అద్భుతం… ‘ఆదిత్య 369’

(జూలై 18న ‘ఆదిత్య 369’కు 30 ఏళ్ళు పూర్తి)

నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అనేక అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లోనే కాదు, యావత్ భారతీయ చిత్రసీమలోనే ఓ అపురూపం అనదగ్గ చిత్రం ‘ఆదిత్య 369’. మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా ‘ఆదిత్య 369’ తెరకెక్కింది. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ అనే చిత్రం స్ఫూర్తితో ఈ సినిమా రూపొందినా, ఎక్కడా ఆ సినిమాను కాపీ కొట్టింది లేదు. పైగా ఈ చిత్ర దర్శకులు సింగీతం శ్రీనివాసరావు విద్యార్థిగా ఉన్నప్పుడే హెచ్.జి.వెల్స్ రాసిన ‘ద టైమ్ మిషన్’ కథను చదివి, అలాంటి కథ సినిమాగా వస్తే బాగుండునని ఊహించుకున్నారు. అలా టైమ్ మిషన్ లో హీరో, హీరోయిన్, ఓ పోలీస్ ఎక్కి ముందు భూతకాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళతారు. తరువాత భవిష్యత్ కాలంలోకి వెళ్ళి, అప్పటి వాతావరణం చూసి, తిరిగి వర్తమానంలోకి వస్తారు. ఈ మూడు కాలాల్లో ప్రయాణించే కథతో రూపొందిన ‘ఆదిత్య 369’ సినిమా విడుదలై మూడు పదుల కాలమయింది. అయినా ఈ చిత్రం గురించి జనం చర్చించుకుంటూనే ఉన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ గా రూపొందే చిత్రం ద్వారా తన నటవారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇటీవలే బాలకృష్ణ ప్రకటించారు కూడా. దీంతో మళ్ళీ ‘ఆదిత్య 369’ చిత్రం చర్చ సాగుతోంది. 1991 జూలై 18న విడుదలైన ‘ఆదిత్య 369’ ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. సింగీతం శ్రీనివాసరావు కాలం కంటే ముందుగా పయనిస్తూ ఉంటారని ప్రతీతి. ఈ సినిమా ముప్పై ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు వచ్చి ఉంటే మరింత ఆదరణ పొంది ఉండేదని పరిశీలకుల అభిప్రాయం.

వెనక్కి… ముందుకు…
‘ఆదిత్య 369’ కథ విషయానికి వస్తే… కిశోర్ అనే పిల్లాడు స్కూల్ ఎక్స్ కర్షన్ లో సాలార్ జంగ్ మ్యూజియమ్ వెళతాడు. సందర్శన సమయం ముగిసినా, అతను మ్యూజియమ్ లోని వింతలు చూసుకుంటూ అక్కడే ఉంటాడు. సమయం మించిందని తలుపులు వేయడంతో మ్యూజియమ్ లోనే ఉండవలసి వస్తుంది. అప్పుడే మ్యూజియమ్ లోని విజయనగర రాజుల వజ్రాన్ని దొంగిలించడానికి రాజావర్మ అనే గజదొంగ మనుషులు వస్తారు. అది కిశోర్ చూస్తాడు. దొంగల నుండి తప్పించుకున్న కిశోర్ ను కృష్ణకుమార్ రక్షిస్తాడు. ఈ కృష్ణకుమార్ ప్రేయసి హేమ తండ్రి ప్రొఫెసర్ రామదాస్ టైమ్ మిషన్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అల్లరి కిశోర్ కు ఈ విషయం తెలిసి, తనతో పాటు ఉన్న పిల్లలందరినీ తీసుకొని ఆ టైమ్ మిషన్ లోకి వెళ్తాడు. అక్కడ ఏదంటే అది నొక్కిచూస్తాడు. టైమ్ మిషన్ గిర్రున తిరుగుతూ ఉండగా, కృష్ణకుమార్, హేమ వచ్చి పిల్లలను బయటకు పంపిస్తారు. అప్పటికే ఓ పోలీస్ అందులో స్పృహతప్పి పడిపోయి ఉంటాడు. ఈ ముగ్గురూ టైమ్ మిషన్ లో 500 ఏళ్ళు వెనక్కి వెళ్ళి కృష్ణదేవరాయల కాలం చేరుకుంటారు. అక్కడ కృష్ణదేవరాయలు మందిరంలో వజ్రాన్ని చూస్తారు. అది ఐదు వందల ఏళ్ళ తరువాత దొంగతనానికి గురవుతుందని రాయలు చెబుతాడు. అయితే ఆ రోజు రాత్రికే దొంగతనం జరగడం, అది కృష్ణకుమార్ పై మోపడం జరుగుతాయి. కృష్ణకుమార్, హేమ, పోలీస్ వాళ్ళను శిక్షనుండి రాయలే తప్పిస్తారు. తరువాత టైమ్ మిషన్ లో 2504 సంవత్సరానికి చేరుకుంటారు. ఆ వింతలు చూసి మళ్ళీ వర్తమానంలోకి వస్తారు. అప్పుడు ఆ టైమ్ మిషన్ లో రాజావర్మ, కృష్ణకుమార్ పోరాడుతారు. కృష్ణకుమార్ చనిపోతాడు అని భవిష్యత్ లోకి వెళ్ళిన పోలీస్ కు తెలిసి ఉంటుంది. అలాగే కృష్ణకుమార్ కనిపించకపోయే సరికి చనిపోయాడని భావిస్తారు. కానీ, కృష్ణకుమార్ తిరిగి వస్తాడు. తాము చూసిన పేపర్ మరుసటి రోజు సంచిక చూసి ఉంటే అసలు విషయం బోధ పడేదని, తాను లోయలో పడి బయటకు వచ్చానని కృష్ణకుమార్ చెబుతాడు. కథ సుఖాంతమవుతుంది.

