30 ఏళ్ళ ‘కూలీ నంబర్ వన్’

(జూలై 12తో ‘కూలీ నంబర్ 1’కు 30 ఏళ్ళు)

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘కలియుగ పాండవులు’ చిత్రం ద్వారా హీరోగా జనం ముందు నిలిచారు వెంకటేశ్. తొలి సినిమా సక్సెస్ తోనే ‘విక్టరీ’ వెంకటేశ్ గా జనం మదిని గెలిచారు. ఆ తరువాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేశ్ “భారతంలో అర్జునుడు, ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్” చిత్రాలలో నటించారు. వీటి తరువాత “ముద్దుల ప్రియుడు, సాహసవీరుడు-సాగరకన్య, సుభాష్ చంద్రబోస్” చిత్రాలలోనూ రాఘవేంద్రరావు, వెంకటేశ్ కాంబో సాగింది. అయితే వరుసగా వీరి కాంబోలో వచ్చిన ‘ఒంటరి పోరాటం, కూలీ నంబర్ వన్’ చిత్రాలలో ఓ విశేషముంది. అదేమిటంటే, ‘ఒంటరి పోరాటం’లో ఫరాతో జోడీ కట్టిన వెంకటేశ్, తరువాత వచ్చిన ‘కూలీ నంబర్ వన్’లో ఫరా చెల్లెలు టబుకు జంటగా నటించారు. మరింత విశేషమేంటంటే, ‘ఒంటరి పోరాటం’లో ఫరా పేరును శ్వేతగానూ, ‘కూలీ నంబర్ వన్’లో టబు పేరును స్వాతిగానూ టైటిల్స్ లో వేశారు. రెండు సినిమాలు పాటలతో జనాన్ని అలరించాయి. ఇళయరాజా స్వరకల్పనలో రూపొందిన ‘కూలీ నంబర్ వన్’ పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

‘కూలీ నంబర్ వన్’ కథ విషయానికి వస్తే, కోటీశ్వరుడు కోటేశ్వరరావు కూతురు రంజని, పేదలను చాలా చులకనగా చూస్తూఉంటుంది. ఆమెకు ఓ సారి కూలీ నంబర్ వన్ రాజు బాగా బుద్ధి చెబుతాడు. దాంతో పగపట్టిన రంజని, అతణ్ని జైలులో పడేలా చేస్తుంది. అయినా, రాజు గొడవ లేకుండా కూతురును సింగపూరుకు తీసుకువెళ్తాడు కోటేశ్వరరావు. అక్కడ ఓ పాప్ సింగర్ గా కనిపించి, ఆమెను ప్రేమలో పడేస్తాడు రాజు. అంత మోడరన్ గా ఉన్న పాప్ సింగర్ కు రాజు పోలికలు ఉన్నాయే కానీ, అతను కాదని రంజని భావిస్తుంది. పెళ్ళి చేసుకుంటుంది. అసలు విషయం బయట పెడతాడు రాజు. అతను కట్టిన తాళి తీసి ముఖాన కొట్టి స్వదేశం వస్తుంది రంజని. రంజని తల్లి ద్వారా, ఆమెకు మత్తు ఇచ్చి, రంజని గర్భవతి అయ్యేలా చేస్తాడు రాజు. రంజని గర్భస్రావం చేయించుకోవాలని భావిస్తుంది. ప్రాణానికి ముప్పు అని తెలుసుకుంటుంది. బిడ్డకు జన్మనిచ్చాక పారేయాలని చూస్తుంది. అప్పుడే రంజనికి అసలు ఆమె తమ కూతురు కాదని, తల్లి చెబుతుంది. ఓ పేదరాలి కడుపున పుట్టిన పసికందును చేరదీసి పెంచామని గతం వివరిస్తుంది. దాంతో రంజనిలో మార్పు వస్తుంది. కోటేశ్వరరావు పంచనే ఉంటున్న రంగారావు, బుచ్చిబాబు అతణ్ణి చంపేసి ఆస్తి చేజిక్కించుకోవాలను కుంటారు. వారి ఆటకట్టించి, తన భార్యను, కొడుకును రక్షించుకుంటాడు రాజు. అలా కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో రావు గోపాలరావు, శారద, నిర్మలమ్మ, కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, మోహన్ బాబు, బ్రహ్మానందం, బాబూ మోహన్, డబ్బింగ్ జానకి, రాళ్ళపల్లి, గౌతమ్ రాజు తదితరులు నటించారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, సీతారామశాస్త్రి పాటలు రాశారు. పాటలన్నిటినీ రాఘవేంద్రరావు తన మార్కుతో తెరకెక్కించి చూపరులను ఆకట్టుకున్నారు. “కొత్త కొత్తగా ఉన్నదీ…” పాటను విదేశాల్లో పూలతోటల నేపథ్యంలో తెరకెక్కించిన తీరును తరువాత ఎందరో అనుసరించారు. “అటెన్షన్ ఎవ్రీ బడీ… నే వస్తున్నా బీ రెడీ…”, “కలయా నిజమా…”, “కిల కిలమని కలావర్ రాణీ…” పాటలు కూడా అలరించాయి. ప్రతీ వినాయకచవితికి తప్పకుండా వినిపించే “దండాలయ్యా ఉండ్రాలయ్యా…” పాట కూడా ఇందులోదే. ‘కలయా నిజమా…’ పాటను ఇళయరాజా ఆలపించడం విశేషం. ఈ చిత్రం ద్వారానే టబు నాయికగా పరిచయమయింది. టబు అందాల ఆరబోత సినిమాకు ఓ ఎస్సెట్. ఇందులో మోహన్ బాబు ‘ర’ అక్షరాన్ని ‘ల’లాగా పలుకుతూ, కామెడీ విలన్ గా భలే ఆకట్టుకున్నారు. మాస్ ను అలరించే కూలీ నంబర్ వన్ పాత్రలో వెంకటేశ్ మురిపించారు. ఆశించిన స్థాయిలో ఈ ‘కూలీ నంబర్ వన్’ అలరించలేకపోవడం గమనార్హం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-