పాత్ బ్రేకింగ్ మూవీ ‘ద్రోహి’కి పాతికేళ్ళు!

విశ్వనటుడు కమల్ హాసన్ నటించి, నిర్మించిన సినిమా ‘ద్రోహి’. దేశానికే సవాలు విసురుతున్న టెర్రరిస్టు గ్రూపులను నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వేసే ఎత్తులు, జిత్తుల నేపథ్యంలో ఇవాళ ఎన్నో సినిమాలు వస్తున్నాయి. వాటన్నింటికీ మూలం ‘ద్రోహి’ అనే చెప్పాలి. రొటీన్ ఫిల్మ్ మేకింగ్ పాత్ ను బ్రేక్ చేస్తూ, కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ కమల్ పాతికేళ్ళ క్రితమే ‘ద్రోహి’ని తీశారు. హిందీ చిత్రం ‘ద్రోహ్ కాల్’కు ఇది రీమేక్. అక్కడ ఓంపురి, నజీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషిస్తే, ఇక్కడ కమల్ హాసన్, అర్జున్ నటించారు. తమిళంలో తొలుత ‘కురుతి పునాల్’ గా రీమేక్ చేసి, ఆ తర్వాత తెలుగులో ‘ద్రోహి’ పేరుతో విడుదల చేశారు. 1995 అక్టోబర్ 23న దీపావళి కానుకగా తమిళ చిత్రం విడుదలైంది. అదే రోజున రజనీకాంత్ ‘ముత్తు’ కూడా రిలీజ్ అయ్యింది. అయినా ఆ గట్టి పోటీని తట్టుకుని నిలిచింది ‘కురుతి పునాల్’. అయితే తెలుగు సినిమా మాత్రం ఆ తర్వాత సంవత్సరం 1996 జూలై 7న రిలీజైంది. అంటే ఈ రోజుకు పాతికేళ్ళు పూర్తి చేసుకున్నట్టు.

విశేషం ఏమంటే… హిందీలో ‘ద్రోహ్‌ కాల్’ మూవీని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గోవింద్ నిహలానీ డైరెక్ట్ చేశాడు. ఈ ‘ద్రోహి’ని సైతం సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా ఆయనకు ఇది రెండో సినిమా. ‘ద్రోహ్ కాల్’ మూవీ ప్రివ్యూకు ముంబై వెళ్ళిన కమల్ హాసన్, పి.సి. శ్రీరామ్ ఆ సినిమా చూడగానే రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. కమల్ హాసన్ దీనిని తన సోదరుల పేరుతో నిర్మించడమే కాకుండా స్క్రీన్ ప్లే సమకూర్చాడు.

కథ విషయానికి వస్తే డి.సి.పి. ఆదినారాయణ, అబ్బాస్ మంచి మిత్రులు. దేశంలో అరాచకత్వాన్ని సృష్టిస్తున్న టెర్రరిస్టు గ్రూపులను నాశనం చేయడమే వీళ్ళ పని. అందులో భాగంగా ఆపరేషన్ ధనుష్‌ పేరుతో ఓ సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టి ఇద్దరు యువకులను టెర్రరిస్ట్ గ్రూప్ లోకి పంపుతారు. వాళ్ళు ఇచ్చే సమాచారంతో బద్రీ అనే టెర్రరిస్ట్ నాయకుడు తలపెట్టిన అరాచకాలకు అడ్డుకట్ట వేస్తారు. అయితే ఊహించని విధంగా బ్రది… ఆది, అబ్బాస్ చేతికి చిక్కుతాడు. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలోనే తమ డిపార్ట్ మెంట్ లోనే ఓ కీలక అధికారి టెర్రరిస్టులకు సాయం చేస్తున్న విషయం వీరికి తెలుస్తుంది. దేశం కోసం ఓ పక్క నవయువకులైన పోలీసులు ప్రాణాలు అర్పిస్తుంటే… మరికొందరు తమ స్వార్థం కోసం దేశద్రోహానికి పాల్పడటాన్ని వీళ్ళు సహించలేకపోతారు. దురదృష్టవశాత్తు టెర్రరిస్టుల చేతికి చిక్కి అబ్బాస్ మరణిస్తే… సీక్రెట్ ఆపరేషన్ ను సక్సెస్ చేసే క్రమంలో ఆది ప్రాణాలు విడుస్తాడు.

కమల్ హాసన్ కోరిక మేరకు అర్జున్ కనీసం కథ కూడా తెలుసుకోకుండానే ఈ చిత్రంలో నటించడం ఓ విశేషం అయితే, సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ ‘శుభసంకల్పం’ తర్వాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఇందులో తన ఇమేజ్ కు పూర్తి భిన్నమైన పాత్రను ఆయన పోషించారు. అదే ప్రేక్షకులను సంభ్రమకు గురిచేసింది. ఇక టెర్రరిస్ట్ నాయకుడిగా నాజర్ అద్భుతమైన నటన కనబరిచాడు. సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని కేవలం 30 రోజుల్లో షూటింగ్ ను ఫినిష్ చేశారు. ఇందులో అర్జున్ భార్యగా గీత, కమల్ భార్యగా గౌతమి నటించారు. దానికి ముందు కమల్, గౌతమి మూడు నాలుగు సినిమాల్లో జంట కట్టారు. అయితే… ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇరవై యేళ్ళకు ‘పాపనాశం’లో కలిసి మరో నటించారు. కమల్ హాసన్ శ్రీమతి సారిక ఆడియోగ్రఫీ విభాగాన్ని పర్యవేక్షించారు. ఈ చిత్రానికి దర్శకుడు పి. సి. శ్రీరామే సినిమాటోగ్రఫీ అందించారు. పాటలు లేని ఈ మూవీకి మహేశ్ అందించిన నేపథ్య సంగీతం బాగా ప్లస్ అయ్యింది. ఇతనే ఆ తర్వాత తెలుగులో ‘ప్రేమించుకుందాం రా, పెళ్ళాడి చూపిస్తా, పాడుతా తీయగా’ సినిమాలకు సంగీతం అందించాడు.

క్లాసిక్ కాప్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని కలిగించింది. ఈ మూవీ తమ మీద ఎంతో ప్రభావం చూపించిందని దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్, ఎ. ఆర్. మురుగదాస్ చెబుతుంటారు. భారతదేశంలో డాల్బీ స్టీరియో సరౌండింగ్ తో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే. అలానే ఆస్కార్ కి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరిలో ఎంపికైంది కానీ అక్కడ మాత్రం నామినేషన్ దక్కలేదు. అయినా… ఈ రీమేక్ ఒరిజినల్ మాదిరే ఉందని గోవింద్ నిహలాని మెచ్చుకోవడమే తనకు గొప్ప అవార్డ్ అంటారు పి.సి. శ్రీరామ్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-