35 ఏళ్ళ ‘కలియుగ కృష్ణుడు’

(సెప్టెంబర్ 19న ‘కలియుగ కృష్ణుడు’కు 35 ఏళ్ళు)

నందమూరి బాలకృష్ణ నటనాపర్వంలో 1986వ సంవత్సరం మరపురానిది, ఆయన అభిమానులు మరచిపోలేనిది. ఆ సంవత్సరం బాలయ్య ఏడు చిత్రాలలో నటించగా, మొదటి సినిమా ‘నిప్పులాంటి మనిషి’ పరాజయం పాలయింది. ఆ తరువాత వచ్చిన ఆరు చిత్రాలూ వరుసగా ఘనవిజయం సాధించాయి. అలాంటి రికార్డు తెలుగు చిత్రసీమలో మరెవ్వరికీ లేదు. ఆ విజయపరంపరలో ఐదవ చిత్రంగా విడుదలయింది ‘కలియుగ కృష్ణుడు’. 1986 సెప్టెంబర్ 19న విడుదలైన ‘కలియుగ కృష్ణుడు’ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని విశ్వశాంతి ఎంటర్ ప్రైజెస్ పతాకంపై ఏ.కె.వి. ప్రసాద్ నిర్మించారు. ఇందులో నటుడు చలపతిరావు కూడా భాగస్వామి కావడం విశేషం!

కథ విషయానికి వస్తే- రచయితలు పరుచూరి బ్రదర్స్ దీనిని కలియుగ కంసవధగా రూపొందించారు అని చెప్పాలి. విదేశాల నుండి వచ్చిన గాయత్రీదేవి, తన అన్న సిద్ధేశ్వరరావును తనకు ఆస్తిలో ధర్మంగా రావలసిన వాటా ఇమ్మంటుంది. ఆమె భర్త వాసుదేవరావును చంపి, ఆ కేసును గాయత్రిపైకి నెట్టేస్తాడు సిద్ధేశ్వరరావు. ఆ సమయంలో గాయత్రి గర్భవతి. ఆమెకు ఓ బాబు పుడతాడు. ఆ పసిగుడ్డును కూడా చిదిమేయాలని చూస్తాడు సిద్ధేశ్వరరావు. అతని అనుచరుడు ఆ పసిబిడ్డను చంపే ప్రయత్నం చేస్తూండగా, ఓ ట్రక్ డ్రైవర్ రంగయ్య అడ్డుకొని బాబును తీసుకు వెళ్ళి మోహనకృష్ణ అనే పేరు పెట్టి కన్నబిడ్డలా పెంచుతాడు. సిద్ధేశ్వరరావుకు తలబిరుసు కూతురు అనురాధ, దుర్మార్గుడైన కొడుకు రమేశ్ ఉంటారు. వారితో ఓ సారి మోహనకృష్ణకు గొడవ జరుగుతుంది. తరచూ వారి ఆగడాలను మోహనకృష్ణ ఎదుర్కొంటూ ఉంటాడు. జైలు నుండి బయటకు వచ్చిన గాయత్రీ దేవి అన్నపై కక్ష కట్టి, అతని అంతు చూడాలనుకుంటుంది. ఈ లోగా మోహనకృష్ణకు ఒకప్పుడు పసిబిడ్డగా ఉన్న అతణ్ణి చంపబోయిన సాంబయ్య తారసపడతాడు. అతని ద్వారా గాయత్రీదేవి తన తల్లి అని తెలుసుకుంటాడు మోహనకృష్ణ. గాయత్రీదేవికి మోహనకృష్ణ తోడవుతాడు. చివరకు మేనమామను చంపి కలియుగ కృష్ణుడు అనిపించుకుంటాడు మోహనకృష్ణ.

ఈ కథను దర్శకుడు మురళీమోహనరావు నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇందులో పరుచూరి బ్రదర్స్ పలికించిన పసందైన డైలాగులు కూడా మురిపించాయి. ఈ చిత్రానికి ముందు బాలకృష్ణ హీరోగా మురళీమోహనరావు రూపొందించిన ‘కథానాయకుడు’ ఘనవిజయం సాధించింది. దాంతో తొలినుంచీ అభిమానుల్లో ‘కలియుగ కృష్ణుడు’పై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే చిత్రం అలరించింది. ఇందులో బాలకృష్ణ సరసన రాధ నటించగా, రావుగోపాలరావు, శారద, అల్లు రామలింగయ్య,నూతన్ ప్రసాద్, గొల్లపూడి, సుధాకర్, రంగనాథ్, సాక్షి రంగారావు, జగ్గారావు, ఇతర పాత్రల్లో కనిపించారు.

వేటూరి పాటలకు చక్రవర్తి బాణీలు తోడై అలరించాయి. “జాబిల్లి ఉట్టి కొట్టే జాణా గోపాలుడే…”, “కొంగూ కొంగూ ముడిపడ్డాక… గొళ్ళెం తలుపుకు పెట్టేశాక…”, “బంగారు తోటలో చెంగావీ చీరతో…”, “అల్లరి అల్లరిగా తిమ్మిరి తిమ్మిరిగా… ” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించింది. శతదినోత్సవాలూ చూసింది.

-Advertisement-35 ఏళ్ళ 'కలియుగ కృష్ణుడు'

Related Articles

Latest Articles