పాతికేళ్ళ బాల‌కృష్ణ‌ పెద్ద‌న్న‌య్య‌

(జ‌న‌వ‌రి 10తో బాల‌కృష్ణ పెద్ద‌న్న‌య్య‌కు 25 ఏళ్ళు)
తెలుగు చిత్ర‌సీమ‌లో ద్విపాత్రాభిన‌యంతో అపురూప విజ‌యాలు చూసిన ఘ‌న‌త నిస్సందేహంగా న‌ట‌ర‌త్న య‌న్.టి.రామారావుకే ద‌క్కుతుంది. ఆ త‌రువాతి త‌రంలో ఆయ‌న న‌ట‌వార‌సుడు బాల‌కృష్ణ అదే తీరున సాగారు. డ్యుయ‌ల్ రోల్ లో బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూసిన బాల‌కృష్ణ తాజాగా అఖండ‌తోనూ అదే తీరున ద్విపాత్రాభిన‌యంతో ఆక‌ట్టుకున్నారు. పాతికేళ్ళ క్రితం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చి, సంద‌డిచేసిన పెద్ద‌న్న‌య్య‌లోనూ బాల‌య్య త‌న‌దైన అభిన‌యంతో అన్న‌ద‌మ్ములుగా న‌టించి అల‌రించారు. 1997 జ‌న‌వ‌రి 10న విడుద‌లైన పెద్ద‌న్న‌య్య‌ చిత్రం ఆ నాటి పొంగ‌ల్ హంగామాలో అత్య‌ధిక వ‌సూళ్ళు చూసిన చిత్రంగా నిల‌చింది. రామ‌కృష్ణా హార్టీ క‌ల్చ‌ర‌ల్ స్టూడియోస్ ప‌తాకంపై నంద‌మూరి రామ‌కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సీమ పౌరుషాల‌కు పేరు సంపాదించి పెట్టిన చిత్రంగా స‌మ‌ర‌సింహారెడ్డి చిత్రాన్ని ముందుగా గుర్తు చేసుకుంటారు.కానీ, ఈ పెద్ద‌న్న‌య్య‌లోనే సీమ పౌరుషం క‌నిపిస్తుంది. శ‌త్రువు త‌మ‌పై దాడిచేసి పైచేయి అనిపించుకుంటే, పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు ఇవ్వ‌కుండా, అద‌ను కోసం ఎదురుచూసే ప‌గ‌ల‌సెగ‌ల‌తో ఈ క‌థ రూపొందింది. రామ‌కృష్ణ ప్ర‌సాద్ త‌న పిన‌తండ్రి కుమారుల ఆల‌నాపాల‌నా చూస్తూ, ఉమ్మ‌డి కుటుంబంలో ఇంటిపెద్ద‌గా సాగుతూ ఉంటారు. ఒక‌ప్పుడు రామ‌కృష్ణ ప్ర‌సాద్ కు ఆప్త‌మిత్రుడైన భాస్క‌ర్ నాయుడు త‌న సోద‌రులు చేసినది త‌ప్పే అయినా, ప‌గ పెంచుకుంటాడు. ఆ పోరాటంలో రామ‌కృష్ణ ప్ర‌సాద్ బాబాయ్ ప్రాణాలు పోతాయి. దాంతో త‌న పిన‌తండ్రి పిల్ల‌లు పెరిగి పెద్దఅయ్యే వ‌ర‌కు తాను పెళ్ళి చేసుకోన‌ని భీష్మ ప్ర‌తిజ్ఞ చేస్తాడు. అత‌డే ప్రాణంగా భావించే మ‌ర‌ద‌లు సీతామ‌హాల‌క్ష్మి సైతం బావ‌మాట‌ను శిర‌సావ‌హించి, అత‌ను ఎప్పుడంటే అప్పుడే పెళ్ళి అని ఎదురుచూస్తూ ఉంటుంది. రామ‌కృష్ణ త‌న బాబాయ్ త‌న‌యులైన సాయిప్ర‌సాద్, దుర్గా ప్ర‌సాద్, భ‌వానీ ప్ర‌సాద్ ను చ‌దివించి ప్ర‌యోజ‌కుల‌ను చేస్తాడు. భ‌వానీ ప్ర‌సాద్ అచ్చు రామ‌కృష్ణ పోలిక‌ల‌తోనే ఉంటాడు. అత‌ను కాలేజ్ స్టూడెంట్, ప్రేమించి ఓ అమ్మాయిని పెళ్లాడాల‌నుకుంటాడు. అయితే ఆ అమ్మాయి త‌ల్లి కుల‌ట అని ఆమె త‌మ ఇంటి కోడ‌లు కాజాల‌దు అని అన్న‌లు చెబుతారు. దాంతో భ‌వానీ, త‌న ప్రేయసితో బ‌య‌ట ఉండాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. రామ‌కృష్ణ ప్ర‌సాద్ కు ఇది సంక‌ట ప‌రిస్థితి అవుతుంది. దీనిని ఆస‌రాగా తీసుకొని భాస్క‌ర నాయుడు, రామ‌కృష్ణ‌ను అవ‌మానాల పాలు చేయాల‌ని చూస్తాడు. అందుకు రామ‌కృష్ణ ప్ర‌సాద్ మ‌ర‌ద‌లు తండ్రి చెంచురామ‌య్య కూడా తోడ‌వుతాడు. త‌మ్ముళ్ళు విడిపోయార‌న్న బాధ‌తో ఉన్న రామ‌కృష్ణ‌కు ఎవ‌రు ఇవ‌న్నీ చేయిస్తున్నారో తెలుస్తుంది. ఈ పోరాటంలో సీతామ‌హాల‌క్ష్మి ప్రాణాలుపోతాయి. రామ‌కృష్ణ ఎవ‌రినీ లెక్క‌చేయ‌కుండా వెళ్లి త‌న మ‌హాల‌క్ష్మి ప్రాణాలు తీసిన వారిని మ‌ట్టు పెట్టాకే ఆమె చితికి నిప్పుపెట్టి తానూ ప్రాణం విడుస్తారు. అన్న త‌మ‌కోసం చేసిన త్యాగం తెలిసిన త‌మ్ముళ్ళు మ‌ళ్ళీ ఒక్క‌టి అవ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఇందులో సీతామహాల‌క్ష్మిగా రోజా, భ‌వానీ ప్రియురాలు శ్రావ‌ణిగా ఇంద్ర‌జ న‌టించారు. మిగిలిన పాత్ర‌ల్లో కోట శ్రీ‌నివాస‌రావు, చ‌ర‌ణ్ రాజ్, ఎమ్. బాల‌య్య‌, అన్న‌పూర్ణ‌, బ్ర‌హ్మానందం, అచ్యుత్, రాజ్ కుమార్, శ్రీ‌హ‌రి, సుధాక‌ర్, చ‌ల‌ప‌తిరావు, రాజా ర‌వీంద్ర‌, లతాశ్రీ‌, ప్ర‌సాద్ బాబు, ర‌జిత‌, కృష్ణ‌వేణి, ఆల‌పాటి ల‌క్ష్మి క‌నిపించారు. ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ర‌చ‌న చేశారు. ఈ సినిమాకు కోటి సంగీతం స‌మ‌కూర్చారు. కుటుంబం అన్న‌గారి కుటుంబం... అంటూ సాగే పాట‌ను సి.నారాయ‌ణ రెడ్డి రాశారు. చిక్కింది చేమంతి... అనే పాట‌ను భువ‌న‌చంద్ర అందించారు. మిగిలిన ఓ ముస్త‌ఫా..., నీ అంద‌మంత‌..., క‌ల‌లో క‌ళ్యాణ మాల‌..., చ‌క్కిలాల చుక్క‌... పాట‌ల‌ను వేటూరి క‌లం ప‌లికించింది. ఈ చిత్రానికి బాల‌కృష్ణ అన్న మోహ‌న్ కృష్ణ సినిమాటోగ్రాఫ‌ర్.

