మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా అదే ఫీలింగ్‌లో ఉన్నారా?

మంత్రి పదవి ముగిసి ఏడేళ్లయినా ఇంకా అదే ఫీలింగ్‌లో ఉన్నారట ఆ నాయకుడు. బలహీనమైన ప్రత్యర్థుల చేతిలో వరసగా రెండుసార్లు ఓడినా తత్వం బోధపడలేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అదే జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు సొంత పార్టీలో కీలక పదవులు దక్కినా ఆయనకు జ్ఞానోదయం కావడం లేదట. తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారట ఆ మాజీ అమాత్యుల వారు. ఇంతకీ ఎవరా నాయకుడు?

రాష్ట్రస్థాయి నేతగా చాలా పనులు ఉంటాయని చెబుతారు!

దామోదర రాజనర్సింహ. ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి డిప్యూటీ సీఎం. ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో ఐదుసార్లు ఓటములే పలకరించాయి. అయినా సార్ తీరు మారలేదనే ప్రచారం జరుగుతోంది. సొంత నియోజకవర్గం ఆందోల్‌లో అసలు అడ్రస్ ఉండటం లేదట. నియోజకవర్గంలో ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ చేద్దామని అనుచరులు అంటే దామోదరకి చిర్రెత్తుకొస్తుందని చెబుతున్నారు. తాను నియోజకవర్గస్థాయి నేతను కాదని.. రాష్ట్రస్థాయిలో చాలా పనులు ఉంటాయని రిప్లయ్‌ ఇస్తున్నారట.

read also : జల జగడంలో ఏపీ అధికారి గూఢచారి పాత్ర?

సొంత బలహీనతల వల్లే వరసగా ఎన్నికల్లో ఓడిపోయారు!

ఈ మాజీ డిప్యూటీ సీఎంకి ఏమైనా ఇంపార్టెంట్ పదవి ఉందా అంటే అదీ లేదు. కొత్తగా ప్రకటించిన పీసీసీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా ఆయనను ప్రకటించింది పార్టీ. హుజురాబాద్‌ బైపోల్‌ తప్ప ఇప్పట్లో సాధారణ ఎన్నికలు లేవు. తాడూ బొంగరం లేని పదవికి మరీ అంత బిల్డప్ అవసరమా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట ఫాలోవర్స్. తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేసిన రెండు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అది కూడా దామోదర బలహీనత వల్ల ఓడిపోయారే తప్ప అవతలివాళ్ల బలంవల్ల కాదనే ప్రచారం జరిగింది.

ప్రొటోకాల్‌ ఉన్న నేతను ఎప్పుడంటే అప్పుడు కలవడం కుదరదంటారు!

రాజనర్సింహకు ఇప్పటి వరకు సొంత నియోజకవర్గం ఆందోల్‌లో ఇల్లు కూడా లేదు. సంగారెడ్డి లేదంటే హైదరాబాద్ తప్ప స్థానికంగా ఉండడానికి పెద్దగా ఇష్టపడరట. ఎవరైనా కార్యకర్తలు సార్‌ను కలవడానికి వస్తే తనను తాను డిప్యూటీ సీఎంగా భావించి.. వచ్చిన వారికి హితబోధ చేస్తారట. ప్రొటోకాల్ ఉన్న నేతలను ఎప్పుడంటే అప్పుడు కలవడం కుదరదని సున్నితంగానే హెచ్చరిస్తారట ఈ మాజీ డిప్యూటీ సీఎం.

దుబ్బాకలో ఇంఛార్జ్‌గా ఉన్నారు.. డిపాజిట్‌ దక్కలేదు!

ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డిలకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా అవకాశం కల్పించింది పార్టీ. రాజనర్సింహకు మాత్రం తాడూ బొంగరం లేని పదవి ఇచ్చి చేతులు దులుపుకొంది. అయినప్పటికీ ఇవేమీ పట్టనట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు సన్నిహితులు. సొంత నియోజకవర్గంలో వరసగా రెండుసార్లు ఓడిపోయారు. దుబ్బాకలో సైతం సార్‌వారు అంత లేదు ఇంత లేదని అభ్యర్థిని ఆగమేఘాల మీద టీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి తర్వాత తుస్సు మనిపించారు. దుబ్బాకలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని మాటలు కోటలు దాటాయి. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇప్పుడు హుజురాబాద్‌లో సైతం రాజనర్సింహకు ఇంచార్జ్‌గా పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమోనని తెగ టెన్షన్ పడిపోతున్నారట కార్యకర్తలు.

కాంగ్రెస్‌కు ఆయన అసవరం లేదనే ఆ పదవి క్రియేట్‌ చేసిందా?

గతంలో టీఆర్ఎస్ లేదా బీజేపీలో ఆయన జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా సార్‌కు అక్కడ అంత సీన్ లేదనే టాక్ నడుస్తుంది. ఆ రెండు పార్టీల ముందు గొంతెమ్మ కోరికల లిస్ట్ పెట్టారట ఈ మాజీ డిప్యూటీ సీఎం. పార్టీలోకి రాకముందే తనస్థాయికి తగ్గట్టుగా గౌరవించుకోవాలని కోరారట. తనను తాను అతిగా ప్రమోట్ చేసుకుంటే మీరు రావద్దు మహాప్రభో అని వారు చెప్పారట. ఇటు కాంగ్రెస్‌లో దిక్కు మాలిన పదవి క్రియేట్ చేసి ఆయనకు ఇవ్వడం చూస్తే.. రాజనర్సింహ అవసరం పార్టీకి లేదని పరోక్షంగా చెప్పిందని చెవులు కొరుక్కుంటున్నారు. అయినా ఆయన నేల విడిచి సాము చేస్తున్నారని వాపోతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.

పదవీకాలం ముగిసినా మార్పు రాలేదా?

మొత్తానికి పదవీకాలం ముగిసినా మాజీ అమాత్యుల వారిలో మాత్రం మార్పు రాలేదు. కనీసం సొంత నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా.. రాష్ట్రస్థాయిలో మేనేజ్‌మెంట్ చేస్తానని అంటున్నారు రాజనర్సింహ. సారు ప్రజలను ఎలాగూ కలవరు. కనీసం క్యాడర్‌ను కూడా కలవకపోతే సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుందని తెగ ఇది అయి పోతున్నారట ఫాలోవర్స్‌. వాస్తవాలు గ్రహించి తాను ఇంకా డిప్యూటీ సీఎం కాదనే విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటారో మరి..!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-