అలాగ తీరింది…
సైంటిఫిక్ ఫిక్షన్ గా రూపొందిన ‘ఆదిత్య 369’లో కృష్ణదేవరాయల కాలం నాటి కథను చొప్పించడం దర్శకుని మేధాశక్తికి నిదర్శనం. పైగా అందుకు తగ్గ నటుణ్ణి ఎంచుకొని కథను నడిపించిన తీరు అభినందనీయం. ఇందులో కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయలు పాత్రల్లో బాలకృష్ణ చక్కగా ఒదిగిపోయారు. ఈ సినిమా సక్సెస్ తరువాత ఈ చిత్ర నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్, బాలయ్య హీరోగా “వంశానికొక్కడు, భలేవాడివి బాసూ, మిత్రుడు” వంటి చిత్రాలను నిర్మించారు. ఇక సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమా తరువాత బాలకృష్ణ హీరోగా “భైరవద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం” చిత్రాలు తెరకెక్కించారు. ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలి. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ఘనత దర్శకుడు కేవీ రెడ్డిదే. కేవీ రెడ్డికి అసోసియేట్ గా పనిచేశారు సింగీతం శ్రీనివాసరావు. తెలుగునాట పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికాలలో నటించి ఘనవిజయాలు చూశారు యన్టీఆర్. అలాగే ఆ నాలుగు రకాల చిత్రాలకూ దర్శకత్వం వహించీ సక్సెస్ ను చూసిన క్రెడిట్ యన్టీఆర్ కే దక్కుతుంది. అలాంటి యన్టీఆర్ తో సింగీతంకు ఎంతో అనుబంధం ఉంది. కానీ, యన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం సింగీతంకు లభించలేదు. అయితే యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతో ఆ ఛాన్స్ దక్కింది. దాంతో మూడు చిత్రాలతోనే సాంఘిక, చారిత్రక, జానపద, పౌరాణికాలు తెరకెక్కించి అలరించిన క్రెడిట్ సింగీతం సొంతం చేసుకున్నారు. ఎలాగంటే ‘ఆదిత్య 369’లోనే సాంఘిక, చారిత్రక అంశాలు చొప్పించారు. తరువాత ‘భైరవద్వీపం’ జానపదం, ‘శ్రీకృష్ణార్జున విజయం’ పౌరాణికం. అలా సింగీతం కీర్తి కిరీటంలో ఓ అరుదైన అంశం రత్నంగా నిలచింది.