1997 సంక్రాంతికి జ‌నం ముందు నిల‌చిన అన్ని చిత్రాల్లోకి పెద్ద‌న్న‌య్య‌ బిగ్ హిట్ గా నిల‌చింది. హైద‌రాబాద్ లో ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్ర‌కారం శాంతి థియేట‌ర్ లో 20 రోజుల‌కే షిఫ్ట్ చేసినా, ఈ సినిమా మంచి వ‌సూళ్ళు చూడ‌డం అప్ప‌ట్లో పెద్ద‌గా చ‌ర్చించుకున్నారు. ఇక రాయ‌ల‌సీమ‌, ఆంధ్ర‌లో 37 కేంద్రాల‌లో నేరుగా శ‌త‌దినోత్స‌వం చూసింది. ఈ సినిమా శ‌త‌దినోత్స‌వం ఘ‌నంగా జ‌ర‌పాల‌ని నిర్మాత నంద‌మూరి రామ‌కృష్ణ ప్లాన్ చేశారు. అయితే ఓ రోడ్డు ప్ర‌మాదంలో ఆయ‌నకు తీవ్ర గాయాల‌య్యాయి. అందువ‌ల్ల వంద‌రోజుల వేడుక జ‌రుప‌లేదు. ఏది ఏమైనా త‌న అన్న బాల‌కృష్ణ‌తో రామ‌కృష్ణ నిర్మించిన చిత్రాల‌లో పెద్ద‌న్న‌య్య‌ సూప‌ర్ హిట్ గా నిల‌చింది.

Related Articles

Latest Articles