కాకపోయినా, అందులో జయప్రదతో టైటిల్ సాంగ్ “ఓ ప్రియా…చండీప్రియా…” అన్నది వీరిద్దరిపైనే చిత్రీకరించడం విశేషం! తరువాతి రోజుల్లో చిరంజీవి, జయప్రద జోడీగా ‘వేట’లో అభినయించారు. చిత్రమేమిటంటే, చిరంజీవి, జయప్రద కలసి నటించిన ఏ చిత్రంలోనూ వారి కథ సుఖాంతం కాకపోవడం.

’47 రోజులు’ కథ విషయానికి వస్తే – విశాలి అనే ఆమెను కలుసుకోవడానికి నటి సరిత ఓ చిన్న గ్రామానికి వస్తుంది. విశాలి వాళ్ళ అన్నయ్య సరితకు తన చెల్లెలికి ఏం జరిగింది చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. పారిస్ లో పనిచేసే కుమార్ ను విశాలి పెళ్ళాడుతుంది. ఆ పల్లెలో వాళ్ళంతా విశాలి అదృష్టవంతురాలు అని ఆనందిస్తారు. భర్తతో విశాలి ప్యారిస్ వెళ్తుంది. అక్కడ కుమార్ కు అప్పటికే లూసీ అనే ఓ ప్యారిస్ అమ్మాయితో పెళ్ళయి ఉంటుంది. ఆ ప్యారిస్ అమ్మాయికి, విశాలిని తన చెల్లెలు అని పరిచయం చేస్తాడు. ఆమెను తన ఫ్రెండ్ గా విశాలికి చెబుతాడు. ఒకే ఇంట్లో ఉన్నా, ప్యారిస్ అమ్మాయికి తెలుగు రాదు, విశాలికి ఏమో ఇంగ్లిష్, ఫ్రెంచ్ తెలియవు. కుమార్, లూసీ పెళ్ళిఫోటో చూసి నిలదీస్తుంది విశాలి. ఆ తరువాత నుంచీ విశాలికి కుమార్ టార్చర్ చూపిస్తాడు. తనకు ఇష్టం వచ్చినట్టు ఉండమని చెబుతాడు. సంప్రదాయ కుటుంబానికి చెందిన విశాలి అవేవీ ఇష్టపడదు. ఓ పిక్ పాకెటర్ అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అక్కడే ఉండే తెలుగు డాక్టర్ శంకర్ సాయంతో విశాలిని ఇండియాకు చేరుస్తుంది. కథ ముగిసిన తరువాత సరిత, డాక్టర్ నిన్ను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా అని అడుగుతుంది. ‘ఆ డాక్టర్ నాకు దేవుడు, దేవుణ్ని పెళ్ళి చేసుకోవడం సాధ్యమా’ అని అంటుంది విశాలి. మగతోడే వద్దంటున్నది ఆడజాతి విజయమని విశాలి భావిస్తుంది. చివరలో సరితతో, “సినిమాలో కావాలంటే నాకు పెళ్ళి చేసేయండి” అని చెప్పడంతో కథ ముగుస్తుంది.

ప్రేమాలయా పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో కుమార్ గా చిరంజీవి, విశాలిగా జయప్రద, లూసీగా ఆనే ప్యాట్రిసియా, డాక్టర్ శంకర్ గా శరత్ బాబు, పిక్ పాకెటర్ గా రమాప్రభ, విశాలి అన్నగా చక్రపాణి నటించారు. ఈ చిత్రానికి ఎమ్.ఎస్.విశ్వనాథన్ బాణీలకు ఆచార్య ఆత్రేయ పాటలు పలికించారు. “ఓ పైడి లేడమ్మా…”, “సూత్రం కట్టాడబ్బాయి…”, “అలాంటి ఇలాంటి అమ్మాయిని కాను…” అనే పాటలు ఉన్నాయి. జయప్రద వైశాలిగా చక్కగా అభినయించారు. ఇక చిరంజీవి కుమార్ పాత్రలో జీవించారు. అయితే ఈ సినిమా ఇద్దరికీ పెద్దగా ఒరగబెట్టిందేమీ లేదు. తనలోని నటుడిలో విలక్షణమైన నటనను ఆవిష్కరించిన కె.బాలచందర్ అంటే చిరంజీవికి ఎంతో గౌరవం. అందుకే తమ అంజనాప్రొడక్షన్స్ పతాకంపై తొలి చిత్రం ‘రుద్రవీణ’ను బాలచందర్ దర్శకత్వంలోనే తెరకెక్కించారు చిరంజీవి.

Related Articles

Latest Articles

-Advertisement-