మరికొన్ని…
ఇన్ని విశేషాల ‘ఆదిత్య 369’ చిత్రంలో రాజావర్మగా అమ్రిష్ పురి నటించారు. హేమగా మోహిని, ఆమె తండ్రి ప్రొఫెసర్ రామదాస్ గా టిన్నూ ఆనంద్, పోలీస్ గా సుత్తివేలు, కిశోర్ గా మాస్టర్ తరుణ్ అభినయించారు. సిల్క్ స్మిత, చంద్రమోహన్, జేవీ సోమయాజులు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, రావి కొండలరావు, గొల్లపూడి మారుతీరావు, చలపతిరావు, తనికెళ్ళ భరణి, బాబూమోహన్, అన్నపూర్ణ, శ్రీలక్ష్మి, కిన్నెర, పొట్టిప్రసాద్ తదితరులు నటించారు. ఇందులో నటించిన మాస్టర్ తరుణ్ తరువాతి రోజుల్లో హీరోగా అలరించాడు. ఇక బేబీ విజయగా నటించిన పాప, తరువాత రాశి పేరుతో రంజింపచేసింది.

ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పకులుగా వ్యవహరించారు. ఇళయరాజా స్వరకల్పన చేయగా, వేటూరి, సీతారామశాస్త్రి, వెన్నెలకంటి రాసిన పాటలు జనాన్ని ఎంతగానో అలరించాయి. అప్పటికే దర్శకునిగా జయకేతనం ఎగురవేస్తున్న జంధ్యాల ఈ చిత్రానికి సందర్భోచితమైన సంభాషణలు పలికించారు. రాయలవారి కొలువులో సాహితీచర్చను ‘తెనాలి రామకృష్ణ’ చిత్రంలోని సన్నివేశాన్నే అనుసరించినట్టు కనిపించినా, ఇందులో దానిని సింగీతం వైవిధ్యంగా తెరకెక్కించారు.

‘ఆదిత్య 369’ చిత్రానికి పేకేటి రంగా కళాదర్శకుడు కాగా, ఈ చిత్రంలో విజయనగర సామ్రాజ్య సన్నివేశాలను సినిమాటోగ్రాఫర్ వి.యస్.ఆర్.స్వామి చిత్రీకరించారు. మిగతా సన్నివేశాలను కబీర్ లాల్ తమ కెమెరా పనితనంతో తెరకెక్కించారు. పేకేటి రంగాకు బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు కూడా లభించింది. ఈ చిత్రానికి శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి శ్రీమతి అనితాకృష్ణ పేరు నిర్మాతగా ప్రకటించారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు నిర్వహించారు.

అలరించిన పాటలు…
రాయలవారి కాలంలో సాగే “జాణవులే నెరజాణవులే…” , “సురమోదము…” పాటలను వేటూరి కలం సందర్భానుసారంగా పదప్రయోగాలతో రక్తి కట్టించగా, “సెంచరీలు కొట్టే వయస్సు మాది…” పాటనూ వేటూరి నవ్యరీతుల్లో రంజింప చేశారు. ఇక “రాసలీల వేళ…రాయబారమేల…” పాటను వెన్నెలకంటి, “చిలిపి యాత్రలో చల్ చల్…” పాటను సీతారామశాస్త్రి పలికించారు. పాటలన్నీ ఆ రోజుల్లో విశేషంగా జనాన్ని ఆకట్టుకున్నాయి.

ఇండియాలోనే మొదటిసారి…
‘ఆదిత్య 369’ బాక్సాఫీస్ వద్ద కూడా విజయం సాధించింది. అయితే ఆ సమయంలో వచ్చిన బాలకృష్ణ మాస్ మసాలా చిత్రాల వసూళ్ళతో పోలిస్తే, ఆ స్థాయిలో ‘ఆదిత్య 369’ కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయింది. అయితే సినిమా ప్రేమికులను మాత్రం ఓ ప్రయోగాత్మక చిత్రంగా అలరించింది. ఈ చిత్రాన్ని తమిళంలో “అపూర్వ శక్తి 369″గానూ, హిందీలో “మిషన్ 369″గానూ అనువదించారు. ఏది ఏమైనా మన దేశంలో టైమ్ ట్రావెల్ జానర్ లో రూపొందిన తొలి చిత్రంగా ‘ఆదిత్య 369’ నిలచింది. మరి తన నటవారసునిగా మోక్షజ్ఞను ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో బాలయ్య పరిచయం చేయాలనుకుంటున్నారు. అది ఎప్పుడు ఎలా సాకారమవుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-