35 ఏళ్ళ ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’

(అక్టోబర్ 2న ‘ఒకరాధ – ఇద్దరు కృష్ణులు’కు 35 ఏళ్ళు)

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవలలను పలుమార్లు సినిమాలుగా రూపొందించి విజయం సాధించారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. ఈ నేపథ్యంలో యండమూరి రాసిన ‘ఒకరాధ ఇద్దరు కృష్ణులు’ నవలను అదే టైటిల్ తో రూపొందించారు. శ్రీసారసా మూవీస్ పతాకంపై తెరకెక్కిన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’లో కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. 1986 అక్టోబర్ 2న విడుదలైన ‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’ జనాన్ని భలేగా అలరించింది.

‘ఒక రాధ – ఇద్దరు కృష్ణులు’ కథ ఏమిటంటే – దేశరక్షణ భద్రతా రహస్యాలను ఓ దేశద్రోహి చేజిక్కించుకుంటున్న సమయంలో మిలిటరీ ఆఫీసర్ నారాయణరావు వాటిని పట్టేసుకుంటాడు. ఓ రహస్య ప్రదేశంలో దాచి పెట్టి, దాని మ్యాప్ ను తన మిత్రుడైన పోలీస్ అధికారి నరసింహంకు ఇవ్వబోతాడు. అతను కూడా దేశద్రోహి అని తెలుసుకొని ప్లాన్ ఇవ్వకుండా పారిపోతాడు. అతను ఆ మ్యాప్ గీసిన కాగితాన్ని భార్యకు ఇచ్చి మరణిస్తాడు. ఆయన ఇద్దరు కుమారుల్లో పెద్దవాణ్ణి చంపేస్తారు. రెండో బాబు మురళీకృష్ణను చంపుతామని బెదిరిస్తాడు నరసింహం. దాంతో బిడ్డ కోసం చేయని నేరాన్ని తనపై వేసుకొని జైలు పాలవుతుంది నారాయణరావు భార్య. ఆమె చిన్నకొడుకు అనాథగా చదువుకొని కాలేజ్ చేరుకుంటాడు. అక్కడే దుర్మార్గుడైన నరసింహం కూతురు రాధ కూడా చదువుతూ ఉంటుంది. ఓ సారి మురళీకృష్ణ జైలుకు వెళ్ళి అక్కడ డాన్స్ ప్రదర్శన ఇస్తాడు. అతని డాన్స్ చూసి, జైలులో శిక్ష అనుభవిస్తున్న తల్లి గుర్తిస్తుంది. మురళీకృష్ణ తల్లిని కలుసుకొని అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తరువాత మురళీకృష్ణ లాగే మరో వ్యక్తి ఉన్నాడని అందరినీ నమ్మిస్తాడు. రాధ కూడా నమ్ముతుంది. మురళీకృష్ణను పట్టుకుంటే అతని తల్లిద్వారా ఆ రహస్యం తెలుస్తుందని నరసింహం, రాధను ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కానీ, మురళీకృష్ణ కాకుండా, హరికృష్ణ కూడా ఉన్నాడని తెలుసుకొని కంగారు పడతాడు. ఆ తరువాత ఇద్దరు కృష్ణులు ఉన్నట్టుగా నాటకం రంజుగా సాగుతుంది. మరో విశేషమేమంటే, అసలు రహస్య పత్రాల కోసం అంతకాలం మాటు వేసింది, తమకు నమ్మిన బంటుగా ఉన్న సత్యం అని తెలుసుకుంటాడు మురళీకృష్ణ. సత్యమే జాంగో పేరుతో నేరాలు చేస్తుంటాడు. అతణ్ణి మట్టుపెడతాడు మురళీకృష్ణ. చివరకు నరసింహం చేత నిజం చెప్పిస్తాడు. తల్లి చెరను విడిపిస్తాడు కృష్ణ. నరసింహం జైలు పాలవుతాడు. రాధ, మురళీకృష్ణకు కవల పిల్లలు పుడతారు. కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో అన్నపూర్ణ, రావు గోపాలరావు, సత్యనారాయణ, రాజీవ్, రాజేంద్రప్రసాద్, వీరభద్రరావు, రమణమూర్తి, పి.జె.శర్మ, నిర్మలమ్మ, జయమాలిని, సంయుక్త, బిందూ ఘోష్, కల్పనారాయ్ తదితరులు నటించారు. నూతన్ ప్రసాద్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.

యండమూరి కథకు సత్యానంద్ సంభాషణలు సమకూర్చారు. ఇళయరాజా బాణీలకు వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశారు. ఈ చిత్రంలోని “రాధా ఎందుకింత బాధా…” అనే పాటను కమల్ హాసన్ పాడడం విశేషం. “మధుర మురళి…”, “పట్టు మరి పెట్టు మరి ఓ ముద్దు…”, “దానిమ్మ చెక్కరో ఈ గుమ్మ చుక్కరో…”, “ఏమీ తుంటరి…” వంటి పాటలు అలరించాయి. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది.

-Advertisement-35 ఏళ్ళ 'ఒక రాధ - ఇద్దరు కృష్ణులు'

Related Articles

Latest Articles